కేసీఆర్ ప్రభుత్వ విధానాలనే రేవంత్ సర్కారు అనుసరిస్తుందా? లేక గులాబీ సర్కారుకు భిన్నంగా కాంగ్రెస్ సర్కారు ఉండబోతోందా? గత ప్రభుత్వం వ్యవసాయ సబ్సిడీలన్నీ ఎత్తేయగా రేవంత్ ప్రభుత్వం ఇప్పటివరకూ వీటిపై ఎలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకోకపోగా.. అసలు వ్యవసాయంపై ప్రత్యేక ప్రేమను కనబరచే ఉద్దేశంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవటంతో రైతన్నలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. జూలైలో అడుగు పెట్టినా తెలంగాణ రాష్ట్రంలో పెద్దగా వాన జాడ ఇంకా లేకపోవటంతో అసలు సర్కారైనా తమపై కరుణ చూపుతుందా అని అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు.
సబ్సిడీలు ఇయ్యకపోతే గుదిబండే..
వ్యవసాయ విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, డ్రిప్ ఇరిగేషన్ లకు ఉన్న సబ్సిడీ ఎత్తివేయటంతో రైతులకి అధిక భారం అయ్యింది. సబ్సిడీ అందక రైతులు చాలా నష్టపోయారు. గత సిఎం, మంత్రులకు రైతు సంఘాల నాయకులు, రైతులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా సబ్సిడీపై పట్టించుకోలేదు. కొత్త ప్రభుత్వంలో సబ్సిడీపై రైతులకి శుభవార్త ఉంటుందని ఆశతో ఉన్నారు. ఇప్పటివరకు ఐతే ఎలాంటి ముందడుగు వేయలేదు, రైతు ప్రభుత్వం అని చెబుతున్న సిఎం, మంత్రులు వ్యవసాయ సబ్సిడీపై రైతులకి శుభవార్త చెబుతారని ఆశతో ఎదురు చూస్తున్నారు.
ఆంక్షలు-రాయితీల..
పెట్టుబడి భారం కాకుండా కొంతమేర ఉపశమనంగా ప్రభుత్వం ప్రతీ సీజన్‌లో విత్తనాలు, వ్యవసాయ ఉపకరణాలపై సబ్సిడీలు ఇచ్చేది. గడిచిన వానాకాలం నుంచి ఈ సబ్సిడీలను నిలిపివేసింది. దీంతో రైతులపై విత్తనాలు, వ్యవసాయ పనిముట్లపై అదనపు భారం పడుతోంది. వానాకాలంలో నియంత్రిత సాగు విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టగా విత్తనాల అమ్మకాలపై కూడా ఆంక్షలు విధించింది. గతంలో ఆయా సీజన్‌లలో ప్రధానంగా సాగుచేసే పంటలకు సంబంధించిన విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేసేది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రోస్ లాంటి సంస్థల ద్వారా ఆ విత్తనాల్లో కొంతమేర రాయితీ ఇచ్చేది. కానీ, వానాకాలం నుంచి విత్తనాలపై ఇస్తున్న రాయితీని తీసివేసింది. దీంతో రైతులు ప్రైవేటుగా విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. అలాగే వ్యవసాయ ఉపకరణాలపై గడిచిన కొన్ని సీజన్ల నుంచి సబ్సిడీ ఎత్తివేయడంతో రైతులపై తీవ్ర భారం పడుతోంది. పనిముట్లను బట్టి 50 శాతం వరకు గతంలో ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేది. ఇప్పుడు అవి ఇవ్వక పోవడంతో రైతులు ఉపకరణాలపై వెచ్చించాలంటే జంకుతున్నారు. గతంలో వెచ్చించిన దాని కంటే డబుల్ అవుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. రైతుబంధు ద్వారా డబ్బులు ఇస్తున్నప్పటికీ పడిపోతున్న దిగుబడుల కారణంగా నష్టాలే వస్తున్నాయని, సబ్సిడీలను పునరుద్ధరిస్తే మేలు జరుగుతుందని రైతులు చెబుతున్నారు. ఇకనైనా ప్రభుత్వ యంత్రాంగం సబ్సిడీ వ్యవస్థపై ముందడుగు వేసి రైతులకి న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఇది ఓ రైతు గోస..
“వ్యవసాయ విత్తనాలు, పనిముట్లు, బిందు సేద్యంలకు సబ్సిడీ ఎత్తివేత వల్ల రైతులం చాలా నష్టపోతున్నం, కొత్త ప్రభుత్వంలో నైన సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకోవాలి, విత్తనాలకు అధిక రెట్లు పెరగటం వల్ల రైతులకు అధిక భారం కలుగుతుంది, డ్రిప్ ఇరిగేషన్ పై సబ్సిడీ ఉంటే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రభుత్వం వ్యవసాయ సబ్సిడీపై ద్రుష్టి సారించి రైతులకి న్యాయం చేయాలి”.
కాటిపల్లి వినోద్ రెడ్డి, కొత్త దామ్ రాజ్ పల్లి రైతు