Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Rahul Political journey: గతుకుల బాటలో రాహుల్‌ ప్రయాణం!

Rahul Political journey: గతుకుల బాటలో రాహుల్‌ ప్రయాణం!

ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ దేశ రాజకీయాల్లో ఇంకా వెనుకబడే ఉన్నట్టు కనిపిస్తోంది. ఆయన వచ్చే అయిదేళ్ల కాలంలో అనేక రాజకీయ పాఠాలను నేర్చుకోవాల్సి ఉంది కానీ, ఆయన ఆ దిశగా అడుగులు వేస్తుస్తున్నట్టు కనిపించడం లేదు. రాజకీయాలను వృత్తిగా చేసుకున్నవారికి ప్రధానంగా కొన్ని అంశాల పట్ల పరిపూర్ణ అవగాహన ఉండాలి. అవి చరిత్ర, ఆర్థిక వ్యవహారాలు, రాజకీయాలు, సమాజం. అయితే, గత రెండు దశాబ్దా లుగా రాజకీయాల్లో ఉన్న రాహుల్‌ గాంధీకి చరిత్ర, ఆర్థిక వ్యవహారాలు, సమాజ స్థితిగతుల పట్ల ఏమాత్రం అవగాహన లేదనే విషయం అనేక సందర్భాల్లో వెలుగు చూసింది. ఇక రాజకీయాల విషయానికి వస్తే ఆయన ఓటు బ్యాంకు రాజకీయాలనే నమ్మడం, ఆశ్రయించడం జరుగుతోంది. గత జూలై 1న ఆయన పార్లమెంటులో మాట్లాడుతూ, ఆప్‌ హిందూ హో హీ నహీ (మీరు హిందువే కాదు) అని వ్యాఖ్యానించారు. ఈ ఒక్క వ్యాఖ్యను బట్టి ఆయనకు చరిత్ర, నాగరికత, సంస్కృతి, సమాజం పట్ల ఏమాత్రం అవగాహన లేదనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆయన బీజేపీని ఉద్దేశించి ఈ వ్యాఖ్య చేశారనడంలో సందేహం లేదు. ఆయన లక్ష్యం ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన మంత్రివర్గ సహచరులు, ఆయన పార్టీ సభ్యులు, ఆయనకు మద్దతునిస్తున్న కోట్లాది మంది ప్రజలు.
ఆయన వ్యాఖ్యలను బట్టి మూడు విషయాలు అర్థమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలు చేయడానికి తనకు హక్కు ఉందని ఆయన భావించడం, భారతీయ విలువల పట్ల ఆయనకు ఏమాత్రం గౌరవం, ఆదరణ లేకపోవడం, ప్రజాస్వామిక సూత్రాల పట్ల ఏ మాత్రం నమ్మకం లేకపోవడం. ఎవరు హిందువన్నది రాహుల్‌ గానీ, మరెవరైనా గానీ నిర్ధారించగలరా? ఇటీవల జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో 23.59 కోట్ల మంది భారతీయులు బీజేపీకి ఓటు వేశారు. భారతీయుల్లో కొన్ని కోట్ల మంది ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని భావించి ఉండవచ్చు. ఏదో ఒక కారణంగా ఓటు వేసి ఉండకపోవచ్చు. ఇందులో అత్యధిక సంఖ్యాక ప్రజలు తమను తాము హిందువులుగానే భావించే అవకాశం ఉంది. ఒక్క మాటతో రాహుల్‌ గాంధీకి వీరెవరికీ అస్తిత్వం లేకుండా చేసేశారు. నిజానికి ఇటువంటి వ్యాఖ్యలు చేయగల అర్హత ఎవరికి ఉంటుంది? అలా అనే హక్కు తనకు మాత్రమే ఉందని భావించే వ్యక్తి మాత్రమే అలాంటి వ్యాఖ్యలు చేయగలుగుతారు. ఇతర మతాల మాదిరిగా కాకుండా హిందూ మతం కాలానికి అతీతమైంది. ఎన్ని వేల ఏళ్ల క్రితం పుట్టిందనేది ఎవరికీ తెలియదు. ఇందులో అనేక సంస్కృతులు కలిసిపోయి ఉన్నాయి. పైగా, హిందూ మతానికి ఒక కేంద్రీకృత వ్యవస్థ ఏమీ లేదు. అందువల్ల ఈ మతం మీద వ్యాఖ్యలు చేసే అధికారం ఎవరికీ లేదు. రాహుల్‌ గాంధీ వంటి అపరిపక్వ, అపరిణత రాజకీయ నాయకుడికి ఇటువంటి అధికారం ఉండే అవకాశం అంత కంటే లేదు.
సమ న్యాయానికి దూరం
ఒక్కో మతానికి ఒక్కో గుర్తింపు ఉంటుంది. ఉదాహరణకు, పాకిస్థాన్‌ లో అహ్మదీయ వర్గాన్ని ఇస్లాం మతం నుంచి పక్కన పెట్టడం జరిగింది. ముస్లిం మతంలో ప్రధాన వర్గాలైన షియాలకు, సున్నీలకు భిన్నమైన పంథాను అనుసరిస్తున్నందువల్ల అహ్మదీయాలను ఈ రెండు వర్గాలు హింసిస్తూ ఉంటాయి. ఇక ఈ రెండు వర్గాల మధ్య కూడా మతపరమైన వైషమ్యాలు ఉండడం వల్ల పరస్పరం కలహించుకుంటూ ఉంటాయి. విచిత్రమేమిటంటే, కమ్యూనిస్టులు, ముస్లిం లీగ్‌ తో పాటు అహ్మదీయాలు కూడా ప్రత్యేక పాకిస్థాన్‌ దేశం ఏర్పడడంలో కీలక పాత్ర నిర్వహించారు. లోక్‌ సభలో రాహుల్‌ గాంధీ నువ్వు హిందువువే కాదు అనడంలో ఇటువంటి వైఖరే ద్యోతకం అవుతోందనిపిస్తోంది. దేశంలో అత్యధిక జనాభా కలిగి ఉన్న హిందువులను ఈ విధంగా నిలదీయడంలో రాహుల్‌ ఉద్దేశమేమై ఉంటుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
లోక్‌ సభలో సుమారు గంటా నలభై నిమిషాల సేపు ప్రసంగించిన రాహుల్‌ గాంధీ హిందువులకు సంబంధించి మరికొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. హిందువులమని చెప్పుకుం టున్నవారు విద్వేషాలు, హింసాకాండ, అసత్యాలలో నిమగ్నమై ఉంటున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్య పార్లమెంటులోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాహుల్‌ గాంధీ గానీ, మరెవరైనా గానీ ఇతర మతాల గురించి అటువంటి వ్యాఖ్యలు చేయగలరా? ఆయన వ్యాఖ్యల్లో కొన్ని వైవిధ్యాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడు, ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా, నిందితులు, అనుమానితులు ఎవరో తేలిపోయినా, కాంగ్రెస్‌ పార్టీ ఉగ్రవాదానికి మతం లేదనే వ్యాఖ్యానమే చేస్తుంటుంది. లోక్‌ సభలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలకు ఆధారమేమీ లేదు. పార్లమెంటులో సభ్యులు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా చెల్లుబాటవుతుంది కనుక రాహుల్‌ గాంధీ మీద చర్య తీసుకోవడం జరగలేదు.
అనుచిత వ్యాఖ్యలు
చరిత్ర ప్రకారం, హిందువులు ఆత్మరక్షణ కోసం తప్ప ఏనాడూ హింసకు పాల్పడిన సందర్భం లేదు. హిందూ మతం అందరినీ కలుపుకుని వెడుతుంది. అనేక సంప్రదాయాలు, సంస్కృతులను తనలో మిళితం చేసుకుంది. ఇందులో విగ్రహారాధకులూ ఉన్నారు. విగ్రహాలను ఆరాధించని వారూ ఉన్నారు. ఆస్తికులూ ఉన్నారు, నాస్తికులూ ఉన్నారు. తనను తాను హిందువునని చెప్పు కునే ప్రతి వ్యక్తీ హిందువే. పైగా, హింసాకాండల గురించి, ద్వేషాల గురించి ఆయన మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించిన చందంగా, గురివింద గింజకు తన నలుపు తెలియదన్నట్టుగా ఉంది. హింస, విద్వేషాలను ఆయన పార్టీ అనుసరించినంతగా ప్రపంచంలో ఏ పార్టీ, ఏ వర్గమూ అనుసరించలేదు. లోక్‌ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన వివిధ వర్గాల మధ్య విద్వేషాలను పెంచే ప్రయత్నం చేశారు. విచ్ఛిన్నకర శక్తులను ప్రోత్సహించారు. కుల విభజనకు ఊతమిచ్చారు. భారతీయుల్ని మతపరంగా, కులపరంగా, ప్రాంతాలపరంగా విభజించే శక్తులతో చేతులు కలిపారు. ఆయన ఎన్నికల ప్రచార ప్రధానాంశం కుల విభజనే. భారతీయులు సారూప్యత విషయంలో ఉదాసీనంగా ఉండవచ్చు కానీ, సామరస్యం విషయంలో వారిని తలదన్నేవారు లేరు.
భారతదేశంలో నాలుగవ భాగాన్ని 1947 ఆగస్టులో ఇస్లామిక్‌ జాతీయవాదానికి దారాదత్తం చేసిం దెవరు? ఇప్పుడు పాకిస్థాన్‌ ఒక దేశంగానే కాదు, ప్రపంచంలోని ఇస్లామ్‌ మతస్థులందరికీ ఒక మత కేంద్రంగా కూడా వ్యవహరిస్తోంది. 1990 దశకంలో పాకిస్థాన్‌ లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు కాశ్మీర్లో ప్రవేశించి కాశ్మీరీ పండిట్లను వెళ్లగొట్టడం జరిగింది. ఆర్టికల్‌ 370, 35ఎ లను రద్దు చేసినందుకు, దేశ విభజన నాటి పరిస్థితులను సృష్టిస్తామంటూ ఇటీవల నేషనల్‌ కాన్ఫరెన్ప్‌ పార్టీ ఎంపి ఆగా సయ్యద్‌ రుహుల్లా మెహదీ ఒక ఇంటర్వ్యూలో హెచ్చరించడం జరిగింది. రాహుల్‌ గాంధీకి ఇవన్నీ హింసా విధ్వంస కాండలుగా, విద్వేషాలుగా కనిపించకపోవడం నిజంగా ఆశ్చర్య కరం. ఇక 2022 జూన్‌లో రాజస్థాన్‌ లో కన్హయ్యాలాల్‌ ను, మహారాష్ట్రలో ఉమేశ్‌ అనే వ్యక్తిని ఇస్లామిక్‌ మతోన్మాదులు తల నరికి చంపారు. పశ్చిమ బెంగాల్‌ లోని దినాజ్పూర్‌ లో పాలక పక్షానికి చెందిన ముస్లిం యువకులు ఒక యువ దంపతులను బహిరంగంగా దారుణంగా కొట్టడం జరిగింది. బీజేపీకి మద్దతు తెలిపినందుకు పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌ బిహార్‌ ప్రాంతంలో ఇటీవల ఒక ముస్లిం మహిళను వివస్త్రను చేసి కొట్టడం, అవమానించడం జరిగింది. బీజేపీకి మద్దతు తెలిపినందుకు సాటి మతస్థులను ముస్లిం మతోన్మాదులు చంపడం, కొట్టడం అనేవి దాదాపు నిత్యకృత్యాలుగా మారిపోయాయి.
పక్షపాత ధోరణి
రాహుల్‌ గాంధీకి ఇటువంటివేమీ పట్టవు. కారణమేమిటంటే, ఆయనకు ఓటు బ్యాంకు రాజకీయాలే ముఖ్యం. రాజకీయ అగత్యాలు, అవసరాలే ప్రధానం. రెండు మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. దీన్ని పునరుద్ధరించడం రాహుల్‌ బాధ్యతగా మారింది. ఆయనకు మరో మార్గం లేదు. లౌకికవాదం ముసుగులో హిందువులను దూషించడం తప్ప ఆయనకు గత్యంతరం లేదు. ఓటర్ల మద్దతు కూడగట్టుకోవాలన్న పక్షంలో ఆయనకు అడ్డ దారులు తప్ప సరైన దారులు లభ్యమయ్యే అవకాశం లేదు. ఆయన వాయనా్‌డ లో ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ సహాయ సహకారాలతో లోక్‌ సభలో స్థానం సంపాదించుకున్నారు. ఆ పార్టీ మహమ్మద్‌ అలీ జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగ్‌ నుంచి పుట్టింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మహమ్మద్‌ ఇస్మాయిల్‌ ఈ పార్టీని హస్తగతం చేసుకున్నారు. జిన్నాకు చెందిన ముస్లిం లీగ్‌ లో ఆయన 1947 ప్రాంతంలో మద్రాస్‌ శాఖకు అధ్యక్షుడుగా పనిచేశారు. ముస్లిం లీగ్‌ తన పేరును మార్చుకుంది కానీ, అజెండాను మాత్రం మార్చుకోలేదు. రాహుల్‌ గాంధీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ముస్లిం లీగ్‌ అజెండాకు అనుగుణంగానే ఇటువంటి అనుచిత, అసందర్భ వ్యాఖ్యలు చేయడం జరుగుతోంది. ఆయనకు వాస్తవాలతో, ఆధారాలతో పని లేదు. విద్వేష ప్రసంగాలతోనే మున్ముందు కూడా పని ఉంటుంది.

  • ఎస్‌.ఎన్‌. నందా
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News