Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్AP Vs Telangana unresolved issues: విభజన సమస్యలు పరిష్కారమయ్యేనా ?

AP Vs Telangana unresolved issues: విభజన సమస్యలు పరిష్కారమయ్యేనా ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లయింది. అయితే ఇప్పటివరకు విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. గత ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడమే దీనికి ప్రధాన కారణం.ఈ నేపథ్యంలో విభజన సమస్యల పరిష్కారం దిశగా కలిసి నడవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఇటీవల హైదరాబాద్‌లో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. విభజన సమస్యలు అజెండాగా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రెండు కమిటీల ఏర్పాటుకు ఇద్దరూ అంగీకరించారు. ఇందులో ఒకటి అధికారుల కమిటీ కాగా మరోటి మంత్రుల కమిటీ. వాస్తవానికి విభజన సమస్యలు ఎప్పుడో పరిష్కారం కావలసింది.సమస్యల పరిష్కారంలో జాప్యం జరగడంతో రెండు తెలుగు రాష్ట్రాలు ఎంతగానో నష్టపోయాయి. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించుకోవాలి.

- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇదొక శుభ పరిణామం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి అడుగులు వేశారు. ఎప్పుడో జరగాల్సిన ఈ పని తాజాగా జరిగింది. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. నగరంలో చిరుజల్లులు పడుతున్న వేళ, ఆద్యంతం సుహృద్బావ వాతావరణంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని తొమ్మిది అలాగే పదవ షెడ్యూళ్లలోని అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రధానంగా చర్చించారు.విభజన సమస్యల పరిష్కారం దిశగా వేసిన అడుగులో భాగంగా రెండు కమిటీలను నియమించాలని ముఖ్యమంత్రుల సమావేశం నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండు రాష్ట్రాల మంత్రులతో ఒక కమిటీ అలాగే ఉన్నతాధికారులతో మరో కమిటీ వేయడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు అంగీకరించారు. ముందుగా ఉన్నతస్థాయి అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తారు. ఇందులో ఒక్కో రాష్ట్రం నుంచి చీఫ్ సెక్రటరీతో కలిసి ముగ్గురేసి అధికారులు ఉంటారు. తమ స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలపై ఈ కమిటీ దృష్టి పెడుతుంది. రెండు వారాల్లో ఈ కమిటీ సమావేశం కానున్నది. అధికారుల కమిటీ చాలా వరకు విభజన సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆశిస్తున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన పదేళ్లు దాటింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య అనేక విభజన సమస్యలున్నాయి. వీటిలో ప్రధానమైనది కృష్ణా నదీజలాల వివాదం. ఇది చాలాకాలంగా నడుస్తోంది. వివాదం తీవ్రతరమైనప్పుడల్లా కేంద్రం జోక్యం చేసుకుని ఓ కమిటీ వేస్తామని హామీ ఇచ్చి చేతులు దులుపుకునేది. దీంతో విభజన జరిగి పదేళ్లు దాటినా ఇప్పటికీ ఈ వివాదం పరిష్కారం కాలేదు. అసలు కృష్ణా నదీజలాల్లో తెలంగాణ వాటా ఎంత అనేది ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం లేదా సంబంధిత ట్రిబ్యునల్ తేల్చలేకపోయింది. ఇదొక్కటే కాదు భద్రాచలం విలీన గ్రామాల వివాదం మరొకటి. విభజన జరిగిన తొలి రోజుల్లోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం సమీపానగల ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌ లో విలీనం చేశారు. దీనిపై తెలంగాణ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటితో పాటు విభజన జరిగిన నాటికి ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆస్తుల పంపకం కూడా సరిగా జరగలేదు. దీనికి ప్రధాన కారణం రెండు రాష్ట్రాల్లో గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడమే.
విభజన చట్టంలోని పదో షెడ్యూల్‌లో అనేక కీలక అంశాలున్నాయి. వీటిని నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించుకోవాలని ఇద్దరు ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అలాగే విద్యుత్ బకాయిల అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. విద్యుత్ బకాయిల లెక్కలను ఉభయ రాష్ట్రాల అధికారులు ముఖ్యమంత్రుల ముందు ఉంచినట్లు రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే విద్యుత్ బకాయిల అంశాన్ని మరో సమావేశంలో చర్చిద్దామని చంద్రబాబు నాయుడు చెప్పినట్లు తెలుస్తోంది. కాగా కీలకమైన కృష్ణా నదీ జలాల వివాదం కూడా ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. కృష్ణా నదీ జలాల వివాదంపై ఇప్పటికిప్పుడు నిర్ణయాలు తీసుకోవడం తొందరపాటు చర్య అవుతుందని ఇద్దరు ముఖ్యమంత్రులు భావించినట్లు తెలిసింది. కీలకమైన ఈ అంశంపై మరో సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుందామని ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించుకున్నట్లు హైదరాబాద్ రాజకీయ వర్గాల సమాచారం.

దోస్తానా ఉన్నా ఫలితం సున్నా
విభజన తరువాత ఇటు తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో ప్రభుత్వ ఏర్పడింది. అదే సమయంలో అటు ఆంధ్రప్రదేశ్‌లో నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సర్కార్ ఏర్పడింది. అయితే విభజన జరిగిన తొలి రోజులు కావడంతో ఇద్దరు ముఖ్యమంత్రులకు సదరు సమస్యలపై దృష్టి పెట్టే సమయం లభించకపోవచ్చు. దీంతో విభజన సమస్యల పరిష్కారం దిశగా కసరత్తు చేసి ఉండకపోవచ్చు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌ కు అయితే అప్పటికి అసలు రాజధాని నగరమే లేదు. దీంతో నిపుణుల కమిటీ నివేదిక మేరకు కృష్ణా నదీ తీరాన ఉన్న అమరావతిని ఆంధ్రప్రదేశ రాజధానిగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు. అంతేకాదు 2014లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా శాసనసభ సాక్షిగా రాజధానిగా అమరావతికి జై కొట్టారు.దీంతో అమరావతిలో భవనాల నిర్మాణంపై చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టవలసి వచ్చింది. 2018లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గులాబీ పార్టీ మరోసారి విజయం సాధించింది. కేసీఆర్ రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 2019లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలిసారి అధికారంలోకి వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇటు కేసీఆర్ అటు జగన్మోహన్ రెడ్డి మధ్య మంచి దోస్తానాయే ఉంది. కేసీఆర్ పట్ల జగన్మోహన్ రెడ్డి ఎంతో గౌరవభావంతో మెలిగేవారు. అలాగే జగన్మోహన్ రెడ్డి పట్ల కేసీఆర్ కూడా అభిమానం చూపించేవారు. అయితే కేసీఆర్ , జగన్మోహన్ రెడ్డి మధ్య ఉన్న దోస్తానా వారిద్దరి వ్యక్తిగత ప్రయోజనాలు కాపాడుకోవడానికే పరిమితం అయిందన్న విమర్శలున్నాయి. ఒకరి ఇంటికి మరొకరు వెళ్లడం, కుటుంబసభ్యులతో ఉల్లాసంగా మాట్లాడటం, బొకేలు ఇవ్వడం, పుచ్చుకోవడం అంటివాటికే ఈ స్నేహం పరిమితమైందని రాజకీయ పరిశీలకులు పేర్కొన్నారు. అంతేకానీ ఏనాడూ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి ఇద్దరిలో ఏ ఒక్కరూ అడుగు ముందుకేయలేదన్న ఆరోపణలున్నాయి. అయితే ఈసారి ఉక్కు సంకల్పంతో విభజన సమస్యల పరిష్కారానికి కలిసి అడుగులేశారు. వాస్తవానికి చంద్రబాబు, రేవంత్ రెడ్డిది గురుశిష్య సంబంధం అంటారు రాజకీయ విశ్లేషకులు. రేవంత్ రెడ్డి సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఏమైనా, సమస్యలు ఎంత పెద్దవైనా, చర్చలతో పరిష్కారమవుతాయని ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ప్రపంచానికి చాటారు.

- ఎస్‌. అబ్దుల్ ఖాలిక్, సీనియర్ జర్నలిస్ట్ 63001 74320
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News