Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Wayanad a Manmade disaster: నిర్లక్ష్యాల ఫలితమే వయనాడ్‌ బీభత్సం

Wayanad a Manmade disaster: నిర్లక్ష్యాల ఫలితమే వయనాడ్‌ బీభత్సం

ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉంటే వయనాడ్‌ దుర్ఘటన జరిగి ఉండేది కాదు. గత పది పదిహేనేళ్ల కాలంలో అధికారికంగా, అనధికారికంగా జరిగిన అనేక సర్వేలు, అధ్యయనాలు ఇక్కడ పర్యావరణానికి సంబంధించిన ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రభుత్వాలకు, పర్యావరణ సంస్థలకు తెలియజేయడం, హెచ్చరించడం, ముందు జాగ్రత్త చర్యలు సూచించడం జరిగింది. సహజంగానే, ఇవన్నీ బుట్టదాఖలయ్యాయి. సర్వేలు, అధ్యయనాలు హెచ్చరించినట్టే కేరళ వయనాడ్‌ జిల్లాలో కొండ చరియలు విరిగిపడడం, వరదలు వెల్లువెత్తడం, ఊళ్లకు ఊళ్లు కొట్టుకు పోవడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు, అధికార యంత్రాంగాలు మేల్కొంటాయా అన్నది చూడాలి. ఈ ఆకస్మిక వరదల వల్ల, కొండ చరియలు విరిగి పడిపోవడం వల్ల దాదాపు సగం వయనాడ్‌ జిల్లా అజా పజా లేకుండా పోయింది. వందలాది మంది సజీవ సమాధి అయ్యారు. మరెందరో గల్లంతయ్యారు. ఇతరత్రా ఆస్తిపాస్తులకు ఎంత నష్టం జరిగిందనేది లెక్క లేదు.
ఇంత వరకూ లభించిన అధికారిక గణాంకాలను బట్టి 250 మందికి పైగా మరణిం చారు. ఎంత మంది గల్లంతయ్యారనేది ఇంకా తెలియలేదు. ప్రభుత్వ కార్యాలయ భవనాలు, పాఠశాలలు, వ్యాపార సంస్థలు, గ్రామాలు, రోడ్లు, వంతెనలు నామరూపాల్లేకుండా పోయాయి. మరణాలు, గల్లంతులు, విధ్వంసాలు వగైరాలన్నిటికన్నా మించి వయనాడ్‌ మరిన్ని మహా విపత్తులకు సిద్ధం కావాల్సి ఉంటుంది. వయనాడ్‌కు ఇప్పుడు సంభవించింది దాదాపు ఒక సునామి లాంటిది. అది కొద్ది గంటల్లో ఒక రమణీయ, సుందర పర్యాటక ప్రాంతాన్ని ఒక మరుభూమిగా మార్చేసింది. గతంలో పర్యావరణ నిపుణులు చేసిన హెచ్చరికలను, చెప్పిన జాగ్రత్తలను అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్లే వయనాడ్‌ ఇంతటి విధ్వంసానికి గురయిందని వేరే చెప్పనక్కర లేదు. వారి నిర్లక్ష్యం వల్ల భవిష్యత్తులో వయనాడ్‌లోనే కాకుండా అనేక ఇతర ప్రాంతాలు కూడా ఇదే విధంగా సజీవ సమాధి అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఆర్థికంగా, సామాజికంగా కుప్పకూలిపోయిన వందలాది కుటుంబాలకు ప్రభుత్వాలు సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టడం అనేది తక్షణ కర్తవ్యం. ఈ వరదలు, కొండ చరియల పతనాల వల్ల జరిగిన నష్టాన్ని ఎంత వీలైతే అంత తగ్గించడం, సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయడం వెను వెంటనే చేయవలసిన పనులు. వ్యక్తిగతంగానే కాకుండా, కుటుంబపరంగా, సమష్టిగా, సామాజి కంగా ఈ విధ్వంసం ఎందరికో మనోవేదన మిగల్చి ఉంటుంది. దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం సాయుధ దళాలను ఇక్కడ సహాయ చర్యల కోసం పంపించింది. జాతీయ విపత్తు స్పందన దళాలు, అగ్నిమాపక దళాలు, గజ ఈతగాళ్లు, భారీ సంఖ్యలో పోలీసులు రంగ ప్రవేశం చేసి, ప్రాణ రక్షణకు, నష్ట నివారణకు నడుం బిగించాయి. వరదల్లోనూ, కొండ చరియల్లోనూ చిక్కుకున్న వారిని కాపాడడం, వారిని సురక్షిత ప్రాంతాలకు, ఆస్పత్రులకు చేర్చడం, పునరావాసం కల్పించడం వంటి కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నాయి. ఈ పనులు ఇప్పట్లో ఆగిపోయే అవకాశం లేదు. పునరావాస కార్యక్రమాలు కూడా కొనసాగుతూనే ఉంటాయి. కొన్ని ప్రాంతాలు నామరూపాల్లేకుండా పోయినందువల్ల వాటిని పునర్మించడం ఆషామాషీ వ్యవహారం కాదు. వందలాది కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలాయి.
వాస్తవానికి, 2018లో కేరళ దాదాపు ఇదే విధంగా వరదల్లో చిక్కుకుంది. ఆ తర్వాత కూడా కొండ చరియలు విరిగిపడిపోవడం, వరదలు, తుఫానులు సంభవించడం, వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా ప్రతికూలంగా మారిపోవడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. వయనాడ్‌లో కూడా అనేక పర్యాయాలు కొండ చరియలు విరిగిపడడం జరిగింది. ప్రకృతి జోలికి, పర్యావరణం జోలికి పోవద్దని, వాటిని దురుపయోగం చేసుకోవద్దని పర్యావరణ నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ వాటిని పట్టించుకునే వారే లేదు. అడవులను, చెట్లను విచక్షణారహితంగా నరికివేయడం, కొండలను, తీర ప్రాంతాలను, అడవులను, లోయలను దురాక్రమణ చేయడం, యథేచ్ఛగా నిర్మాణాలు, గనుల తవ్వకాలు చేపట్టడం వంటి కార్యకలాపాల వల్ల పర్యావరణం దెబ్బతిని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఇటీవలి కాలంలో ప్రభుత్వాలకు, ప్రజలకు జ్ఞానోదయం కలిగించే ప్రయత్నాలు చేశారు.
కాగా, 2011లో నియమించిన గాడ్గిల్‌ కమిషన్‌ పశ్చిమ కనుమలకు పర్యావరణపరంగా పొంచి ఉన్న ముప్పులను, విపత్తులను తన నివేదికల ద్వారా తెలియజేసి, ప్రభుత్వాలను ముందుగానే హెచ్చరించింది. అనేక నివారణ చర్యలను సిఫారసు చేసింది. అప్పటి కేరళ ప్రభుత్వం ఈ సిఫార సులను పట్టించుకోకపోగా, వాటిని నీరు కార్చేందుకు కస్తూరి రంగన్‌ కమిటీని నియమించింది. గాడ్గిల్‌ కమిషన్‌ సిఫారసులను నీరుగారుస్తూ కస్తూరి రంగన్‌ చేసిన సిఫారసులను కూడా ప్రభుత్వం అమలు చేయలేదు. ప్రస్తుతం పశ్చిమ కనుమల పరిధిలోని ప్రాంతాలన్నిటికీ పర్యావరణ సమస్యలు, వాతావరణ మార్పులకు సంబంధించిన ముప్పులు పొంచి ఉన్నాయి. వయనాడ్‌ దుర్ఘటన కేవలం కేరళకే కాక, దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా గుణపాఠం కావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News