వచ్చే అయిదేళ్ల కాలంలో పార్లమెంటు ఉభయ సభల్లో చర్చలు, వాగ్వాదాలు ఎలా ఉండబోతున్నాయో మొన్నటి సమావేశాలు చూచాయగా అద్దం పట్టాయి. పద్దెనిమిదవ లోక్ సభ సమావేశాలు, రాజ్యసభ సమావేశాలు వాడిగా, వేడిగా ప్రారంభం అయ్యాయి. పాలక, ప్రతిపక్షాలు తమ తమ ప్రసంగాలతో సభలను అట్టుడికించాయి కానీ, ఒక్కోసారి హద్దులు మీరడం కూడా జరిగింది. ఉభయ పక్షాల పనితీరుకు సంబంధించి వైవిధ్యాలు, వైరుధ్యాలు వ్యక్తం చేసుకోవడం జరిగింది. ఎన్నికలతో ముగిసిందనుకున్న ప్రచారాన్ని పాలక, ప్రతి పక్షాలు ఈ సమావేశాల్లో కూడా కొనసాగించడం విశేషం. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగం మీదా, ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చలు చోటు చేసుకున్నాయి. ఉభయ పక్షాలు తమ విధానాలు, కార్యక్రమాల మీద కాకుండా ఎక్కువగా పరస్పర విమర్శలు, ఆరోపణలకు ప్రాధాన్యం ఇవ్వడం కూడా జరిగింది. నిజానికి ఇక్కడ జరిగినవి చర్చలు, గోష్ఠులు కావు. అపనమ్మకాలు, వైషమ్యాలే రాజ్యమేలాయి. ఇవి పార్లమెంటరీ విలువలకు పూర్తిగా భిన్నం. వీటినిబట్టి రానున్న కాలంలో పార్లమెంటు సమావేశాలు ఎలా ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సంఖ్యాబలం 99కి పెరగడంతో ఆ పార్టీలో ఆత్మవిశ్వాసం ఇనుమడించింది. చాలా ఏళ్ల తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ తన మొట్టమొదటి ప్రసంగాన్ని చేసి, పార్టీ సభ్యుల్లో ఉత్తేజం కలిగించారు. పాలక పక్షం తీరుతెన్నుల మీద, వైఫల్యాల మీద తనదైన శైలిలో అస్త్రశస్త్రాలు సంధించారు. సహజంగానే కొంత అప్రస్తుత, అసందర్భ వ్యాఖ్యానాలు, వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. హిందూ మతం గురించి, అందులోనూ శివుడి గురించి లేశమాత్రంగా కూడా విషయ పరిజ్ఞానం లేని రాహుల్ గాంధీ వీటి గురించి ప్రస్తావించడం కొద్దిగా విమర్శలకు కారణమైనప్పటికీ, మొత్తం మీద ఆయన ప్రతిపక్ష నాయకుడి పాత్రను బాగానే పోషించినట్టు కనిపించింది. పాలక పక్ష సభ్యులు కూడా ఆయన ప్రసంగాన్ని సావధానంగా వినడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా యథాశక్తి కాంగ్రెస్ మీదా, ప్రతిపక్ష నాయకుడి మీదా మాటల అస్త్రాలను ప్రయోగించడం జరిగింది. ప్రతిపక్షాలు లేవనెత్తిన కొన్ని సమస్యలకు ఆయన తన పరిభాషలో సమాధానం ఇచ్చారు.
పాలక పక్ష సభ్యులు, కేంద్ర మంత్రులు రాహుల్ గాంధీ మీద వ్యక్తిగత విమర్శలు చేయడానికి వెనుకాడలేదు. అనేక సందర్భాల్లో ఆయన వ్యాఖ్యల మీద ఆక్షేపణలు వ్యక్తం చేయవలసి వచ్చింది. కాగా, మోదీ ప్రసంగాన్ని అడుగడుగునా అడ్డుకోవడం ద్వారా ప్రతిపక్షాలు కూడా సమావేశాల నాణ్యతను వీలైనంతగా తగ్గించాయి. మోదీ కూడా గత 16, 17 లోక్ సభ సమావేశాల్లో మాదిరిగానే ప్రతిపక్షాలను తీవ్ర పదజాలంతో అడ్డుకున్నారు. ప్రతిపక్షాల మీద, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీద ఆయన విరుచుకుపడ్డ తీరు ఆయనలో వాగ్దాటి ఏమాత్రం తగ్గలేదనడానికి ఉదాహరణగా మారింది. ఆయన మణిపూర్ సమస్య గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించి, ఆ రాష్ట్రంలో పరిస్థితిని సాకల్యంగా వివరించడం జరిగింది. ఎప్పటి మాదిరిగానే మణిపూర్ వ్యవహారం మీద ప్రధాని సమాధానం ఇవ్వకుండా ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేశాయి.
పార్లమెంటులో తప్పనిసరిగా ప్రజా సమస్యల మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. విధానాలు, నిర్ణయాలు, కార్యక్రమాలు, పథకాల మీద వాగ్వాదాలు జరగడం కూడా సహజమైన, సాధారణమైన విషయమే. ఇందుకు పాలక పక్షంతో పాటు ప్రతిపక్షాలు కూడా పూర్తిగా సహకరించాల్సి ఉంటుంది. అదే సమయంలో పాలక, ప్రతిపక్షాల విషయంలో సభాపతి, సభాధ్యక్షుడు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. సమావేశాలను, చర్చలను నిర్వహించడంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్కర్ నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి శాయశక్తులా కృషి చేశారు. పార్లమెంట్ సభల నిర్వహణలో తమకున్న అనుభవాన్ని వారు వీలైనంతగా ఉపయోగించుకున్నారు. సమావేశాల సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన కొన్ని అవాంఛనీయ వ్యాఖ్యలను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించడంపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి. ప్రతిపక్షాలను ముందుగా సంప్రదించకుండా స్పీకర్ ఎమర్జెనీపై తీర్మానాన్ని చదవడం కూడా విమర్శలకు గురైంది. స్పీకర్ కేవలం పాలక పక్షానికి చెందిన వ్యక్తిగా మాత్రమే వ్యవహరిస్తున్నారని, ఆయన ప్రతిపక్షాలను కూడా పాలక పక్షంతో సమానంగా ఆదరించాల్సి ఉంటుందని కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్షాలు వ్యాఖ్యానించాయి.