Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Ban on meat?: మాంసాహారాన్ని నిషేధిస్తే ఎలా?

Ban on meat?: మాంసాహారాన్ని నిషేధిస్తే ఎలా?

ఎటువంటి ఆహారం భుజించాలన్నది వ్యక్తిగత..

గుజరాత్‌ రాష్ట్రంలోని భావనగర్‌ జిల్లాలో ఉన్న పాలిటానా నగరం మాంసాహార అమ్మకాలను, వినియోగాన్ని నిషేధించడం ద్వారా ప్రపంచంలోనే మాంసాహారాన్ని నిషేధించిన మొట్టమొదటి నగరంగా పేరు తెచ్చుకుంది. ఒక విధంగా ఈ నిర్ణయం వివాదాస్పద విషయంగా కూడా మారింది. జైన మతస్థుల ప్రోద్బలంతో స్థానిక పాలనా యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ నగరంలో అత్యధిక సంఖ్యాకులు జైనులే. శత్రుంజయ పర్వత ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్న పాలిటానా జైన మతస్థులకు ఒక పుణ్యక్షేత్రం కూడా. ఈ నగరంలో జైనులకు సంబంధించి సుమారు 800 ఆలయాలున్నాయి. ఇందులో ఆదినాథ్‌ దేవాలయం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. నగరంలోని 250 పైచిలుకు మాంసాహార దుకాణాలను శాశ్వతంగా మూసేయాలని డిమాండ్‌ చేస్తూ సుమారు 200 మంది జైన సాధువులు కొద్ది కాలం క్రితం పాలిటానాలో నిరాహార దీక్ష చేయడం జరిగింది. దాని ఫలితంగానే ఇప్పుడు అక్కడ మాంసాహారాన్ని నిషేధించాల్సి వచ్చింది. గుజరాత్‌ లోని వడోదర, అహ్మదాబాద్‌, జునాగఢ్‌ ప్రాంతాల్లో కూడా ఇటువంటి డిమాండ్లు క్రమంగా బయటికి వస్తున్నాయి.
వాస్తవానికి, ఈ ధోరణి ఒక్క గుజరాత్‌ రాష్ట్రానికే పరిమితం కాలేదు. ఉత్తర భారతదేశంలోని అనేక పట్టణాల్లో మాంసాహార నిషేధానికి సంబంధించిన ఆందోళనలు, ఉద్యమాలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. హర్యానాలోని కురుక్షేత్రలో, ఉత్తరాఖండ్‌ లోని హరిద్వార్‌లో, ఉత్తర ప్రదేశ్‌ లోని అనేక పట్టణాల్లో మాంసాహార రెస్టారెంట్ల మీద ఆంక్షలు విధించడం జరిగింది. మాంసం, చేపలు, గుడ్లను బహిరంగంగా విక్రయించడం మీద నిషేధాలు విధించడం జరిగింది. మాంసాన్ని, కోళ్లను ఎక్కువగా సరఫరా చేసే ముస్లిం మతస్థుల మీద దీని ప్రభావం పడుతుంది. మాంసాహారాన్ని భుజించే అత్యధిక సంఖ్యాకుల మీద కూడా దీని ప్రభావం పడుతుందనడంలో సందేహం లేదు. జైన మతస్థులు ఉల్లిపాయలు, ఆలుగడ్డలు, దుంప కూరల్ని, అదే విధంగా ముస్లిం మతస్థులు పంది మాంసాన్ని భుజించరు. ఆహార అలవాట్లు ఒక్కో ప్రాంతాన్ని బట్టి కూడా మారుతుంటాయి. ఉదాహరణకు, బీహార్‌ లోని మైథిలీ బ్రాహ్మణులు మాంసాహారం తీసుకుంటారు. బెంగాల్‌ లో తరతమ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ చేపల వంటకాలను తింటారు. ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని వర్గాల వారు నల్ల కుక్క మాంసాన్ని విధిగా తినడం జరుగుతుంది. చైనాలో ప్రతి ప్రాణినీ తింటారనే విషయం అందరికీ తెలిసిందే.
ఎటువంటి ఆహారం భుజించాలన్నది వ్యక్తిగత విషయం. తమ ఆహారపు అలవాట్లను, తమ ఆహార నియమాలను ఇతరుల మీద రుద్దడం ఏ విధంగానూ భావ్యం కాదు. తమకు కావాల్సిన ఆహారాన్ని ఎంచుకునే హక్కు ప్రతివారికీ ఉంటుంది. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాలు మాంసాన్ని, మాంసాహార పదార్థాలను నియంత్రించవచ్చు. వీటి మీద శాశ్వతంగా నిషేధం విధించే బదులు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలయాలు, పాఠశాలలు, ఇతర పవిత్ర ప్రదేశాలు, సున్నిత ప్రాంతాలకు దూరంగా గొడ్డు మాంసం, చేపలు, కోళ్లు, గొర్రెలు, మెకల విక్రయాల కోసం ప్రత్యేక మార్కెట్లను ఏర్పాటు చేయడం కూడా సమంజసంగా ఉంటుంది. అత్యధిక సంఖ్యాక ప్రజల మనోభావాలను, ఆహార అలవాట్లను లెక్క చేయకుండా ప్రభుత్వాలు దౌర్జన్యంగా, ఏకపక్షంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం భావ్యంగా కనిపించడం లేదు. ముస్లింలు, క్రైస్తవులే కాకుండా షెడ్యూల్డ్‌ తెగలు, షెడ్యూల్డ్‌ కులాలు, ఓబీసీలు, ఇతర వర్గాలు కూడా మాంసాహారాన్ని భుజిస్తారని, వీరిలో ఎక్కువ మందికి వీటి క్రయ విక్రయాలే జీవనాధారమని ప్రభుత్వాలు గుర్తించడం మంచిది. భూమిహార్లు, రాజపుట్లు వంటి అగ్రవర్ణాల వారు సైతం మాంసాహారాన్ని భుజించడం జరుగుతోంది.
పాలిటానాలో కూడా వేలాది కుటుంబాలకు మాంసాహార విక్రయమే జీవనాధారం. మాంసాహార విక్రయాల మీద నిషేధం ఉన్న ఇతర ప్రాంతాల్లో కూడా చాలామంది వీటి మీదే ఆధారపడి జీవిస్తుంటారు. మాంసాన్ని, మాంసాహారాన్ని నిషేధించడమన్నది దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తుంది. మాంసాహార, శాకాహార పదార్థాల వినియోగంలో సమతూకం పాటిస్తూ, అన్ని వర్గాల ప్రజల ఆహార అలవాట్లను గౌరవిస్తూ, వారి జీవనాధారానికి భంగం కలగకుండా వ్యవహరిస్తూ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. పైగా, మాంసాహారం మీద పూర్తి స్థాయి నిషేధించడం అనేది సాధ్యం కాదు. ఇది వ్యక్తి స్వేచ్ఛకు, అందరినీ కలుపుకునిపోయే తత్వానికి పూర్తిగా విరుద్ధం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News