Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Elections in Kashmir soon: కాశ్మీర్‌ లో ఎన్నికల నిర్వహణకు కసరత్తు

Elections in Kashmir soon: కాశ్మీర్‌ లో ఎన్నికల నిర్వహణకు కసరత్తు

చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ నాయకత్వంలో ఎన్నికల సంఘం సిబ్బంది ఇటీవల రెండు రోజుల పాటు జమ్మూ కాశ్మీర్‌ లో పర్యటించి ఎన్నికల నిర్వహణపై అక్కడి రాజకీయ పార్టీలు, అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల సంఘం ఈ ప్రాంతాల్లో పర్యటించడం ఇది రెండవసారి. మొదటిసారి గత మార్చిలో జమ్మూకాశ్మీర్‌లో పర్యటించి ఎన్నికల నిర్వహణకు గల అవకాశాలను పర్యవేక్షించడం జరిగింది. అయిదేళ్లుగా కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్న జమ్మూ కాశ్మీర్‌లోని 90 స్థానాల శాసనసభకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలన్న అభిప్రాయం ఇక్కడి రాజకీయ పార్టీల్లోనే కాక, సాధారణ ప్రజానీకంలో సైతం వ్యక్తం అవు తోంది. నిజానికి, 2023 డిసెంబర్‌ లో సుప్రీం కోర్టు ఆర్టికల్‌ 370 రద్దుపై తీర్పునిస్తూ, సెప్టెంబర్‌ 30లోగా ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ కేంద్రపాలిత ప్రాంతాలకు రాష్ట్ర ప్రతి పత్తి కల్పించే వరకూ శాసనసభలకు ప్రత్యక్ష ఎన్నికలను నిర్వహించడానికి నిలిపి ఉంచడం సమంజసం కాదు” అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించ డానికి ఏర్పాట్లు చేపట్టాల్సిందిగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించడం కూడా జరిగింది.
ఇప్పటికే ఎన్నికల అధికారులు ఇక్కడ విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తు న్నారు. అయితే, ఈ ప్రాంతానికి రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం గడువు కాలాన్ని ఇంత వరకూ ప్రకటించలేదు. పైగా, ఇక్కడి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అధికారాలను బాగా పెంచడం జరిగింది. కాశ్మీర్‌ విషయంలో మరెంతో చేయాల్సి ఉంది. ముఖ్యంగా రాజకీయ ప్రక్రియను చేపట్టడమే పెద్ద సవాలుగా కనిపిస్తోంది. పాలనలో ప్రజా ప్రాతినిధ్యాన్ని, ప్రజల నమ్మకాన్ని పెంచడం వల్ల రాజకీయ ప్రక్రియ సాధ్యమవుతుంది.
ఇదివరకటి జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాన్ని 2019లో రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. వాటికి ఉన్న ప్రత్యేక హోదాను రద్దు చేయడం కూడా జరిగింది. ఈ రాష్ట్రంలో చివరి సారిగా 2014లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. 2018లో పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ-భారతీయ జనతా పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత, ఈ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశం లేకుండా పోయింది. గత ఏప్రిల్‌-మేలో జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు ఓటింగ్‌ హక్కును ఉపయోగించుకోవడాన్ని బట్టి, కేంద్ర ప్రభుత్వం ఇక ఇక్కడ శాసనసభ ఎన్నికలకు మార్గం సుగమం అయిందనే భావిస్తోంది. కాశ్మీరీ ప్రజలు ఎన్నికలను బహిష్కరించాలన్న వెనుకటి ధోరణికి స్వస్తి చెప్పి, సుమారు 58 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. 1990 తర్వాత ఈ రాష్ట్రంలో 50 శాతానికి మించి ఎన్నడూ ఓట్లు పోల్‌ కాలేదు. కాశ్మీర్‌ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, వీరి ప్రమేయంతోనే ఇక్కడ ఎన్నికలు జరగడం వల్ల దీర్ఘకాలంలో ఇక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది.
ఆర్టికల్‌ 370ని రద్దు చేసి అయిదేళ్లు దాటింది. జమ్ము, కాశ్మీర్‌ ను కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించి కూడా దాదాపు అంతే కాలం అయింది. అయినప్పటికీ కాశ్మీర్‌ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. దాదాపు డ్భె ఏళ్ల నుంచి ఆ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల నుంచి దాన్ని బయటికి తీసుకు రావడమనేది ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే, ఈ ప్రాంతాలను మిగిలిన భారతదేశంలో విలీనం చేయడం ద్వారా దీని సమస్యలకు తెర దించుతామని కేంద్రం అయిదేళ్ల క్రితం ప్రకటించడం జరిగింది. కాశ్మీర్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం గత అయిదేళ్ల కాలంలో అనేక చర్యలు చేపట్టింది. భారీగా ప్రాథమిక సదుపాయాల నిర్మాణాన్ని చేపట్టింది. కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టింది. అనేక ప్రజోపయోగ సేవలను మెరుగుపరచింది. 2019 నాటికి ముందు అనేక సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంపై పెట్టిన పెట్టుబడులు కేవలం రూ. 19,000 కోట్లు కాగా, గత మూడేళ్ల కాలంలో కేంద్రం పెట్టిన పెట్టుబడులు రూ. 99,000 కోట్లు. శ్రీనగర్‌ ను లేహ్‌ తో కలిపే జోజిలా సొరంగంతో సహా అనేక భారీ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. గత అయిదేళ్ల కాలంలో ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా అనేక రెట్లు పెరిగింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇక్కడ వ్యవసాయ రంగం మీదా, నిరుద్యోగ సమస్య పరిష్కారం మీదా దృష్టి పెడుతోంది.
అంతేకాక, కాశ్మీర్‌ లో భద్రతా పరిస్థితులు కూడా చాలావరకు మెరుగుపడ్డాయి. శాంతికి భంగం కలిగించే సంఘటనలేవీ ఎక్కువగా జరగడం లేదు. ఇక్కడ భద్రతా దళాలు ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల ఇక్కడ ప్రశాంత పరిస్థితులు ఏర్పడ్డాయని భావించవచ్చు. పైగా ఉగ్రవాదులు కూడా తమ దృష్టిని, కార్యకలాపాలను జమ్మూ ప్రాంతానికి మళ్లించడం వల్ల కాశ్మీర్‌ ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉంది.సరిహద్దులకు అవతలి నుంచి దేశంలోకి చొరబడిన ఉగ్రవాదులు నేరుగా జమ్మూ ప్రాంతంలో ప్రవేశించి అక్కడ హింసా విధ్వంసకాండలను చేపట్టడం జరుగుతోంది. ఇటీవలి వారాల్లో అనేక పర్యాయాలు ఉగ్రవాద దాడులు జరిగి, పలువురు సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అసలు ఇక్కడ ఎప్పటికైనా రాజకీయ ప్రక్రియ ప్రారంభం అవుతుందా, పాలనా వ్యవస్థ ఏర్పడుతుందా, కేంద్రం తాను చేసిన వాగ్దానాలను నెరవేరుస్తుందా అన్న ప్రశ్నలు ఇక్కడి ప్రజల మనసులను తొలిచేస్తున్నాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంలోనే ఉన్నట్టు కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News