కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సరికొత్త ప్రసార బిల్లు సోషల్ మీడియాను కట్టడి చేయ బోతోందా? ఇది ప్రజల సమాచార హక్కుకు భంగం కలిగించబోతోందా? ప్రస్తుతం దేశంలోని అనేక సోషల్ మీడియా సంస్థలను, మీడియా సంస్థలను తొలిచేస్తున్న ప్రశ్నలు ఇవి. ఈ కొత్త ప్రసార బిల్లు వల్ల సమాచార సృష్టికి, పంపిణీకి తీవ్ర విఘాతం కలిగే ఆస్కారముందని సోషల్ మీడియా భావిస్తోంది. ఇది వాక్ స్వాతంత్య్రానికి, భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించబోతున్నట్టు పలు సోషల్ మీడియా సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. కేబుల్ టీవీ నియంత్రణ చట్టం స్థానే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టదలచుకున్న ప్రసార సేవల నియంత్రణ బిల్లు మొదటి ముసాయిదాను గత ఏడాది కేంద్రం ప్రజాభిప్రాయానికి విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత మరికొన్ని ముసాయిదాలను కూడా కొన్ని ప్రసార సంస్థలకు, మీడియా సంస్థలకు పంపించారు. అయితే, ఇవి సంప్రదింపులు మాత్రమేనని, వీటిని గోప్యంగా ఉంచడం మంచిదని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
అయితే, ప్రాథమిక రాజ్యాంగ హక్కుకు ముప్పు కలిగించే అవకాశం ఉన్న ఈ బిల్లును గోప్యంగా ఉంచాలనడం అర్థరహితమని మీడియా, సమాచార సంస్థలు భావిస్తున్నాయి. ఈ బిల్లును రహ స్యంగా ఉంచాలనడం, ఇందులోని వివాదాస్పద అంశాలు తీవ్రస్థాయి విమర్శలకు గురవుతు న్నాయి. ఆన్ లైన్ సమాచార సర్వీసులు, సోషల్ మీడియా ఖాతాలు, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే ఆన్ లైన్ సమాచారాలు వగైరాలన్నీ ఈ బిల్లు అధీనంలోకి రావడం జరుగుతుంది. వర్తమాన వార్తా విశేషాలను మల్టీ మీడియా ద్వారా అప్ లోడ్ చేసి, ఆదాయం గడించే సోషల్ మీడియా సంస్థలను డిజిటల్ న్యూస్ బ్రాడ్ కాస్టర్లుగా పరిగణించడం జరుగుతుంది. సోషల్ మీడియాలో పాల్గొనేవారు, యూట్యూబర్లు, ఇన్ స్టా గ్రామర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో ఆచితూచి, ఆధారాలతో వ్యక్తం చేయాల్సి ఉంటుంది. వారు ఒక నియంత్రణ వ్యవస్థలో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వారిచ్చే సమాచారాన్ని మదింపు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయవలసి ఉంటుంది.
తమకు సేవలు అందిస్తున్న ప్రముఖుల పేర్లను, వారి వివరాలను సోషల్ మీడియా సంస్థలు తప్పనిసరిగా ప్రభుత్వానికి అందజేయవలసి ఉంటుంది. అలా చేయని పక్షంలో వారిని నేరస్థు లుగా పరిగణించడం జరుగుతుంది. ప్రభుత్వం కోరినప్పుడల్లా వారిని గురించిన పూర్తి సమాచా రాన్ని అందజేయడం తప్పనిసరి. దీన్ని ఉల్లంఘించిన సోషల్ మీడియా సంస్థలకు ప్రభుత్వం భారీగా జరిమానాలు విధించే అవకాశం ఉంది. ఈ బిల్లులో మరికొన్ని వివాదాస్పద అంశాలు కూడా ఉన్నాయి. ఎవరు ఎటువంటి వ్యక్తులన్నది నిర్ణయించే అధికారం కూడా ప్రభుత్వానికే ఉంటుంది. అంటే, తమకు నచ్చినవారిని ప్రోత్సహించడానికి, నచ్చనివారిని బహిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుందన్న మాట. ఈ బిల్లు విషయం పార్లమెంటులో కూడా ప్రస్తావనకు వచ్చింది. ప్రభుత్వం వాస్తవాలను అణచివేసే ఉద్దేశంలో ఉందని, ప్రజాస్వామ్య వ్యతిరేక, దుర్మార్గ బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో వాదించాయి. ఈ బిల్లు గనుక చట్టంగా మారే పక్షంలో కని విని ఎరుగని స్థాయిలో ఇది వాక్ స్వాతంత్య్రానికి, భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించే అవకాశం ఉందని అవి ఆందోళన వ్యక్తం చేశాయి.
సోషల్ మీడియాలో సరైన వార్తలతో పాటు, తప్పుడు వార్తలు కూడా పెద్ద సంఖ్యలో ప్రసారం అవుతున్న విషయం కాదనలేనిది. పాలక పక్షాన్నే కాక, ప్రతిపక్షాలను కూడా అప్రతిష్ఠపాలు చేస్తూ అనేక కట్టు కథలు ప్రసారం కావడం అందరికీ అనుభవమే. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును యథాతథంగా బిల్లుగా మార్చే ఉద్దేశం లేనందువల్లనే దీన్ని సంప్రదింపులకు సంబంధిత వ్యక్తులు, సంస్థలకు పంపించడం జరిగింది. ప్రభుత్వానికి ఎటువంటి దురుద్దేశాలున్నా గత ఏడాది తనకు పార్లమెంటులో మెజారిటీ ఉన్న స్థితిలో, ఈ బిల్లుకు ఆమోదం పొంది ఉండేది. ప్రభుత్వం పార్లమెంటులో ఈ రకమైన వివరణ ఇస్తూ, ఈ బిల్లు యథాతథంగా చట్టంగా మారే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. అయితే, ప్రతిపక్షాలు, మీడియా సంస్థలకు దీని మీద అపోహలు తొలగిపోలేదు. ఇది ఎంత ప్రజాస్వామిక దేశమైనా అడ్డూ ఆపూ లేని స్వేచ్ఛను అనుభవించడం అనేది ఏ వ్యవస్థకూ సాధ్యం కాదు.