Friday, November 22, 2024
HomeతెలంగాణOka Vidhwamsam 1056/90: ఘనంగా సాగిన 'ఒక విధ్వంసం 1056/ 90' పుస్తకావిష్కరణ

Oka Vidhwamsam 1056/90: ఘనంగా సాగిన ‘ఒక విధ్వంసం 1056/ 90’ పుస్తకావిష్కరణ

పర్యావరణంపై తెలుగులో వెలువడిన తొలి పరిశోధనాత్మక పుస్తకం ఇదే

సుప్రీం కోర్ట్ రిట్ పిటిషన్ పై ‘ఒక విధ్వంసం 1056 బై 90’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. రోగాలు నయం చేసే ఔషధాలు తయారు చేసే కంపెనీలు గ్రామాల్లో సృష్టిస్తున్న విధ్వంసాన్ని 1056/ 90 పుస్తకం కళ్లకు కట్టినట్టు వివరించింది.

- Advertisement -

ప్రొఫెసర్ హరగోపాల్ చేతుల మీదుగా ‘ఒక విధ్వంసం 1056 బై 90’ పుస్తకాన్ని రచయిత సమయమంత్రి చంద్రశేఖర శర్మ ఆవిష్కరింపచేశారు. ప్రొఫెసర్ హరగోపాల్ ఆవిష్కరించిన ఈ పుస్తకం తొలి ప్రతిని ఆంధ్రజ్యోతి సంపాదకులు డాక్టర్ కే శ్రీనివాస్ అందుకున్నారు.

పారిశ్రామికరణ, ఫార్మా ఎస్ఈజీలు కాలుష్య కారకాలుగా మారి గ్రామాలకు గ్రామాలను ఎలా నాశనం చేస్తున్నాయో, కడుపులో బిడ్డ మొదలు భూమి మీద ఉన్న సకల ప్రాణికోటిని ఎలా ధ్వంసం చేస్తున్నాయన్న విషయ లోతులను స్పృశిస్తూ ఈ పుస్తకం వివరిస్తుంది. ఒక్క ఇంగ్లీష్ లో తప్పితే వాతావరణ కాలుష్యంపై తెలుగులో ఇంత పరిశోధనాత్మకంగా పుస్తకాలు వెలువడటం అరుదు. అలాంటిది సీనియర్ జర్నలిస్ట్ సమయమంత్రి చంద్రశేఖర్ శర్మ తెలుగులో పర్యావరణంపై రాసిన పరిశోధనాత్మక పుస్తకం కావటం విశేషం. రాబోయే తరాలకు మనం ఎటువంటి వికృతిని వారసత్వ సంపదగా ఇస్తున్నామన్న విషయాన్ని తెలియజేసేలా ఉన్న ఈ పుస్తకం అద్భుతంగా ఉందని పుస్తకావిష్కరణలో పాల్గొన్న అతిథులంతా అభిప్రాయపడ్డారు.

ఉన్న ప్రకృతి సంపదనంతా దోచేయటాన్ని అభివృద్ధిగా పిలుచుకోవటం అంటే భవిష్యత్ ఏమవుతుందంటూ పుస్తకావిష్కర్త హరగోపాల్ చేసిన ప్రసంగం అందరినీ ఆలోచింపచేసేలా సాగింది. హైదరాబాదుకు కూతవేటు దూరంలో ఉన్న పటాన్చెరులోని ఫార్మా కంపెనీలు కాలుష్య కాసారాలుగా మారినా మన సమాజం ఎందుకు స్పందించటం లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. సమాజం స్పందించటాన్ని మరచిపోయిందని ఆయన విచారం వ్యక్తంచేశారు.

మనం మొద్దుబారి పోయామా?

ప్రొ. హరగోపాల్ మాట్లాడుతూ ఇదొక కనువిప్పు కలిగించే పుస్తకం, ఆవేదనను కల్గించే పుస్తకం, కర్మాగారాలు జీవితాలను విధ్వంసం చేస్తున్నా ప్రజా స్పందన కరువైంది, ఈ సమాజానికి ఏమైంది, మనం మొద్దుబారిపోయామా అని ఆయన ప్రశ్నించారు. మనము ప్రకృతిని కాపాడి, పూజించే సమాజం నుండి వచ్చాము. ఇప్పుడు అదే ప్రకృతిని శాసించే వరకు, విధ్వంసం స్రుస్థించే వరకు పోయాం అని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు . అభివృద్ధి పేరిట చేసే పర్యావరణ, మరియు కాలుష్య విధ్వంసం సహించరానిది. ఇదొక తప్పు మోడల్ . దీనిని మనం సమీక్షించుకోవాలి అన్నారు. ఈ కాలుష్య విధ్వంస కేవలం పటాన్ చెరులోనే కాదు ప్రపంచం మొత్తం జరుగుతుంది. ఔషధాలు తాయారు చేసే కంపెనీలే జబ్బులను అంటకడుతున్నాయి అని ప్రొ . హరగోపాల్ అన్నారు. ఇలాంటి విషయాలపైనా విస్తృతంగా ప్రచారం జరగాలన్నారు. మనకు స్పందించే మానవత్వం కావాలన్నారు ఆయన.

పర్యావరణ వేత్త డా. కలపాల బాబూరావు మాట్లాడుతూ.. అమెరికాలో 2 కోట్ల మంది ప్రజలు రోడ్డెక్కితే పర్యావరణ, పనిలో భద్రతా చట్టాలొచ్చాయి. ప్రజలు ఉద్యమించనిదే మార్పు రాదని గుర్తుచేశారు. అననుకూల పరిస్థితులలో శర్మ ఫార్మా బాధిత ప్రజల విషాదాన్నీ, వారి పట్ల వివక్షనీ వెలుగులోకి తేవడానికి చేస్తున్న ఈ ప్రయత్నం తెలుగు ప్రజలందరికీ చేరాలన్నారు. అభివృద్ధి పేరుతో ప్రాథమిక అవసరాలైన గాలీ, నీరూ విషమయం కావడం, రక్షించ వలసిన వ్యవస్థల వైఫల్యం, ప్రజా వ్యతిరేక ధోరణీ అందరూ తెలుసుకున్నప్పుడే శర్మ చేస్తున్న ఈ ప్రయత్నానికి సార్ధకత అన్నారు.

ఇదొక తీవ్ర విషాద పర్యావరణ అన్యాయ నివేదిక. పర్యావరణ అన్యాయమంటే బీద, బలహీన వర్గాల ప్రజలపై అనుచిత కాలుష్య, పర్యావరణ హాని భారం మోపడం. భోపాల్ ప్రమాదంలో ఎందరు మరణించారన్నదానికి స్పష్టమైన అంకెలు ఎలా లేవో, హైదరాబాద్ ఫార్మా బాధితులపైనా అధికారిక గణాంకాలు లేవు. అదొక శాక్రిఫైస్ జోన్. బలి ప్రాంతం. అక్కడ బలైన వారు గుర్తింపుకి కూడా నోచుకోలేదు. రాజ్యాంగమిచ్చిన జీవించే హక్కు వారికి వర్తించ లేదు. ప్రభుత్వ వ్యవస్థలేవీ వారికి రాజ్యాంగ రక్షణ కల్పించ లేదు. వారి ప్రాణాలకన్నా కంపెనీల లాభాలకే ప్రాధాన్యత. ఇది రాజ్యాంగ ప్రజాస్వామ్య వికృత రూపం అన్నారు.

అభివృద్ధి పేరుతో, తాత్కాలిక ఆలోచనలతో పర్యావరణ, మానవ విధ్వంసచేసే కంపెనీల పట్ల ప్రభుత్వాలు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నాయని ఆంధ్రజ్యోతి ఎడిటర్ డా. కె. శ్రీనివాస్ అన్నారు.

మనదేశంలో ఎన్నో వ్యవస్థలు ఉన్నప్పటికీ ఈవిషయంలో న్యాయం జరగడం లేదని ఇండియా టుడే మాజీ అసోసియేట్ ఎడిటర్ జి. రాజశుక అన్నారు. ప్రొఫెసర్ జి. విజయ్ మాట్లాడుతూ ప్రాణాలను కాపాడే మందులను తాయారు చేసి విదేశీయుల ప్రాణాలను కాపాడుతూ, కాలుష్యంతో స్థానిక ప్రజల ప్రాణాలు తీస్తున్న కంపెనీల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు.

పుస్తక రచయిత సమయమంత్రి చంద్రశేఖర శర్మ మాట్లాడుతూ అభివృద్ధికి, పర్యావరణానికి మధ్య ఒక సమతుల్యత సాధించాల్సిన అవసరం ఉందన్న డిమాండ్తో పర్యావరణ పరిరక్షణ కోసం వచ్చినదే పటాన్చెరు – బొల్లారం కాలుష్య వ్యతిరేక పోరాటమన్నారు. ఈ ప్రజాపోరాటం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటిది. స్థానిక ప్రజలు, బాధిత రైతులకు పౌర సమాజం బాసటగా నిలిచిందని గుర్తుచేశారు. పటాన్చెరు బొల్లారం రిట్ పిటిషన్ 1056/1990 సుప్రీంకోర్టులో విచారణకు వచ్చి అనేక కీలకమైన తీర్పులకు కారణమైంది. ఆ తర్వాత తీర్పుల అమలు తీరును పర్యవేక్షణ నిమిత్తమై ఇది హైకోర్టుకు బదిలీ అయింది. ఇలా బదిలీపై వచ్చిన కేసును హైకోర్టు ఒక దశాబ్దం పాటు సమీక్షించింది. అటుపిమ్మట జాతీయ హరిత ట్రైబ్యునల్ అందుబాటులోకి రావడంతో ఈ కేసుని ఎన్జీటీకి బదలాయించింది. విచారించిన ఎన్జీటీ 2017లో ఒక ప్రాథమిక తీర్పును, ఆ తర్వాత 2022లో కీలకమైన తీర్పును వెలువరించి కేసును కొట్టివేసింది. ఈ రిట్ పిటిషన్ అనేక అంశాలతో ముడిపడి ఉంది. ప్రజల జీవన స్థితిగతులు, ఆరోగ్యం, పంట భూములు, పశువులు, చెరువులు, కుంటలపై నేరుగా ప్రభావం ఉంది. ఇన్నేళ్లయినా బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగకపోవడమే నన్ను ఈ రిట్ పిటిషన్పై దృష్టి సారించేలా చేసింది. గతంలో ఈ కేసుకు సంబంధించిన అంశాల్లో ఎప్పటికప్పుడు పత్రికల్లో వార్తా కథనాలు అందించిన అనుభవం ఉండటం, క్షేత్రస్థాయిలో ఆ ప్రాంతంతో పాటు, అక్కడి ప్రజలతో అనుబంధం ఉండటంతో రెండున్నర దశాబ్దాల కాలంగా స్థానిక పరిస్థితులను ప్రత్యక్షంగా గమనిస్తూనే ఉన్నాను. అందుకే ఈ పుస్తకాన్ని మీముందుకు తీసుకు వచ్చినట్టు తెలిపారు. త్వరలో ఈ పుస్తకం ఇంగ్లీషు అనువాదాన్ని కూడా తెస్తామన్నారు శర్మ.

ఈ కార్యక్రమానికి సరస్వతి కవుల సభ్యాధ్యక్షలుగా వ్యవహరించారు. జనచైతన్య పబ్లికేషన్స్ సీఈవో బి. రమేష్ మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సునుద్దేశించి వచ్చే ఏ పుస్తకాన్నైనా తాము పబ్లిష్ చేస్తామని ఆయన ఈ సందర్బంగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పలువురు పాత్రికేయులు, పర్యావరణ ప్రేమికులు, ఉద్యమకారులు పాల్గొన్నారు.

400 వందల పేజీల ఈ పుస్తకం ప్రతుల కోసం శ్రీ జన చైతన్య పబ్లికేషన్స్ ను సంప్రదించగలరు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News