బల్కంపేట ఎల్లమ్మ తల్లి కొలిచిన వారి కొంగు బంగారంగా నిలుస్తూ భక్తులను అనుగ్రహిస్తోంది. ఆ అమ్మవారికి ప్రతి ఏడాది భక్తులు ఎంతో ఆనందోత్సాహాలతో కల్యాణోత్సవాలను నిర్వహించుకుంటారు. జమదగ్ని మహర్షి, రేణుకా ఎల్లమ్మ కల్యాణాన్ని కన్నుల పండువగా జరుపుతారు. అందులోనూ ఆషాడ మాసం వచ్చిందంటే సనత్ నగర్ నియోజకవర్గంలోని బల్కంపేటలో పండగ వాతావరణం నెలకొంటుంది. మూడు రోజుల పాటు జరిగే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాలకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. అలా ఈ ఏడాది జూలై 8వ తేదీన ఎల్లమ్మ కల్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఎదురుకోలు నిర్వహించగా రెండో రోజైన మంగళవారం అమ్మవారి కల్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు.పోతురాజుల ఆటలు,శివసత్తుల కోలాటాలు, డోలు చప్పుళ్ళ మధ్య భక్తులు కేరింతలు,వేషధారుల చిందులు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అభిజిత్ లగ్నంలో ముహుర్తం..
మంగళవారం ఉదయం ప్రారంభమైన ఎల్లమ్మ కల్యాణోత్సవం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది.వేద పండితులు ఉదయం 11.34 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో కల్యాణాన్ని వేదమంత్రోచ్ఛరణల మధ్య భక్తిశ్రద్ధలతో జరిపించారు.ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి 27 చీరలు,స్వామి వారికి 11 పంచలను అలంకరించారు.అంతేకాకుండా గర్భగుడిలోని మూలవిరాట్ కు బంగారు చీరతో అలంకరణ చేశారు.
బల్కంపేట అంతట భక్తజన సందోహం..
ప్రతి ఏడాది కంటే ఈ ఏడాది భక్తులు మరింత ఎక్కువగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాలను కనులారా వీక్షించేందుకు వచ్చారు.కేవలం నగరం నుంచి వచ్చే భక్తులే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు.దీంతో కేవలం ఆలయ పరిసరాలే కాకుండా బల్కంపేట ప్రాంతంతో పాటు అమీర్‌పేట వరకు రహదారులన్నీ భక్తజన సందోహంతో కిటకిటలాడాయి.కిలోమీటరుకు కూడా పైగా క్యూలైన్లో భక్తులు అమ్మవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.కనులారా తల్లి కల్యాణాన్ని పెద్ద స్క్రీన్లపై వీక్షించడమే కాకుండా అమ్మవారిని స్వయంగా దర్శించుకుని తన్మయత్వానికి గురయ్యారు.
అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు…
నెల ముందు నుంచే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాలకు పెద్ద ఎత్తున సన్నాహాలు జరిగాయి.ఈ క్రమంలో క్యూలైన్ల మొదలు భక్తులకు నీటి సౌకర్యం, వైద్య సదుపాయం, ప్రసాదర వితరణ వంటివి స్వచ్ఛంధ సంస్థల సహకారంతో ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేశాయి. పోలీసు శాఖ సీసీ కెమెరాలతో పాటు ప్రత్యేక టీంల ద్వారా నిఘా పెట్టి భద్రతను పర్యవేక్షించారు.సాధారణ భక్తులతో పాటు వీఐపీల కోసం వేర్వేరు క్యూలైన్లను ఏర్పాటు చేశారు.
నేడు చివరి ఘట్టం…
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాల చివరి ఘట్టం నేడు జరగనుంది. ఉదయం 5 గంటలకు నాదస్వర మంగళ వాయిద్యాలు,అభిషేకం నిర్వహిస్తారు.అనంతరం దేవతా పూజలు,అగ్ని ప్రతిష్ఠ,గణపతి హోమం, మహాశాంతి హోమం, బలిహరణం,పూర్ణాహుతి జరపనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు భక్తుల హర్షధ్వానాలు, జయజయధ్వానాల మధ్య పుర వీధుల్లో అమ్మవారి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగనుంది.రథోత్సవం అనంతరం కల్యాణోత్సవాలకు వేద పండితులు స్వప్తి పలకనున్నారు.
అలిగిన మంత్రి.. మేయర్..
మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలను ఉత్సవాల్లో భాగంగా సమర్పించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా వేడుకలకు హాజరయ్యారు. అయితే ప్రోటోకల్ విషయంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వారివురు కాసేపు అలకబూనారు. అధికారులు సర్ది చెప్పడంతో అనంతరం కల్యాణోత్సవాల్లో పాల్గొన్నారు.
హాజరైన ప్రముఖులు ..
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాలకు ఎందరో ప్రముఖులు హాజరై అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు.హాజరైన వారిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దంపతులు,రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్,కొండా సురేఖ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్,మాగంటి గోపీనాథ్,గణేశ్, వీఐపీలు,సీఎస్ శాంతికుమారి,రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్,మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి,కాంగ్రెస్ నాయకురాలు కోట నీలిమ పవన్ ఖేర్ తదితరులున్నారు.