పులివెందులలో పాతికేళ్ల యువకుడు అజయ్ మీద తెలుగుదేశం పార్టీ నేతలు నిర్ధాక్షిణ్యంగా దాడిచేసిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. పులివెందులలో ఇంతవరకు ఇలాంటి సాంప్రదాయం లేదని… ఎన్నికలు అయిపోయిన తర్వాత తమకు ఓటు వేయని వారి పై దాడి చేసి కొట్టే కార్యక్రమం ఎప్పుడూ జరగలేదన్నారు. కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయానక వాతావరణం క్రియేట్ చేయడానికే ఈ తరహా దాడులు దగ్గరుండి చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఈ తరహా దాడులతో ఏం సాధిస్తారని వైయస్.జగన్ అధికార తెలుగుదేశం పార్టీని నిలదీశారు.
తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఈ రకమైన దాడులకు పాల్పడ్డం ద్వారా చెడు సాంప్రదాయానికి బీజం వేస్తున్నారని… రేపు పొద్దున్న మరల టీడీపీ కార్యకర్తలకు ఇది చుట్టుకొంటుందని జగన్ హెచ్చరించారు.
ఈ మాదిరిగా భయాందోళనలు క్రియేట్ చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారిపై దాడులకు పాల్పడ్డం ద్వారా చంద్రబాబు నాయుడు ఒక తెలియని ఆనందం పొందుతున్నారన్నారు. ఈ దాడులతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్ మోహన్ రెడ్డి, ఇలాంటి దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.
ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరని… అధికారం మారిన రోజున చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ అన్యాయాలు శిశుపాలుని పాపాలు మాదిరిగా పండే రోజు వస్తుందని హెచ్చరించారు. ఆ రోజున ఇవాళ చేస్తున్న చెడు సాంప్రదాయం తనకే చుట్టుకుంటుందన్నారు.
ఇవాళ అధికార తెలుగుదేశం పార్టీ చేతిలో దెబ్బలు తగిలిన ప్రతి ఒక్కరూ కూడా రేపొద్దున్న ఇదే మరలా అటువైపు చేసేదానికి మీ అంతట మీరే బీజం వేస్తున్నారని.. ఇది సరైన పద్దతి కాదని హెచ్చరించారు. నాయుకులుగా ఉన్న మనలాంటి వాళ్లం ఇలాంటివి ప్రోత్సహించాల్సిన పని రాకూడదు, జరగకూడదదని హితవు పలికారు. ఈ తరహా దాడులకు పాల్పడే సాంప్రదాయం సరికాదని… వీటిని ఆపమని చంద్రబాబునాయుడు గారిని మరొక్కసారి హెచ్చరిస్తున్నానన్నారు.
రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకంతో సహా, ఏ వ్యవస్ధ సరిగ్గా జరగడం లేదని, వ్యవస్ధను గాడిలో పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. తెలుగుదేశం పార్టీ చేసిన మోసపూరిత వాగ్ధానాల వలన మాకు రావాల్సిన పదిశాతం ఓట్లు మీకు వచ్చాయన్న జగన్.. ప్రజలు మీ దగ్గర నుంచి మీరిచ్చిన వాగ్ధానాలు అమలు చేయాలని ఆశిస్తున్నారన్న విషయాన్ని అధికార పార్టీకి గుర్తు చేశారు. రైతుభరోసా డబ్బులు అందక అన్నదాతలు, అమ్మఒడి అందక పిల్లల తల్లులు ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు.
నెలనెలా అక్కచెల్లెమ్మలకు రూ.1500 ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంటింటికీ ఉద్యోగం, అది ఇవ్వలేకపోతే రూ.3వేలు నిరుద్యోగభృతి ఇస్తామన్న విషయాన్ని గుర్తు చేసిన జగన్, వాటి కోసం ఆ పిల్లలందరూ ఎదురుచూస్తున్నారన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏవీ చేయకుండా… రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళనలు మాత్రమే క్రియేట్ చేసే దుర్భుద్ధిని, చేసే దుశ్చర్యలను ఆపాలన్నారు. శిశుపాలుని పాపాల పండినట్టుగా వేగంగా చంద్రబాబు పాపాలు పండుతున్నాయన్న విషయాన్ని తను మర్చిపోవద్దని మరోక్కసారి హెచ్చరిస్తున్నానన్నారు.