ఏడేళ్ల క్రితం ఇదే నెలలో కన్నుమూసిన పుల్లెల శ్రీరామచంద్రుడు ఒక సాహితీ విజ్ఞాన సర్వస్వంగా వెలిగిపోయిన పుంభావ సరస్వతి. ఒక్క చేతి మీదుగా సంస్కృత విజ్ఞానాన్ని తెలుగులో వ్యాఖ్యానించి, విశ్లేషించి, తెలుగు భాషాభిమానులకు అందించారు. ఆయన రాసిన దాదాపు 200 పుస్తకాలలో అలంకార శాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, వేదాంతం, ధర్మశాస్త్రం వంటివి ఎన్నో ఉన్నాయి. భరతుడి నాట్య శాస్త్రాన్ని పరమ ప్రామాణికంగా, మూలంతో సహా తెలుగువారికి అందించిన వ్యక్తి ఆయన. ఇక అభినవ గుప్తుడి వ్యాఖ్యానంతో ఉన్న ఆనందవర్ధనుడి ధ్వన్యాలోకం ఆయన వల్లే పరిపూర్ణంగా తెలుగు వారికి అందింది. ఇక దండి కావ్యాదర్శం, భామహుడి కావ్యాలంకారం, వామనుడి అలంకార సూత్ర వృత్తి, కుంతకుడి వక్రోక్తి జీవితం, ముమ్మటుడి కావ్యదర్శనం, రాజశేఖరుడి కావ్య మీమాంస వంటివి అపురూప సంస్కృత గ్రంథాలతో తెలుగువారికి పరిచయం కలిగిందంటే అది ఆయన చలవే. అంతేకాదు, అతి ముఖ్యమైన శాస్త్ర గ్రంథాల్లో ఒకటైన కౌటిల్యుడి అర్థ శాస్త్రాన్ని ఆయనే సాధికారంగా తెలుగులోకి అనువదించారు.
ఈ గ్రంథాలన్నిటికీ ఆయన రాసిన ఉపోద్ఘాతాలు, వ్యాఖ్యానాలు ఇటు ఆధునిక రచనా సంప్రదాయాల్ని, అటు ప్రాచీన శాస్త్ర సంప్రదాయాల్ని రెంటినీ సమర్థంగా అనుసరిస్తాయి. ఏ విషయాన్నయినా నేరుగా, స్పష్టంగా, ముక్కుసూటిగా చెప్పడంలో ఆయనను మించిన సాహితీవేత్త లేరు. క్లిష్టమైన శాస్త్ర విషయాలను సైతం ఆయన స్పష్టమైన వచనంలో చెప్పగలరు. అన్నిటికన్నా ముఖ్యమైన విశేషమేమిటంటే, ఆయన అభినవ గుప్తుడి వంటి పరమ ప్రామాణికుడైన సాహితీవేత్త వాదనను కూడా నిస్సందేహంగా ఖండించేవారు. జగన్నాథ పండిత రాయలు మీద ఆయన ఇంగ్లీషులో రాసిన రెండు భాగాల మహా గ్రంథం ఆయనకు అటు జగన్నాథ పండిత రాయలు మీదా, ఇటు అలంకార శాస్త్రం మీద ఆయనకున్న అధికారాన్ని చెప్పకనే చెబుతాయి. ఆయన రాసిన ప్రతి శాస్త్ర గ్రంథంలోనూ ఆయన స్వతంత్రంగా ప్రతిపాదించిన కొత్త సమన్వయాలు, కొత్త భాష్యాలు తిరుగులేనివనే చెప్పాల్సి ఉంటుంది. ఆయన రాసిన బ్రహ్మసూత్ర శాంకర భాష్యం వేదాంత పండితులకు తప్ప మరొకరికి అర్థం కానీ విషయమే అయినప్పటికీ, ఆయన రాసిన వ్యాఖ్యానం సహాయంతో చదివితే మాత్రం పామరులకు సైతం బోధపడుతుంది.
కౌటిల్యుడి అర్థ శాస్త్రం పేరు చెప్పగానే 15వ శతాబ్ద కాలంలో మేకియవిల్లి రాసిన ‘ది ప్రిన్స్’ అనే రాజనీతి గ్రంథాన్ని ఆధునికులు పోలిక తీసుకు వస్తారు. అయితే, మేకియవిల్లికీ, కౌటిల్యుడికీ ఎక్కడా పోలిక లేదని చక్కని ఉదాహరణలు, ఉపపత్తులతో నిరూపించారు పుల్లెల శ్రీరామచంద్రుడు. ఆయన పరమ సంప్రదాయవాదిలా కనిపిస్తారు. కానీ, సంప్రదాయాలకు దాసుడు కాడు. ఆయన పరమ ఆధునికుడు. అలా అని ఆధునికత పట్ల ఆయనకు ఏమాత్రం వ్యామోహం లేదు. కావ్యాలను వ్యాఖ్యానించేటప్పుడు, విశ్లేషించేటప్పుడు ఆయన అవసరమైతే ఆధునిక సంప్రదాయ పద్దతులను కూడా అనుసరించేవారు. ఆయన తన ప్రతి పుస్తకంలోనూ దేవతల అనుగ్రహం, తల్లిదండ్రుల తపస్సు, గురువుల కృప గురించి తప్పకుండా ప్రస్తావించారు. ఇవే తన పుస్తకాల కర్తలనీ, తాను కేవలం ఉపకరణం మాత్రమేనని ఆయన చెప్పుకునేవారు. ఆయన తెలుగువాడై పుట్టడం తెలుగువారి అదృష్టం. ఆయనను మరింతగా గౌరవించుకోలేక పోవడం తెలుగువారి దురదృష్టం.