Friday, October 18, 2024
HomeతెలంగాణKarimnagar: అన్యాయాన్ని ఎదిరించడమే నేను చేసిన తప్పా?: బాధితుడి నిరసన

Karimnagar: అన్యాయాన్ని ఎదిరించడమే నేను చేసిన తప్పా?: బాధితుడి నిరసన

తన కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాలను ప్రశ్నించినందుకు తనకు తన తల్లిదండ్రుల ద్వారా సంక్రమిస్తున్న భూమిని రిజిస్ట్రేషన్ చేయడంలో రెవెన్యూ అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని రేకుర్తికి చెందిన దుర్గం మనోహర్ కరీంనగర్ కలెక్టరేట్ ముందు వినూత్న నిరసనకు దిగారు.

- Advertisement -

ఒంటిపై ఉన్న చొక్కాను విప్పి అర్ధ నగ్నంగా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో కూర్చుని ముందు ఒక విస్తార్లో పేడ, డబ్బులు, మద్యం సీసాలు పెట్టి అవినీతి అధికారులకు అవి చెందాలంటే నిరసన చేపట్టారు. అంతేకాకుండా తాను అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై ఉన్నతాధికారులకు చేసిన ఫిర్యాదులను ఫ్లెక్సీపై ముద్రించారు.

ఈ సందర్భంగా బాధితుడు దుర్గం మనోహర్ మాట్లాడుతూ… తన తండ్రి 40 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన భూమిలో నుండి గత కొంతకాలం క్రితం ఒక వ్యక్తికి నాలుగున్నర గుంటల భూమిని విక్రయించడం జరిగిందన్నారు. అట్టి సమయంలో కొనుగోలు చేసిన వ్యక్తికి రెవెన్యూ అధికారులు పట్టా చేసి పాస్ బుక్ మంజూరు చేయడం కూడా జరిగిందన్నారు. తన తండ్రి మృతి చెందడంతో అట్టి భూమి తన తల్లి పేరుపై రెవెన్యూ అధికారులు పట్టా మార్పిడి చేసినట్టు చెప్పారు. తమ తల్లిదండ్రులకు నలుగురం వారసులమని తన వాటాగా రావలసిన భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వ నిబంధన ప్రకారం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ కోసం తాహసిల్దార్ కార్యాలయానికి వెళితే తహసిల్దార్ రిజిస్ట్రేషన్ చేయకుండా నానా ఇబ్బందులు పెడుతున్నట్లు చెప్పారు. ఇదేంటని సమస్యను ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆరు నెలల క్రితం ప్రజావాణిలో సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాను చేసిన ఫిర్యాదుపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఆర్ డి ఓను సమస్య పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆర్డిఓ తన పేరుపై భూమి రిజిస్ట్రేషన్ చేయనీయడం లేదన్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారని తాను అధికారులను అడగగా మాపైనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశావు కాబట్టి నీకు రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ అధికారులు సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ భూములను అప్పనంగా కాజేయాలని చూసిన అవినీతిపరులను బయట పెట్టడం, దొంగ ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలను సృష్టించడం, ఇంటి నిర్మాణాలు చేపట్టకుండానే విద్యుత్ మీటర్లు మంజూరు చేసిన విషయాలపై తాను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతోనే తనపై రెవెన్యూ అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు, జిల్లా కలెక్టర్ స్పందించి తనకు వారసత్వంగా సంక్రమించింన ఆస్తిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రత్యేక చొరవ చూపించాలని వేడుకున్నారు. బాధితుడు దుర్గం మనోహర్ వినూత్న నిరసన తెలుపుతుండడంతో సోమవారం ప్రజావాణికి వచ్చే వారందరూ అసలు ఏం జరుగుతుంది. అధికారుల కక్ష సాధింపు చర్య పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో ప్రశ్నించడమే నేరమా..? ప్రశ్నిస్తే కక్ష సాధింపు చర్యలు పాల్పడతారా..? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాధితుడికి జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ వివరణ..

“దుర్గం మనోహర్ కు సంబంధించిన భూమి గురించి తెలియదు, ఎలాంటి ప్రజావాణి ఫిర్యాదులు నాకు రాలేదని అన్నారు. ఆ భూమి రిజిస్ట్రేషన్ సంబంధిత అధికారి ఎమ్మార్వో రిజిస్ట్రేషన్ చేస్తే నేను ఎందుకు అడ్డంట” అని వివరణ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News