ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ జిల్లా ఫూల్రాయ్ గ్రామంలో గత 2న జరిగిన దుర్ఘటన దేశ చరిత్రలో కనీ శాశ్వతంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ఇక్కడ ఒక మత కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం, ఎంతో మంది గాయపడడం యావద్దే శాన్ని కలచి వేసింది. నిజానికి, భారతదేశంలో ఇటువంటి దుర్ఘటనలు ఎక్కడో అక్కడ తరచూ చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఒక్క మత సంబంధమైన కార్యక్రమాల్లోనే కాదు, ఎక్కువ సంఖ్యలో జనం ఎక్కడ చేరినా ఇటువంటివి జరగడం సర్వ సాధారణమైపోయింది. సాధారణంగా మత కార్యక్రమాల్లోనే ఇటువంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. ఇటువంటి కార్యక్రమాల్లో సరైన సౌకర్యాలు, నిబంధనలు, పద్ధతులు అమల్లో ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇందులో పాల్గొనేవారి సంఖ్య మీద నియం త్రణ ఉండదు. ఫూల్రాయ్ గ్రామంలో కూడా ఇదే జరిగింది. హత్రాస్ జిల్లాలోని ఈ కుగ్రామం లో ఈ మత కార్యక్రమాన్ని నిర్వహించారు కానీ, ఇక్కడ ప్రజలను నియంత్రించడానికి ఎటువంటి ప్రయత్నాలూ లేవు. పైగా కనీస వైద్య వసతులు కూడా ఇక్కడ లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ మధ్యనే ఇక్కడ ప్రజాదరణ పొందుతున్న భోలే బాబా అనే మత గురువు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
నిజానికి, ఈ కార్యక్రమాన్ని చూసిన వారికి ఇక్కడ ప్రమాదం జరగడానికి ఎక్కువ అవకాశాలు న్నాయనే అభిప్రాయం కలగక మానదు. ఈ కార్యక్రమంలో ఎంత మంది పాల్గొంటారనే విష యంలో నిర్వాహకులకు గానీ, కొద్ది మంది పోలీసులకు గానీ ఏమాత్రం అవగాహన లేదు. ఈ కార్య క్రమం చాలా చిన్న హాలులో జరిగింది. కార్యక్రమానికి లక్షకు మందికి పైగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అధికారుల అనుమతి ఉందా, లేదా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. దీనికి హాజరయ్యే జన సంఖ్యను బట్టే అనుమతి ఇవ్వాలా, వద్దా అన్న నిర్ణయం జరుగుతుంది. అయితే, ఇక్కడికి వచ్చే ప్రజల సంఖ్య గురించి ఎవరికీ ఎటువంటి అవగాహనా లేదు. భోలే బాబా వచ్చి వెళ్లడానికి వీలుగా ఒక ద్వారాన్ని మాత్రమే తెరచి ఉంచి, మిగిలిన ద్వారాన్ని మూసేయడం జరిగింది. తొక్కిసలాట జరగ డానికి, ప్రాణ నష్టం ఎక్కువగా జరగడానికి ఇదే ప్రధాన కారణం. గాయపడిన వారికి చికిత్స అందించడానికి ఈ గ్రామంలో ప్రాథమిక సౌకర్యాలు కూడా లేవు. వారిని సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు తరలించడానికి రవాణా సౌకర్యాలు కూడా లేవు. అత్యవసర పరిస్థితిలో స్పందించడానికి వీలుగా సరైన సిబ్బంది కూడా అక్కడ లేకపోవడం దిగ్భ్రాంతి కలిగించే విషయం.
ఈ కార్యక్రమానికి హాజరయిన వారంతా బడుగు వర్గాలకు చెందినవారు. భోలే బాబా శిష్యులు, భక్తులంతా బడుగు వర్గాల వారే. ఇందులో కొందరిని గుర్తించడం కూడా కష్టమే. భోలే బాబా, నిర్వాహకులు, అధికారులు వగైరాలంతా వివిధ స్థాయిల్లో ఈ దుర్ఘటనకు బాధ్యులే. వీరిని తప్పకుండా శిక్షించాల్సిన అవసరం ఉంది. అయితే, చివరికి వీరినెవరినీ శిక్షించకపోవచ్చు. సాధారణంగా ఇటువంటి దుర్ఘటనల మీద విచారణకు కమిటీలను నియ మించడం జరుగుతుంది. కానీ, అవి దర్యాప్తు నివేదికలు సమర్పించకపోవచ్చు. అవి నివేది కలు సమర్పించినా వాటి మీద చర్య తీసు కునే అవకాశం ఉండకపోవచ్చు. పైగా, ఈ భోలే బాబాకు రాజకీయ సంబంధాలు కూడా ఉన్నాయి. ఇటువంటి దుర్ఘటనలు జరిగినప్పుడు మాత్రం భద్రతా ఏర్పాట్ల గురించి, నివారణ చర్యల గురించి, అత్యవసర సౌకర్యాల గురించి మంత్రులు, అధికారులు హడావిడి పడడం కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ దుర్ఘటన కాల గర్భంలో కలిసిపోతుంది.
ప్రాథమిక సౌకర్యాలు, అత్యవసర చర్యలు, రవాణా ఏర్పాట్లు, వైద్య సదుపాయాలు, అధికారుల నియంత్రణ వంటివి లోపించిన పక్షంలో ఇటువంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉంటాయి. తొక్కిసలాటలు జరగడమనేది మానవ తప్పిదాలే అవుతాయి తప్ప ఇందుకు ఇతర కారణాలు కనిపించవు. ఇటువంటి కార్యక్రమాలు, సమావేశాలకు తప్పనిసరిగా ముందుస్తు అనుమతి చేసుకోవాలనే నిబంధనను కఠినంగా అమలు చేయాలి. ఆ తర్వాత కూడా అధికారుల పర్యవేక్షణ ఉండాలి. పోలీసుల ద్వారా భద్రతను ఏర్పాటు చేయాలి. రవాణా సౌకర్యాలను అందుబాటులో ఉంచాలి. మత కార్యక్రమాల్లో ఇటువంటివి జరిగే అవకాశం ఉందన్న కనీస అవగాహనను అధికారులకు కలిగించాలి.