ఉన్నవాటిపై కూడా ఘోరంగా ఖూనీ
- నేమ్ బోర్డులపై స్థానిక భాషకు ప్రాధాన్యం
- పాక్షిక అక్షరాస్యులకు అవే ఆధారం
- తమిళులు, కన్నడిగుల భాషాభిమానం భేష్
- పొరుగు రాష్ట్రాలను చూసి కాస్తైనా నేర్చుకోరా?
- నిబంధనలు నామమాత్రం.. అమలు దారుణం
(తెలుగుప్రభ ప్రత్యేక ప్రతినిధి)
పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకు వెళ్లినా, ఆ పక్కనే ఉన్న తమిళనాడుకు వెళ్లినా.. అక్కడ ప్రభుత్వ కార్యాలయం కానివ్వండి, పెద్ద ఐటీ కంపెనీ కానివ్వండి, రోడ్డు పక్కన కాకా హోటల్ కానివ్వండి.. ఏదైనా కూడా వాళ్ల స్థానికభాషలో చక్కగా రాసిన బోర్డు కనపడుతుంది. దాంతోపాటే ఇంగ్లిషులోనూ ఉంటుంది. కన్నడ లిపి తెలుగుకు కాస్త దగ్గరగా ఉంటుంది కాబట్టి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అదీ వాళ్ల భాషాభిమానం.
అదే మన హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో చూస్తే అసలు బోర్డుల మీద తెలుగు మచ్చుకైనా కనపడదు. పొరపాటున ఉన్నా.. అందులోని భాష చూస్తే భాషాభిమానులకు ఉరేసుకోవాలనిపిస్తుంది. వాటిలోని అచ్చుతప్పులు దారుణాతి దారుణంగా ఉంటాయి. అలాగే, ఇంగ్లిషులో పెద్ద పెద్ద అక్షరాలతో రాసి, ఆ కింద తెలుగు అక్షరాలను మాత్రం చీమ తలకాయ అంత సైజులో రాసి వదిలేస్తారు. లేదా, ఇంగ్లిషు అక్షరాలనే తెలుగులో రాస్తున్న వైనం కూడా కనిపిస్తోంది. ఉదాహరణకు బూర్గుల రామకృష్ణారావు రోడ్డు అనడానికి బీఆర్కే రోడ్డు అనేస్తారు. అక్షరాల్లో పొదుపు పాటించాలనే ఒకవేళ అనుకున్నా.. కనీసం బూర్గుల రోడ్డు అని రాసినా ఆయన గురించిన ఆలోచన కొంతయినా వస్తుంది. ఎవరీ బూర్గుల? ఆయనేం చేశారన్న విషయాన్ని తెలుసుకోవడానికి కొత్త తరం ఎంతో కొంత ప్రయత్నం చేస్తుంది. ఎస్‌డీ రోడ్డు అంటారు. దాన్ని సరోజినీదేవి రోడ్డు అని చెబితే కొంతయినా మేలు కదా!
కర్ణాటకలో తాజాగా అక్కడి ముఖ్యమంత్రి ఎక్స్ ఖాతా ద్వారా చేసిన ఒక ప్రకటన సంచలనానికి కారణమైంది. కర్ణాటకలో ప్రతి ప్రైవేటు సంస్థ కూడా తప్పనిసరిగా తమ బోర్డుల మీద కన్నడంలో పేరు రాయాలని అందులో చెప్పడంతో పాటు, ఉద్యోగాలన్నింటినీ కన్నడిగులకు మాత్రమే ఇవ్వాలని చెప్పారు. దానిమీద గగ్గోలు రేగడంతో గ్రూప్ సి, డి ఉద్యోగాల్లో 75%, పరిపాలనా విభాగానికి సంబంధించిన వాటిలో 50% చొప్పున కన్నడిగులను మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేశారు. ఒకరకంగా చూస్తే ఇది అంత వాంఛనీయం కాకపోవచ్చు. కానీ, ఆయనకు తన భాష మీద, తనవాళ్ల మీద ఉన్న అభిమానాన్ని ఇది భూతద్దంలో చూపిస్తుంది.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఒక జీఓను కూడా పూర్తి తెలుగులోనే, అది కూడా కృతకంగా కాకుండా అందరికీ అర్థమయ్యే భాషలో ఇచ్చింది. ఇది ఒక మంచి ప్రయత్నమేనని అభినందించి తీరాలి. అదే సమయంలో బోర్డుల మీద కూడా తెలుగులో తప్పనిసరిగా రాయాలని కేవలం ఉత్తర్వులు ఇచ్చి వదిలేయడం కాకుండా, దాని పర్యవేక్షణకు ఒక విభాగాన్ని ఏర్పాటుచేసి.. పక్కాగా అమలయ్యేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఆబిడ్స్, కోఠి లాంటి ప్రాంతాల్లో గానీ, పాత నగరంలో గానీ ఎక్కడా సరైన తెలుగు అన్నది మచ్చుకు కూడా కనిపించదు. ఉన్న అరకొర బోర్డుల మీది తెలుగు కూడా చదవడానికి ఏమాత్రం వీలుగా ఉండదు. ఇలాంటి విషయాలపై ప్రభుత్వం, స్థానిక సంస్థలు తప్పనిసరిగా దృష్టి సారించాలి.