Tuesday, November 26, 2024
Homeఓపన్ పేజ్Independence day: పూర్తికాని ఆశయాలు, సాకారం కాని కలలు

Independence day: పూర్తికాని ఆశయాలు, సాకారం కాని కలలు

దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడమంటే కేవలం పతాకావిష్కరణ చేయడంతో పాటు దేశ ప్రగతిని, ప్రజల అభ్యున్నతిని ఒక్కసారి పునశ్చరణ చేయడం కూడా అవుతుంది. బ్రిటిష్‌ పాలకుల అణచివేతల నుంచి బయటపడ్డామని సంతోషించడమే కాదు, తాము తెలిసికో, తెలియకో దేశ ప్రజలను అణచివేస్తున్నామా అన్నది కూడా పాలకులు, రాజకీయ పార్టీలు, అధికారులు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. స్వాతంత్య్ర సమయం నాటి ఆదర్శాల్లో ఒక్క దానినైనా పూర్తి చేశామా, ఒక్కదానినైనా కొనసాగిస్తున్నామా అన్నదాన్ని కూడా పరిశీలించు కోవాల్సిన అవసరం ఉంది. బ్రిటిష్‌ పాలకుల కబంధ హస్తాల నుంచి బయటపడినప్పుడు దేశం రెండుగా విభజన చెందింది. కాల క్రమంలో అదే మూడు దేశాలుగా కూడా మారింది. ప్రస్తుతం ఏ దేశం దారి ఆ దేశానిదే. ప్రజాస్వామ్యపరంగా వ్యక్తీకరించుకోగలిగిన నాడే స్వాతంత్య్ర దినోత్సవ ప్రయోజనం నెరవేరుతుంది. ఒక్క భారతదేశంలోనే కాదు, భారతదేశం నుంచి విడిపడిన దేశాల్లో కూడా స్వాతంత్య్రం వెల్లివిరిసిన నాడు తప్పకుండా స్వాతంత్య్రానికి ఒక విలువ, సార్థకత ఏర్పడతాయి.
ఆందోళనకర విషయమేమిటంటే, భారతదేశం నుంచి విడిపడిన దేశాల్లోనే కాదు, చుట్టుపక్కల ఇతర దేశాల్లో కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. ప్రజా ప్రాతినిధ్య ప్రభు త్వాలు మనుగడ కోల్పోతున్నాయి. ప్రపంచంలోని అనేక దేశాల పరిస్థితి ప్రమాదకరంగా, ఆందోళనకరంగానే ఉంది. వాటిని చక్కదిద్దే ప్రయత్నం కూడా జరగడం లేదు. ప్రజాస్వామ్య దేశాల్లో సైతం విలువలు, ప్రమాణాలు, ఆశయాలు ఆవిరైపోతున్నాయి. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు దాటినా అప్పట్లో ప్రవచించిన ఆశయాలు, చేసిన వాగ్దానాలు, ఇచ్చిన హామీల్లో చాలా భాగం ఇప్పటికీ నెరవేర లేదు. దేశ ప్రజల కలలేవీ పూర్తిగా సాకారం కాలేదు. భారతదేశం తన పొరుగు దేశాల కన్నా, ఆ మాటకొస్తే ప్రపంచంలోని అనేక దేశాల కన్నా ముందుడుగు వేసిన మాట నిజమే. శక్తివంతమైన దేశంగా మారింది. ఆర్థికంగా పరిపుష్టత సాధించింది. ప్రపంచ దేశాల్లో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుంది. అయితే, గతంలో ఎన్నడూ లేనంతగా సామా జికంగా, రాజకీయంగా పునరేకీకరణ చెందడం జరిగింది. దేశ స్వాతంత్య్రం కొన్ని దశాబ్దా లుగా అనేక మలుపులు తిరుగుతోంది. విచిత్రంగా దేశంలో కొన్ని నెలల పాటు స్వాతంత్య్రమే లేకుండా పోవడం కూడా జరిగింది. అనేక సమస్యల నుంచి బయటపడింది. అయితే, ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి.
దేశాన్ని, దేశ ప్రజలను కట్టిపడేసే, బానిసత్వానికి దారితీయించే కొన్ని చట్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. అన్ని వర్గాల మధ్య సర్వసమానత్వానికి ఏమాత్రం అవకాశమివ్వని పద్ధతులు, ప్రక్రియలు, శాసనాలను మార్చడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దేశాన్ని శిలాజంగా మార్చే కుట్రలు, కుతంత్రాలు కొనసాగుతూనే ఉన్నాయి. వలస పాలకుల ప్రభావం నుంచి దేశం బయటపడలేకపోతోంది. ఆగస్టు 15, 1947 నాటి కనీస ఆశయాలైన భావ ప్రకటన, వ్యక్తి స్వేచ్ఛకు ఆటంకాలు ఏర్పడుతూనే ఉన్నాయి. ప్రతి స్వాతంత్య్ర దినోత్సవంతోనూ పటిష్ఠం కావలసిన రాజ్యాంగ పరమార్థం ప్రతి స్వాతంత్య్ర దినోత్సవంతోనూ దిగజారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దేశం వడివడిగా పురోగతి చెందుతోంది. బహుళ సంస్కృతులు, బహుళ మతాల సమాజాలతో వైవిధ్యం కొనసాగుతూనే జాతీయవాదంతో సంఘటితంగా ఉండడమనే ప్రాథమిక సూత్రానికి తగ్గట్టుగా రాజకీయ పార్టీలు వ్యవహరించడం తగ్గిపోతోంది. రాష్ట్ర సమాఖ్య స్ఫూర్తి క్రమంగా దృఢపడుతోంది. జాతీయ సంపద వృద్ధి చెందుతోంది. పాలకుల సరికొత్త ఆశయాలు, దేశ ప్రజల సరికొత్త ఆశలు, కలలు దేశాన్ని కొత్త మలుపులు తిప్పుతున్నాయి. అయితే, దేశ ప్రజల కన్నీళ్లు, కష్టాలు పూర్తిగా తీరే వరకూ, ఆశయాలన్నీ నెరవేరే వరకూ దేశానికి పూర్తి స్థాయి స్వాతంత్య్రం లభించినట్టు కాదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News