ధర్మాన్ని దారిలో వదిలేసి,నీతిని గాలికొదిలేసి,సత్యాన్ని చంపేసి బ్రతుకు బండ్లు సాగిపోతున్నాయి.నిజాయితీ పరులు,నీతివంతులు బ్రతకలేక,చావలేక నిరంతరం చస్తూ బ్రతుకుతున్నారు.ఎలా బ్రతకాలో గతం నేర్పింది.ఎలా ఉండాలో గత విలువలు నేర్పించాయి.ఎలాగోలా బ్రతికేయమని విలువలు నశించిన వర్తమాన సమాజం సందేశ మిస్తుంటే,మారుతున్న కాలంలో మారని మనుషులను నిందించాలా?కాలాన్ని బట్టి రంగులు మార్చి, ఆనందంగా జీవిస్తున్న అవకాశవాదుల అదృష్టాన్ని ప్రశ్నించాలా? విలువలు గల మనుషుల జీవితాల్లో తొంగిచూస్తున్న కారుమబ్బులిచ్చే సందేశ మేమిటి? తల్లక్రిందులవుతున్న నీతిగల జీవితాల్లోని చేదు నిజాలను కాదనగలమా? మలుపులు తిరుగుతున్న మనుషుల జీవితాలను శాసించేదేమిటి?
తినడం కోసం బ్రతకాలా? బ్రతకడం కోసం తినాలా?
సత్యం పలకని గొంతులు, చెదలు పట్టిన మెదళ్ళు
మాలిన్యం సోకిన మనసుల మధ్య మానవ జీవిత విలువలు మాడి మసై పోతున్నాయి.మనిషి జన్మకు అర్ధం చెప్పని పెద్దలు…విలువలు నేర్పని విద్యలు…ఆత్మీయతలకు తావు లేని పెంపకాలు…మానవ సంబంధాలను నిలబట్టే ప్రేమాప్యాయతల వారధిని ధ్వంసం చేస్తుంటే, మనుషుల లోకంలో నిజమైన మనుషులు అంతరించి పోతున్నారు.సముద్రమంత జీవిత సౌధంలో జ్ఞాపకాలను దాచే మనసు గదులు ఇరుకైపోతున్నాయి.అనుభవాల ఆనవాళ్ళు కాపాడే విజ్ఞులు కరువై పోయారు.మహిలో ఉన్నతంగా వికసించి, విలసిల్లి, మనసును అలరించి,విలువలను జీవితాలకు అన్వయించి, కాపాడిన తరతరాల మానవ జీవితాలు మనకందించిన వారసత్వ సంపద వర్తమాన ప్రపంచానికి బరువుగా మారింది. మూర్ఖత్వం నుండి వివేక పథం వైపు నడిపించిన దార్శనికుల విలువైన మాటలు మస్తకాలకు భారమై, చదవని పుస్తకాల్లో అక్షరాల సమూహంగా మిగిలిపోయాయి. తరతరాల కోసం పదిల పరచిన ధర్మ సూత్రాలు అధర్మవర్తనుల పాదాల క్రింద నలిగి నుజ్జుగా మారిపోతున్నాయి.సద్వర్తనుల నీతి బోధలు ఆధునికానికి అంటరానివిగా మిగిలి పోతున్నాయి. గతకాలపు విలువల సౌధాలను విధ్వంసం చేసి, మనిషికున్న ఔన్నత్యాన్ని మంటగలిపి, ఆధిపత్యమనే జాఢ్యంతో పరులను మానసికంగా హింసించి,ఆనందించే దారుణ దుర్గుణ ధారులతో నిండిన మానవ సమాజంలో మనసులేని మానవ వికృత రూపాలు విలయ గర్జన చేస్తున్నాయి.లెక్కప్రకారం జీవించే రోజులు పోయి,లెక్కలేసుకుని జీవించే రోజులొచ్చాయి.”ఓడ దాటేవరకు ఓడ మల్లన్న, ఓడ దాటాక బోడు మల్లన్న…” అనే సామెత నేటి అవకాశ వాదపు ప్రపంచంలో నిత్యసత్యంలా మారింది. మాటకు విలువ లేదు,మనిషికి విలువ లేదు.వ్యక్తిత్వానికి ఆదరణ లేదు. విలువలను చంపి నగ్నంగా తిరిగే రోజు లొచ్చాయి. నేటి మాట రేపటికి నీటి మూటగా మారుతున్నది. సద్గుణాలు సర్ధుబాటు ధోరణితో అటకెక్కుతున్నాయి.అహం శాసించాలని చూస్తుంటే, ధనం ద్వేషించాలని ఆరాటపడుతుంటే, ఇక విలువలతో పనేముంది? ఆర్ధిక స్థాయి అంతరాలను సృష్టిస్తుంటే, ఆర్ధిక సంబంధాలు అసలైన మానవ సంబంధాలను తెంపేస్తుంటే, మనిషి కేవలం పేరుకు మాత్రమే మనిషిగా మిగిలాడు.”ఎవరికి వారే యమునా తీరే…లెక్కతప్పితే కాకుల గోలే” అనే విధంగా మానవ ప్రపంచం తయారైనది. చదువులకు, జీవించే విధానానికి పొంతన లేకుండా పోయింది. ఉన్నతంగా జీవించడమంటే ఆకాశహర్మ్యాల్లో నివసించడం, కేవలం తమ ఆర్ధిక స్థాయికి తగిన వారితోనే మాట్లాడడం, మందు, విందు, వినోదాలతో తైతక్కలాడడం, అదే నాగరికతగా భావించడమా? కనీస మానవత్వం కోల్పోయి, సాటి మనుషులను ద్వేషించడం అత్యంత హీనంగా ప్రవర్తించడం అత్యంత జుగుప్సాకరం. సమాజం ఇలాంటి వారిని ఛీత్కరించుకుంటుందని తెలిసినా తామే అధికులమని మూర్ఖంగా ప్రవర్తించడం మానసిక అజ్ఞానానికి నిలువెత్తు దర్పణం. ఆర్ధిక సంబంధాలు మానవ ప్రపంచాన్ని శాసిస్తున్న ఫలితంగానే ఇలాంటి సంకుచిత,స్వార్ధ, అమానవీయ ధోరణులు చోటు చేసుకుంటున్నాయి.మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అన్న నానుడి అక్షర సత్యం. డబ్బు లేకపోతే డుబ్బుకైనా కొరగారన్న మన పెద్దల మాటలు నేటి సమాజాన్ని శాసిస్తున్నాయి. నిండైన వ్యక్తిత్వాలను వెక్కిరిస్తున్నాయి.
మానవ సంబంధాలు అడుగంటాయి-అప్యాయతలు కరువయ్యాయి. చుట్టరికాలు బరువయ్యాయి. సంబంధ బాంధవ్యాలు వివాహాది శుభకార్యాలకో, చావు కబుర్లకో పరిమితమయ్యాయి. మిత్రుల మధ్య పలకరింపులు చరవాణికే అంకిత మయ్యాయి. స్నేహ బంధాలు కూడా ఆర్ధిక పరిస్థితిని బట్టి మారి పోతున్నాయి.యాంత్రిక జీవనం మనుషుల మధ్య దూరాన్ని పెంచేస్తే, కరెన్సీ సంపాదనలో పడిన జనం సంబంధ బాంధవ్యాలకే తిలోదకాలిచ్చేస్తున్నారు. ఎన్నో అనుభూతులు మధురమైన భావనలు,అర్ధిక చట్రంలో ఇరుక్కుపోయి మటుమాయమైపోయాయి. నిజాయితీకి విలువ లేదు. మానవీయత నిజజీవితంలో నిజంగా హృదయాన్ని స్ఫృశించడం లేదు.నయనానందకరంగా సాగవలసిన ప్రేమాభిమానాల్లో సహజత్వం తగ్గిపోయింది.మానవ సంబంధాలను శాసిస్తున్న ఆధునిక ఆర్ధిక బంధనాల నుండి బయట పడలేక, సతమతమవుతూ అన్నీ కోల్పోయిన తర్వాత జీవిత చరమాంకంలో పశ్చాత్తాపపడడం వలన ఫలితం శూన్యం. తమ పిల్లలు గొప్పవారు కావాలని ఊహాజగత్తులో విహరించే తల్లిదండ్రులు బాల్యదశలోనే వారిని చదువుల పేరుతో బంధాలకు దూరం చేసి దూరతీరాలకు తరలించేస్తున్నారు. ఒకవైపు తాము కష్టపడుతూ తమ బిడ్డలు ప్రయోజకులవ్వాలనే ఏకసూత్ర ప్రణాళికతో వారిని ఎక్కడో ఉన్న విద్యాలయాలకు తరిమేసి,బాల్యంలోని మధుర క్షణాలను వారికి కాకుండా చేస్తున్నారు. బాల్యం బట్టీ చదువులతో, యవ్వనం పోటీ పరీక్షల ప్రహసనంతో , ఉద్యోగాల వేటతో పరిసమాప్త మౌతున్నది. ఉద్యోగాలొచ్చాక పెళ్ళిళ్ళు…పిల్లలు…సంసార బాధ్యతలు నేటి తరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.తినీ తినకుండా వేళాపాళా లేని ప్రైవేటు ఉద్యోగాల పని ఒత్తిడిలో పడి యంత్రాల్లా తయారవుతున్నారు నేటి యువతీ యువకులకు.మానసిక వికాసమే మిథ్యగా -జీవితమే బరువుగా మారి కాలం తో పాటు వయసు తరిగిపోతున్నది. అసంతృప్తితో జీవించి, ఆవేదనతో మరణిస్తూ జీవితంలో నిజమైన మధురానుభూతిని కోల్పోతున్న నేటి కాలపు అస్తవ్యస్థ ధోరణులు మానవ జీవితాలకు శాపంలా మారిపోయాయి. ఒంటరిగా జీవించాలనే భావనతో నకారాత్మకమైన దృక్ఫథాన్ని ప్రదర్శిస్తున్న యువతకు మానవ సంబంధాలపై దృష్టి కేంద్రీకరించే వెసులుబాటు ఎక్కడ దొరుకుతుంది? చరవాణిలో పలకరింపులకే సంబంధాలు పరిమితమైన నేపథ్యంలో మార్పు సంభవమా? కాసుల కక్కుర్తితో విదేశాల కేగే తమ బిడ్డలను చూసి నలుగురిలో గొప్పలు చెప్పుకునే తల్లిదండ్రులు తామిక్కడ నలిగిపోతూ వార్ధక్యంలో కృంగిపోతూ ఆలనా పాలనా చూసే దిక్కే కరువై, బ్రతుకే బరువై వృద్ధాశ్రమాల్లో చేరి, అందరూ ఉన్న అనాథల్లా కాలం గడపడం వర్తమాన బ్రతుకు చిత్రాల్లో కానవస్తున్న బాధాతప్త హృదయాల చేదు అనుభవాల సంక్షిప్త సారాంశం. ఇదొక విచిత్రమైన వింత ధోరణి. వర్తమాన జీవితాల్లో తొంగిచూస్తున్న ఇలాంటి యథార్త విషాద గాథలకు సరైన పరిష్కారం చూపి,అర్ధవంతమైన జీవితాలకు నాంది పలకాలి. మూర్ఖ భావజాలానికి ముగింపు నివ్వాలి.వెన్నెల్లో పరుండి చందమామను చూపిస్తూ, గోరుముద్దలను తినిపిస్తూ బామ్మ,తాతయ్యలు చెప్పే కథలన్నీ నేటి యాంత్రిక జీవన మాయాజాలంలో మటుమాయమయ్యాయి- చందమామ,బాలమిత్ర కథలు కరువయ్యాయి. విలువలు నేర్పే విద్యలు విద్యారంగపు బేహారుల కబంధహస్తాల్లో నలిగి చిక్కిశల్యమయ్యాయి. ఆధునిక నాగరికత వెర్రితలలు వేసి, విషసర్పంలా నేటి యువత జీవనాన్ని కాటేస్తున్నది. మందు-విందు లాంటి అనాగరికపు విహారాల్లో ఊగుతూ,మాదకద్రవ్రాల మత్తులో పడి సిసలైన నాగరికతను విధ్వంసం చేయడం వలన సమాజం అధోగతి వైపు పయనిస్తున్నది. “తాను మునిగిందే గంగ-తనొలచిందే రంభ” అనే మూర్ఖత్వంలో, అహంకారంలో యుక్తాయుక్త విచక్షణ మరచిపోయి, అపసవ్యమైన సంస్కృతివైపు పయనిస్తున్న నేటి నవతరాన్ని మార్చడం సాధ్యమా?ఏ ఎండకా గొడుగు పట్టే అశకాశవాద మనస్తత్వాలు -ఏ పూటకాపాట పాడే అవలక్షణాలు పురివిప్పి నాట్యం చేస్తున్నాయి.ఆ ఊరిలో వాన పడితే ఈ ఊర్లో గొడుగు పట్టే విడ్డూరపు స్వార్ధ చింతన బయలు దేరింది.మంచి-చెడు తేడా తెలియని మూర్ఖపు పంథాలో సాంస్కృతిక విధ్వంసం నిర్విఘ్న యజ్ఞంలా కొనసాగుతుంది. హింసవచన-ధ్వంస రచన నిర్విరామంగా జరుగుతున్నది. మనిషి పెరిగినా మనసు తరిగి మనిషే మృగమైపోతున్న సందర్భాలు కోకొల్లలుగా చూస్తున్నాం.నేటి సమాజంలో మనిషే మాయమైపోయే తరుణానికి శీఘ్రగతిన శ్రీకారం చుట్టబడుతున్నది.ఎక్కడన్నా గుడ్డిలో మెల్లలా నీతి,న్యాయం బ్రతికుంటే దానిని దుర్నీతితో అణచి పాతరేయడమే నడుస్తున్న నవనాగరిక చరిత్ర. అన్యాయంతో న్యాయాన్ని చంపేయడం,అసూయతో శీలహననం గావించడం నయా నాగరిక సామాజిక వ్యవస్థలో వ్రేళ్ళూనుకున్న విష సంస్కృతి. ప్రల్లదనమే గాని రవ్వంత చల్లదనమే లేని స్వార్ధం నిండిన అసూయాగ్రస్థుల మాటే నేటి సమాజంలో చెల్లుబాటవడం మానవత్వానికే మాయని మచ్చ. ఈ సమాజం ఎందుకిలా తయారైందని ప్రశ్నించుకుంటే మొక్కగా ఉండగానే పిల్లలను సరైన దారిలో నడపించ లేకపోవడమేనన్న సమాధానం వస్తుంది. పెంపకాలు సరిగా లేని పెద్దలది ఒక తప్పయితే, నైతిక విలువలు నేర్పని విద్యావ్యవస్థది మరో తప్పిదం.మానవ సంబంధాలు సక్రమంగా సాగాలంటే విలువలతో కూడిన పాతకాలపు విద్యను నేటి ఆధునిక విద్యావ్యవస్థకు జోడించాలి. బాల్యదశలోనే చదువుల పేరుతో దూరప్రాంతాలకు తరలించి పిల్లలను కుటుంబ వ్వవస్థకు దూరం చేసే ధోరణి మానవ సంబంధాలకు శరాఘాతం. ఇలాంటి ధోరణి విడనాడాలి. వినయాన్ని, వివేకాన్ని విజ్ఞానంతో రంగరించిన విద్యలు రూపుదిద్దుకోవాలి. మానవీయ విలువలను నేర్పించాలి. గర్వాంధకారులుగా, సంస్కారహీనులుగా, అసూయాపరులుగా తయారవుతూ మానవ సంబంధాలతో నిమిత్తం లేకుండా తమదైన స్వాప్నిక జగత్తులో విహరిస్తున్న యువతలో మార్పు తీసుకురావడం సాధ్యమా? పెద్దలను గౌరవించడం, వినయంతో మెలగడం, కృతజ్ఞత ప్రదర్శించడం వంటి లక్షణాలను పెంపొందించడం జరుగునా? కాఠిన్యం నిండిన లోకంలో కారుణ్యం మనగలుగునా మనసులో లేని సౌందర్యం, రంగురద్దే శరీరంపై దొరకునా?
మానవత్వం లేని వారి చెంత ప్రాకులాడడం,వారికోసం తపించడం కఠిన శిలల్లో చలనం కలగాలని చేసే విఫల యత్నమే. మానవత్వమున్న మనుషులను వేధించుకుతినే సంస్కృతిలో ఇమడలేక, సహనం నశిస్తే ఆవేశం అగ్ని ధారలై కురిసి, హృదయం బరువెక్కి బడబాగ్ని జ్వలించదా? ఆవేశం ఉప్పెనలా ఎగసి పడితే, మనసున్న మనిషి ఆవేదన అనే అగాధాల అంచుల్లో నిలబడి విలపిస్తుంటే,మనసున్న మనిషిలో కట్టలు తెంచుకున్న కన్నీరు వరద గోదారి లా ప్రవహిస్తుంటే, వ్యక్తిత్వం లేని మనుషుల గుంపుల్లో కాకుల్లా జీవించడం దండగని భీతిల్లిన మనసున్న మనిషి ఒంటరిగా మిగిలి, మరో ఉషోదయం కోసం నిరీక్షిస్తే, ఫలితం దక్కునా ? సమాజ వికాసం జరగాలని, హృదయం లోతుల్లో నుంచి పరివర్తన రావాలి.ఆనాడే సమాజంలోని వ్రేళ్ళూనుకుపోయిన సకల దుర్నీతి నశిస్తుంది.మానవతా పరిమళాలు వెల్లివిరుస్తాయి. మానవ సంబంధాలు మెరుగు పడతాయి. మానవ హృదిలో మానవీయ కోణం ఆవిష్కరించబడే ఆ సుందర స్వప్నం సాకారమయ్యే సుమధుర క్షణాలకై ఎదురు చూద్దాం. కాలమే నేటి అస్తవ్యస్థ పరిస్థితులకు మార్గం చూపాలని ఆశిద్ధాం.
-సుంకవల్లి సత్తిరాజు.
9704903463