కొత్త ఢిల్లీగా పిలవబడే మన దేశ రాజధానిలో గతంలో తొమ్మిది పాత నగరాలున్నాయని మీకు తెలుసా? సుదీర్ఘ చరిత్ర గల ఢిల్లీ నగరాలు కొన్ని శతాబ్దాలుగా అనేక సార్లు మార్పులుచేర్పులకు లోనయ్యాయి. శతాబ్దాల పాటు ఈ నగరాలు వివిధ నాగరికతలు, సామ్రాజ్యాలు మరియు సంస్కృతుల మేలుకలయికగా కొనసాగడంతో ఆ ప్రభావం కొన్ని ప్రాంతాలలో నేటికీ ప్రతిబింబిస్తుంది. చరిత్రలోనే అత్యధిక కాలం దేశ రాజధానిగా విలసిల్లింది ‘ఢిల్లీ’. గతంలో ఢిల్లీలో ఉండి ప్రస్తుతం కనుమరుగైపోయినవి, ఇప్పుడు ఇతర పేర్లతో స్థిరపడిన వాటి గురించి తెలుసుకుందాము.
ఇంద్రప్రస్థ:
హిందూ పురాణాల ప్రకారం, “ఇంద్రప్రస్థ నగరం” ప్రస్తుతం మనం నేడు చూస్తున్న “పురాణ ఖిలా” ప్రాంతం చుట్టూ విస్తరించి ఉండేదని విశ్వసిస్తారు. మహాభారతం ఆధారంగా ఈ నగరాన్ని పాండవులు స్థాపించినట్లు అవగతమవుతోంది. మౌర్యుల కాలంలో ప్రత్యేకించి బౌద్ధ సాహిత్యంలో ‘ఇంద్రప్రస్థ’ ను ‘ఇందపట్ట’ అని పిలిచే వారని తెలుస్తోంది.
ఖిలా రాయ్ పితోరా:
రాజ్‌పుత్ తోమర్ రాజవంశం పాలనలో ఢిల్లీ నగరం ఎంతో చారిత్రక ప్రాభవాన్ని చాటుకున్నారన్నది చరిత్రకారుల అభిప్రాయం. అనంగ్‌పాల్ తోమర్ 1052 సంవత్సరంలో ‘ఢిల్లీ’ లేదా ‘లాల్‌కోట్’ను స్థాపించాడు. ఢిల్లీ మ్యూజియంలో భద్రపరచబడిన విక్రమ్ సంవత్ 1383 శాసనం ఈ విషయాన్ని ధృవపరుస్తోంది. అనంగ్‌పాల్ తోమర్ 11వ శతాబ్దంలో “లాల్ కోట్” నగరాన్ని స్థాపించగా అనంతరం 1180లో అజ్మీర్‌లోని చౌహాన్ రాజులు “లాల్ కోట్”ను స్వాధీనం చేసుకుని దానిని “ఖిలా రాయ్ పితోరా”గా మార్చినట్లు తెలుస్తోంది. పృథ్వీరాజ్ చౌహాన్ 1192లో మహమ్మద్ ఘోరీ చేతిలో రెండవ తరైన్ యుద్ధంలో పరాభవం చెందడంతో ఉత్తర భారతదేశంలో మహమ్మదీయుల ఉనికి పటిష్టం కావడంతో పాటు సింధు-గంగా మైదానం ప్రాంతంలో రాజ్‌పుత్ వంశస్థుల శక్తి క్రమేపీ బలహీనపడింది.
సిరి:
ఢిల్లీ సుల్తానుల స్థాపన ఢిల్లీ నగర చరిత్రలో ఒక కీలకమైన ఘట్టంగా అభివర్ణించవచ్చు. 1297 మరియు 1307 మధ్య కాలంలో భారతదేశం మరియు ఢిల్లీని మంగోల్ దాడుల నుండి రక్షించడానికి అల్లావుద్దీన్ ఖిల్జీ ‘సిరి’ని నిర్మించాడు. ఈ కోట మంగోల్ దండయాత్రలతో సహా ప్రధాన చారిత్రక ఘట్టాలకు సాక్షీభూతంగా నిలిచింది. ఈ కోట నిర్మాణం చాలా వరకు టర్కిష్ వాస్తు శైలికి దగ్గరగా ఉంటుంది. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో నిర్మించబడిన రెండవ నగరమైన ‘సిరి’ని ఆ తరువాత రాజ్యాధికారం చేపట్టిన ఇతర పాలకులు విస్తరించారు. ఈ కాలంలో నిర్మించిన భవనాల్లో అత్యధికం సెల్జుక్ డిజైన్‌లో ఉన్నాయి. పశ్చిమ ఆసియా సెజుకియన్ రాజవంశానికి చెందిన కళాకారులు ఢిల్లీ కోర్టు నిర్మాణానికి విరాళాలు అందించినట్లు తెలుస్తోంది. హౌజ్ ఖాస్ రిజర్వాయర్ తో పాటు చాలా ఎత్తుతో పొడవుగా నిర్మించబడిన దృఢమైన రాతి గోడలు సిరి కోట యొక్క ఆధునిక ప్రతినిథులుగా దర్శనమిస్తాయి. కోట లోపల వెయ్యి స్తంభాలతో నిర్మించడిన రాజభవనం అప్పట్లో నగరానికి తలమానికంగా పరిగణించబడేది. ఈ భవంతి యొక్క ముఖద్వారం అందమైన నగిషీలతో చెక్కబడి చూపరులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ కోట యొక్క తూర్పు భాగంలో బురుజులు, బాణాలు భద్రపరచడం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన అరలు, మరియు జ్వాలాకారపు కాలిబాటలు ఆ సమయంలో అధునాతనమైన వాస్తు విశేషాలుగా పరిగణించబడేవి. ఈ కోట గోడలకు అవతల పాలరాయి మరియు ఇతర రాతి కట్టడాలతో మరో రాజభవనం కూడా నిర్మించబడింది. కాగా కొందరు స్థానికులు తమ ఇళ్ళ నిర్మాణం కోసం ఇక్కడి రాళ్లు, ఇటుకలు మరియు ఇతర కళాఖండాలను దొంగిలించి కోటను ధ్వంసం చేసారని అంటారు. అంతేకాదు అప్పట్లో బీహార్ లో తన మహానగరాన్ని నిర్మించడానికి పష్టున్ ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన షేర్ షా సూరి సిరి నుండి వివిధ భవన నిర్మాణ సామాగ్రిని తరలించాడని అంటారు. తదుపరి పాలకులు తుగ్లకాబాద్, జహాన్పనా మరియు ఫిరోజాబాద్ వంటి ఇతర పట్టణ కేంద్రాలతో నగరాన్ని విస్తరించారు.
తుగ్లకాబాద్:
భవిష్యత్తులో ఒక గొప్ప శక్తి కేంద్రంగా భాసిల్లాలనే ఉద్దేశంతో ఘియాసుద్దిన్ తుగ్లక్ 14వ శతాబ్దంలో తుగ్లక్బాద్ అనే ఒక కోట నగరాన్ని స్థాపించాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టి, కారణమేమైనప్పటికీ తరువాత దానిని నిరుపయోగంగా వదిలివేయడం వలన ఆ నగరానికి “సిటీ ఆఫ్ ది డెడ్” (మృతుల నగరం) అనే పేరు వచ్చింది. తుగ్లక్ రాజవంశీకుల నిర్మాణ శైలి ఇతరులకు భిన్నంగా ఏటవాలుగా రెండు అంతస్తుల ఎత్తులో వృత్తాకార బురుజులు మరియు యుద్ధ ప్రాకారాలతో కప్పబడి ఉంటాయి. ఎంతో దూరదృష్టి గల ఈ రాజవంశీకులు వర్షాభావ పరిస్థితులలో నీటి ఎద్దడిని తట్టుకునేందుకు అప్పట్లోనే ఈ గోడల నగరంలో ఏడు భారీ వర్షపు నీటి ట్యాంకులను ఏర్పాటు చేయడం విశేషం. అర్థ షట్కోణ ఆకారంలో నిర్మించబడిన ఈ కోట యొక్క చాలా భాగం దట్టమైన ముళ్ల చెట్లు పొదలతో నిండిపోయి నిరుపయోగంగా మారిపోయింది.
జహాన్పనా:
‘జహాన్పనా’ (ప్రపంచానికి శరణు)ను ఢిల్లీ లోని నాల్గవ నగరం అని కూడా పిలుస్తారు. దీనిని క్రీ శ 1326లో ఘియాసుద్దిన్ తుగ్లక్ తనయుడు, రెండవ తుగ్లక్ సుల్తాన్ అయిన మహమ్మద్ బిన్ తుగ్లక్ తన కొత్త రాజధానిగా స్థాపించాడు. ఇది పాత నగరాలైన సిరి మరియు లాల్ కోట్ లలో చెల్లాచెదురుగా విస్తరించిన వివిధ ప్రాంతాలను చక్కటి ప్రణాళికాబద్ధమైన లేఅవుట్ మరియు ఆకట్టుకునే వాస్తుశిల్పకళతో పదమూడు గేట్లు మరియు ప్రహరీ గోడలతో నిర్మించాడు.
ఫిరోజాబాద్:
అద్భుతమైన నిర్మాణశైలి పట్ల ఆసక్తి గల ఫిరోజ్ షా తుగ్లక్ ఫిరోజాబాద్‌ను నిర్మించాడు. ప్రసిద్ధ ఫిరోజ్ షా కోట్లా సహా వివిధ స్మారక కట్టడాలు ఆయన మస్తిష్కం నుండి జాలువారినవి కావడం విశేషం. ఫిరోజాబాద్ యమునా నది సమీపంలో, మలి 14వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ప్రాంతంలో రాజభవనాలు, భారీ మరియు విశాలమైన స్తంభాలతో కూడిన గదులు, మసీదులు, పావురాల కోసం ఒక ప్రత్యేకమైన గోపురం, భారీ నీటి తొట్టెలు మరియు ఎత్తైన గోడలతో పటిష్టమైన ప్రాకారాన్ని నిర్మించారు. ప్రత్యేక ఆకర్షణగా ఈ ప్యాలెస్ పైకప్పుపై అశోక స్తంభం నిర్మించబడింది. ఫిరోజ్ షా తన పాలనా కాలంలో కుతుబ్ మినార్, నసీరుద్దీన్ మహమూద్ యొక్క సుల్తాన్-ఎ-గర్హి సమాధి మరియు హౌజ్ ఖాస్ల పునరుద్ధరణ మరియు మరమ్మతులు కూడా చేపట్టాడు.
షేర్ఘర్ లేదా పురానా ఖిలా:
హుమాయున్ మొదట తుగ్లక్ వంశీకుల నుండి ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు “దిన్ పనా” నగరాన్ని నిర్మించాడు. కానీ చౌసా మరియు కన్నౌజ్ యుద్ధాలలో షేర్ షా సూరి అతనిపై విజయం సాధించిన అనంతరం ఆ నగరానికి ‘షేర్ఘర్’ లేదా “ఢిల్లీ షేర్ షాహీ” అని పేరు పెట్టాడు. అదే ఇప్పుడు “పురానా ఖిలా”గా మారిందని అంటారు. ఇక్కడ పశ్చిమాన ఉన్న “బడా దర్వాజా”గా పిలువబడే ప్రాంతంలో బలిష్టమైన బురుజులు ఉన్నాయి. ఉత్తర ముఖద్వారాన్ని “తలాకీ దర్వాజా” లేదా “ఫర్బిడెన్ గేట్” అని, దక్షిణ ముఖద్వారాన్ని “హుమాయున్ దర్వాజా” అని పిలుస్తారు. బాబర్ ఆధ్వర్యంలోని మొఘల్ సామ్రాజ్యం 1526లో ఢిల్లీని స్వాధీనం చేసుకోవడంతో మొఘల్ పాలనకు నాంది పలికినట్లయ్యింది. బాబర్ వారసులు హుమాయున్, ఆ తరువాత అక్బర్ ఢిల్లీ మరియు ఆగ్రాలలో తమ సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నారు.
షాజహానాబాద్:
ఢిల్లీ లోని అత్యంత ప్రసిద్ధమైన మొఘల్ నగరం ‘షాజహానాబాద్’. ఇది 17వ శతాబ్దంలో షాజహాన్ ద్వారా స్థాపించబడింది. ఇది ‘ఎర్రకోట’ మరియు ‘జామా మసీదు’ వంటి ప్రతిష్టాత్మకమైన స్మారక చిహ్నాలకు నిలయం. ఈ ప్రాంతం నేడు “పాత ఢిల్లీ”గా పిలువబడుతోంది.
ఢిల్లీ నగరాల సమ్మేళనం (న్యూ ఢిల్లీ):
19వ శతాబ్దం మధ్యలో, వాణిజ్యం పేరుతో మన దేశంలో అడుగుపెట్టి రాజ్యాధికారం హస్తగతం చేసుకున్న బ్రిటిష్ “ఈస్ట్ ఇండియా కంపెనీ” నాటి బ్రిటిష్-ఇండియా రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చింది. 1947లో దేశ స్వాతంత్ర్యానంతరం, ‘ఢిల్లీ’ని భారత స్వతంత్ర సత్తాక గణతంత్ర దేశపు రాజధానిగా ప్రకటించారు. అప్పటి నుండి ఈ మహానగరం ఒక ప్రధాన రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక మరియు విద్యా కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతోంది. నేటి ఢిల్లీని ప్రధానంగా రెండు భాగాలుగా విభజించవచ్చు. అందులో మొదటిది “నేషనల్ క్యాపిటల్ టెరిటరీ” లేదా ఎన్ సిటి మరియు రెండవది “నేషనల్ క్యాపిటల్ రీజియన్” లేదా ఎన్ సి ఆర్. ఎన్ సి టిలో దక్షిణ ఢిల్లీ, ఉత్తర, ఈశాన్య, వాయువ్య, పశ్చిమ, దక్షిణ, నైరుతి, ఆగ్నేయం, న్యూ ఢిల్లీ, సెంట్రల్, షాహదారా మరియు తూర్పు ప్రాంతాలతో కలిపి మొత్తం పదకొండు జిల్లాలు ఉన్నాయి. కాగా ఎన్ సి ఆర్ పరిధిలోకి హర్యానా రాష్ట్రం లోని ఫరీదాబాద్, గురుగ్రామ్, నుహ్, రోహ్తక్, సోనేపట్, రేవారీ, ఝజ్జర్, పానిపట్, పల్వాల్, భివానీ, చర్ఖీ దాద్రి, మహేంద్రగఢ్, జింద్ మరియు కర్నాల్ (పద్నాలుగు జిల్లాలు). ఉత్తర ప్రదేశ్ లోని మీరట్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, బులంద్‌షహర్, బాగ్పత్, హాపూర్, షామ్లీ మరియు ముజఫర్‌నగర్ (ఎనిమిది జిల్లాలు), రాజస్థాన్ లోని అల్వార్ మరియు భరత్పూర్ (రెండు జిల్లాలు) సహా ఎన్ సి టి తో కలిపి మొత్తం 55,083 చదరపు కిలోమీటర్ల ప్రాంతం వస్తుంది.
తన సుదీర్ఘ చారిత్రక పయనంలో ఢిల్లీ మహానగరం ఎన్నో సామ్రాజ్యాల ఉత్థానపతనాలకు, గొప్ప స్మారక కట్టడాల నిర్మాణం మరియు విభిన్న సంస్కృతుల కలయికలకు సాక్షీభూతంగా నిలిచింది. కాలగర్భంలో కలిసిన ప్రతి దశ ఈ మహానగరంపై చెరగని ముద్ర వేసింది అన్నది ఎవ్వరూ కాదనలేని సత్యం.
యేచన్ చంద్ర శేఖర్
మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ
8885050822