Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Waqf bill: వక్ఫ్‌ సవరణ బిల్లుపై మల్లగుల్లాలు

Waqf bill: వక్ఫ్‌ సవరణ బిల్లుపై మల్లగుల్లాలు

ఇస్లామిక్‌ మత కార్యకలాపాలకు సంబంధించిన వక్ఫ్‌ బోర్డు కార్యకలాపాలను చక్కదిద్దడానికి సంబంధించిన వక్ఫ్‌ సవరణ బిల్లుకు ఆ మతస్థులకే కాకుండా, ప్రతిపక్షాల నుంచి కూడా తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. గత పార్లమెంట్‌ సమావేశాల్లోనే ప్రవేశపెట్టిన ఈ బిల్లును ప్రస్తుతం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి అప్పగించడం జరిగింది. ప్రతిపక్షాలు ఈ బిల్లును రాజ్యాంగ విరుద్ధమని, అల్పసంఖ్యాక వర్గాలకు వ్యతిరేకమని, విచ్ఛిన్న ధోరణికి అవకాశం కల్పిస్తోందని ఘాటుగా విమర్శించాయి. ముస్లిం సమాజంలో ఈ వక్ఫ్‌ బోర్డులు మతపరంగా, దాతృత్యపరంగానే కాక, ఇతరత్రా అనేక సంక్షేమ ప్రయోజనాల కోసం ఉపయోగపడుతున్నాయి. ఇందుకు సంబం ధించి ఈ బోర్డుల దగ్గర సుమారు 9.40 లక్షల కోట్ల ఆస్తులున్నాయి. వీటి విలువ 2.4 లక్షల కోట్ల రూపాయలని అంచనా. ఈ ఆస్తులన్నిటినీ వక్ఫ్‌ బోర్డులే అజమాయిషీ చేస్తుంటాయి. అయితే, ఈ ఆస్తులను బోర్డులు దుర్వినియోగం చేస్తున్నాయని, వీటి అజమాయిషీ అసమర్థంగా ఉందని, ఇవన్నీ అవినీతిలో కూరుకుపోయాయని వీటిపై తీవ్రస్థాయి విమర్శలు వస్తున్నాయి. ఈ బోర్టులను సమర్థవంతంగా పని చేయడమే ఈ సవరణ బిల్లు ఉద్దేశమైనప్పటికీ, కేంద్ర ప్రభుత్వం మతపరంగా సున్నితమైన అంశాలను పట్టించుకోకుండా మొరటుగా, మొండిగా ఈ బిల్లును తీసుకు వస్తోందంటూ ప్రతిపక్షాలు, ముస్లిం సంఘాలు ఆరోపణలు సాగిస్తున్నాయి.
ఈ బిల్లు గనుక అమలులోకి వచ్చే పక్షంలో రాష్ట్ర వక్ఫ్‌ బోర్డుల అధికారాలు చాలావరకు వాటికి దూరమయ్యే అవకాశం ఉంది. నామినేషన్ల స్థానే ఎన్నికలు చోటు చేసుకుంటాయి. వక్ఫ్‌ బోర్డు లకు సంబంధించిన భూములకు సర్వేయర్లుగా వ్యవహరించే అధికారం జిల్లా కలెక్టర్లకు సంక్రమి స్తుంది. ఈ భూములకు సంబంధించి ఏదైనా వివాదం తలెత్తే పక్షంలో కలెక్టర్లే పరిష్కరించడం జరుగుతుంది. అంతేకాక, ఇక నుంచి ఈ వక్ఫ్‌ బోర్డులలో ముస్లిమేతరులు కూడా సభ్యులయ్యే అవకాశం ఉంటుంది. వక్ఫ్‌ లు అనేవి పూర్తిగా ముస్లింల ఆస్తులు. ఎటువంటి వక్ఫ్‌ ఆస్తినయినా, ఆర్థిక వ్యవహారాలనైనా ఆడిట్‌ చేయడానికి కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (సి.ఎ.జి)కి లేదా ప్రభుత్వం నియమించిన అధికారికి అధికారం ఉండడానికి కూడా ఈ బిల్లు అవకాశం కల్పిస్తోంది. అంటే, వక్ఫ్‌ బోర్డులను అజమాయిషీ చేసే అధికారం ఈ బిల్లు వల్ల బోర్డులకు, ట్రిబ్యునల్స్‌ కు కాకుండా పూర్తిగా ప్రభుత్వాలకు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం వీటి నిర్వహణ పూర్తిగా ముస్లిం మతస్థుల చేతుల్లోనే ఉంది. విస్తృతంగా ఉన్న వక్ఫ్‌ ఆస్తులను ఇక నుంచి ప్రభుత్వాలే నిర్వహించడం జరుగుతుంది.
అయితే, ముస్లిం సమాజానికి చెందిన ఒక అతి పెద్ద వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి, మార్పులు చేపట్టడానికి ముందు ఆ మతానికి చెందిన ప్రముఖులను, పెద్దలను కనీస మాత్రంగా సంప్రదిం చకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సవరణ బిల్లులోని అంశాలకు సంబంధించి సంబంధిత వ్యక్తు లతో ప్రభుత్వం ముందుగా చర్చలు జరిపితే సమంజసంగా ఉండేది. ఇందులోని అంశాల పట్ల బీజేపీ మిత్రపక్షాలకు సైతం సొంత అభిప్రాయాలున్నట్టు కనిపిస్తోంది. మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25, 26 కల్పిస్తున్న ప్రాథమిక హక్కులను ఈ బిల్లు ఉల్లంఘించే అవకాశం ఉంది. ముస్లింల విస్తృత ప్రయోజనాల కోసమే ఈ బిల్లును తీసుకు వస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ విషయంలో ముస్లిం మతస్థులకు కూడా నమ్మకం కుదరాలి కదా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News