Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Indian rich weddings a booming business: సమాజాన్ని ఉద్ధరిస్తున్న శుభ కార్యాలు

Indian rich weddings a booming business: సమాజాన్ని ఉద్ధరిస్తున్న శుభ కార్యాలు

భారతదేశంలో ఏ శుభ కార్యం జరిగినా అది ఒక విధంగా లోక కల్యాణమే అవుతుంది. అంటే అది సామాజి కంగా కూడా ఉపయోగపడుతుంది. పెళ్లి జరిగినా, గృహ ప్రవేశం జరిగినా, ఉపనయనం జరిగినా, చివరికి ఇంట్లో పూజా పునస్కారాలు జరిగినా అది ఆ చుట్టుపక్కల అనేక రకాల వ్యాపారాలకు ఆర్థికంగా ఊతమిస్తుంది. ఈ మధ్య ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు ముంబై నగరంలో పలువురు చిరు వ్యాపా రాలు, చిన్న వ్యాపారులు రాత్రికి రాత్రి కోటీశ్వరుల య్యారు. అనేక కొత్త వ్యాపారాలు ప్రారంభమయ్యాయి. పూల దండల నుంచి పూజా సామగ్రి వరకు, ఇంటీరియర్‌ డెకరేషన్‌ నుంచి ఎలక్ట్రిక్‌ దుకాణాల వారి వరకు చాలా మంది జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. అధికారి కంగా ఆయన తన కుమారుడు అనంత్‌ అంబాని, రాధికా మర్చంట్‌ల వివాహానికి రూ. 5,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఉండవచ్చు. కానీ, సుమారు 20 వేల మందికి దీనివల్ల ఉపాధి లభించినట్టు అంచనా.
దేశంలోని స్థూల ఆర్థిక నిపుణుల అంచనాలకు ఇది పూర్తిగా విరుద్ధం కావచ్చు. వారి దృష్టంతా ముకేశ్‌ అం బానీ ఇంట్లో పెళ్లి జరిగిన 11 రోజులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమర్పించిన బడ్జెట్‌ మీదే ఉందనడంలో సందేహం లేదు. దేశంలో ఉద్యోగాల సృష్టి, ఆర్థికాభివృద్ధి వంటి కొన్ని కీలక అంశాల మీద సోషల్‌ మీడియా అంతా హోరెత్తుతున్న నేపథ్యంలో ముకేశ్‌ అం బానీ ఇంటి పెళ్లి మరొక విధమైన ఆర్థికాభివృద్ధిని, ఉద్యో గాల కల్పనను సృష్టిస్తోందన్న సంగతి ఎవరికీ పట్టలేదు. దేశ ఆర్థికాభివృద్ధికి అసలు సిసలు పట్టుకొమ్మలైన పారి శ్రామికవేత్తలు, వాణిజ్య వేత్తలంతా ఆ పెళ్లిలోనే ఉన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలోకి మళ్లించడానికి పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం నానా అవస్థలూ పడుతుండగా ఇక్కడ అయిదు వేల కోట్ల రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు పెడుతుండడం, వేలాది మందికి ఉపాధి కల్పించడం సునా యాసంగా జరిగిపోతోంది. దేశాభివృద్ధంతా ప్రభుత్వం చేసే ఖర్చు మీదే ఆధారపడి ఉంటుందని ఒకప్పుడు బ్రిటన్‌ కు చెందిన ప్రముఖ అర్థశాస్త్రవేత్త జాన్‌ మేనార్డ్‌ కీన్స్‌ అన్నారు. ఆ సూత్రం అంబానీ కుటుంబానికి కూడా వర్తి స్తుంది. శుభ కార్యాల పేరిట ప్రజలు చేసే ఖర్చు కూడా సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
వివాహాలే కీలకం
కీన్స్‌ మరో మాట కూడా అన్నారు. ‘భూమి మీద గోతులు తవ్వడానికి ప్రభుత్వం ప్రజలకు డబ్బు చెల్లిస్తుంది. మళ్లీ వాళ్లతోనే వాటిని పూడిపిస్తుంది. ఉద్యోగాల కల్పన అంటే అదే’ అని ఆయన ఒక సందర్భంలో అన్నారు. 1930 ప్రాంతంలో బ్రిటన్‌ను ఆర్థిక మాంద్యం నుంచి బయటకు తీసుకు వచ్చింది ఆయనే. ప్రభుత్వం ఏదో రకం గా తమకు ఉద్యోగాలు కల్పిస్తున్నంత వరకూ ప్రజలకు తాము ఏం చేస్తున్నామన్నది పట్టదని కూడా కీన్స్‌ అన్నారు. ముకేశ్‌ అంబానీ సుమారు ఆరు నెలల ముందు నుంచి ఈ పెళ్లి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పెళ్లికి ఏర్పాట్లు చేసే వాళ్లు, కేటరర్లు, డెకరేటర్లు, దుస్తుల డిజైనర్లు, ఇంకా అనేక రకాలుగా సేవలు అందించేవాళ్లకు చేతి నిండా పని దొరి కింది. వాళ్లకు క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ పెళ్లికి హాజరైన పెద్దలు కూడా అనేక రకాల సేవ లను ఉపయోగించుకుని ఉంటారు. ఆ సేవల వల్ల ఎంత మంది లబ్ది పొందారన్నది వేరే విషయం. ఈ రకమైన అర్థ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రభుత్వం మాదిరిగా అంబానీ పన్ను చెల్లింపుదార్ల సొమ్మును ఖర్చు చేయలేదు. సొంత డబ్బునే ఖర్చు చేశారు.
ఒక పెళ్లికి ఇంత ఖర్చు చేయాలా, ఇదంతా వృథా ఖర్చే కదా, తమ సిరిసంపదలను ప్రదర్శించుకోవడమే కదా అని వ్యాఖ్యలు, విమర్శలు చేయడం వల్ల ఉపయోగం లేదు. ఇటువంటివి స్థూర ఆర్థిక వ్యవహారాలకు ఏమాత్రం అందని విషయాలు. ఇక్కడ మరో విషయం కూడా ఆలో చించాల్సి ఉంది. ఇలా ఆకాశమంత పందిరి, భూదేవంత పీట వేయడమన్నది ముకేశ్‌ అంబానీతోనే ప్రారంభం అయిందనుకుంటే పొరపాటే. ఆయన కొద్దిగా అతిగా వ్యవ హరించి ఉంటే వ్యవహరించి ఉండవచ్చు. దేశంలో ఎవరు ఎప్పుడు పెళ్లి చేసినా అది వారి స్తోమతను మించే ఉంటుందన్నది నగ్న సత్యం.
మరో వారం పది రోజుల్లో అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ల పెళ్లి జరుగుతుందనగా, స్టాక్‌ మార్కెట్‌ వ్యాపా రంలో ఉన్న జెఫ్రీ సంస్థ దేశవ్యాప్తంగా ఒక పెద్ద అధ్యయ నం జరిపింది. దాని ప్రకారం దేశంలో ఏటా 10 లక్షల కోట్ల రూపాయల మేరకు వివాహ మహోత్సవాలు జరుగు తున్నాయి. ఆహారం, కాయగూరల మార్కెట్‌ తర్వాత ఇదే అతి పెద్ద ఆర్థిక వ్యవహారమని జెఫ్రీస్‌ తేల్చి చెప్పింది. ఇందులో ముకేశ్‌ అంబానీ ఇంటి పెళ్లి వాటా 0.005 శాతం మాత్రమే. భారతదేశంలో ఏటా 80 లక్షల నుంచి కోటి పెళ్లిళ్లు జరుగుతుంటాయని కూడా జెఫ్రీస్‌ వెల్లడిం చింది. అదే చైనాలో అయితే, సుమారు 75 లక్షల పెళ్లిళ్లు, అమెరికాలో 40 లక్షల పెళ్లిళ్లు జరుగుతుంటాయి. పెళ్లి ఖర్చు విషయంలో మాత్రం చైనా ఈ రెండు దేశాలకంటే బాగా ముందుంది. భారతదేశం ఈ విషయంలో కూడా చైనాతో పోటీపడుతోంది. ముహూర్తాలు, జాతకాలతో నిమిత్తం లేకుండా, ఇది మాఘ మాసమా, శ్రావణ మాస మా, కార్తీక మాసమా అన్న ప్రసక్తి లేకుండా ఏటా ఎక్కడో అక్కడ వివాహాలు, ఇతర శుభకార్యాలు జరుగుతున్నం దువల్ల ఏడాదంతా చాలామందికి పని ఉంటోంది. ఏదో ఒక విధమైన ఉపాధి లభిస్తుంది. కొన్ని లక్షల మందికి శుభ కార్యాలు ఆసరాగా ఉంటున్నాయని కూడా కొన్ని అధ్య యనాల్లో వెల్లడైంది.
సరికొత్త ఉద్యోగాలు, ఉపాధులు
సుమారు మూడు దశాబ్దాల క్రితమే దేశంలో చాలా మంది వధూవరుల అలంకారానికి, పెళ్లి మంటపాల అలం కారానికి సంబంధించిన కార్పొరేట్‌ సంస్థలను స్థాపించడం జరిగింది. ఇటువంటి కార్పొరేట్‌ స్థాయి సంస్థలు దేశంలో ఎనిమిది వేల పైచిలుకే ఉన్నట్టు కూడా జెఫ్రీస్‌ తెలిపింది. ఆర్థిక మాంద్యాలు, యుద్ధాలు, చివరికి మహమ్మారులు కూడా వీటి ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయలేకపోయాయి. చాలామంది సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగులు, ప్రభుత్వ ఉన్నతాధికా రులు తమ లాభదాయక ఉద్యోగాలను కూడా వదిలిపెట్టి పెళ్లిళ్ల నిర్వహణను ఒక వ్యాపారంగా అభివృద్ధి చేయడం జరిగింది. 2015లో కూడా 80,000 ఉన్న ఇటువంటి వ్యా పారాలు 2023 నాటికి క్రమంగా లక్షా 76 వేలకు పెరిగా యంటే వివాహ మహోత్సవాలు లోక కల్యాణానికి ఎంతగా ఉపయోగ పడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. పైగా, శుభకార్యాల నిర్వహణలో మతాలు, కులాలు, వర్గాలకు అతీతంగా అందరికీ ఉపాధి లభించడం కూడా ఒక విశే షమే. విచిత్రమేమిటంటే, ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ ధరించిన నగల లాంటి గిల్టు నగలను తయారు చేసిన ఒక ఢిల్లీ కంపెనీ ఇప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిగిపోతోంది.
విచిత్రమేమిటంటే, పెళ్లి తంతు అనేది కూడా ఇప్పుడు విస్తరిస్తోంది. నాలుగు దశాబ్దాల క్రితం వరకూ కేవలం మంగళసూత్ర ధారణకే పరిమితమైన వివాహాలు ఇప్పుడు ఉత్తర భారత సంప్రదాయాలను, దక్షిణ భారత సంప్రదా యాలనే కాక, ఈశాన్య రాష్ట్రాల సంప్రదాయాలను కూడా పుణికి పుచ్చుకుని, కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సం గీత్‌, మెహందీ, బ్యాచిలర్స్‌ పార్టీ, ఫ్యాషన్‌ షో, పాట కచ్చేరీలు, డాన్సులు వగైరాలతో పెళ్లి కార్యక్రమాలు రోజు రోజుకూ విస్తరిస్తున్నాయి. మున్ముందు గిరిజన, ఆదివాసీ సంప్రదాయాలు, కొన్ని విదేశీ సంప్రదాయాలు, పంజాబీ పద్ధతులు, గుజరాతీ పద్దతులు, తమిళనాడు విధానాలు కూడా పెళ్లిళ్లలో చేరిపోయే అవకాశం ఉందని వివాహ వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఒక్కొ క్క వేడుకా ఒక్కొక్క పరిశ్రమ. వేలాది మందికి ఉపాధి కల్పించే వ్యాపారం. నిజానికి, ఇప్పటికే ఉత్తర భారత దేశం లో అనేక పెళ్లిళ్లు పంజాబీ పద్ధతిలో జరుగుతున్నాయి. అంతేకాదు, వేడుకలు, ఉత్సవాలు, విందులు, వినోదాలు పెళ్లికి మాత్రమే పరిమితం కావడం లేదు. ఇవి పదహారు రోజుల పండుగ వరకూ, చివరికి గర్భం దాల్చేవరకూ విస్తరిస్తున్నాయి. దేశంలో వివాహ మహోత్సవాలతో సహా ప్రతి శుభ కార్యమూ స్థూల అర్థ శాస్త్రవేత్తలకు, కీన్స్‌ సూత్రాలకు అతీతంగా సాగిపోతున్నాయి.

  • జి. వినాయక్‌
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News