తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టి.పి.టి.యఫ్) సభ్యత నమోదులో భాగంగా బీర్ పూర్ మండలంలోని పలు పాఠశాలలను సందర్శిస్తూ, సమస్యలను సేకరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు గొడుగు రఘుపతి యాదవ్ మాట్లాడుతూ…
ఎస్జిటి ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కల్పించాలని, తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని ప్రాథమిక పాఠశాలలకు పి.ఎస్.హెచ్.ఎం. పోస్టులను మంజూరు చేసి, డీఈడీతో పాటు బీఈడీ అర్హత కలిగిన ఎస్జీటీ ఉపాధ్యాయులకు కూడా పదోన్నతులు కల్పించాలని కోరారు. ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిలుగా ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పీఆర్సీ కమిటీ నివేదికను తెప్పించుకొని, వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన సంక్షేమ శాఖలో కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలకు పోస్టులు మంజూరు చేయాలని, భాషా పండితులు, పీఇటి పోస్టులను అప్గ్రేడ్ చేసి పదోన్నతులు ఇవ్వాలని కోరారు. మాడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేయాలి. 010 ద్వారా వేతనాలు చెల్లించాలి. కేజీబీవీ, యూఆర్ఎస్ ఉపాధ్యాయులు, సిబ్బందికి కనీసం మూల వేతనం చెల్లించాలని, మహిళా ఉపాధ్యాయుల మాదిరిగా 27 సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను అందరిని రెగ్యులర్ చేసి అందరికీ మినిమం టైం స్కేల్స్ ను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలను స్వాధీనం చేసుకొని జీరో వన్ జీరో ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు. 317 జీవో ద్వారా మ్యూచ్ వల్ బదిలీ చేయబడిన ఉపాధ్యాయులకు బదిలీలు చేపట్టాలన్నారు. 317 జీవోలో స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు, పెండింగ్ లో ఉన్న 13 జిల్లాల స్పౌజ్ కేటగిరి ఉపాధ్యాయులకు వెంటనే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల గోవర్ధన్, జిల్లా కార్యదర్శి సిర్ప నాగభూషణం, మండల బాధ్యులు ప్రకాష్, భీమరాజ్, మధుసూదన్, సుజాత, చుక్కయ్య తదితరులు పాల్గొన్నారు.