Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Ram Madhav: ఒక యోధుడి పున‌రాగ‌మ‌నం

Ram Madhav: ఒక యోధుడి పున‌రాగ‌మ‌నం

మాధ‌వ్‌జీకీ ఆనా జ‌రూరీ హై ఔర్ మ‌జ్‌బూరీ భీ

వార‌ణాసి రామ్ మాధ‌వ్‌..ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కోన‌సీమ ప్రాంతంలో పుట్టిన ఒక సాధార‌ణ వ్య‌క్తి. కొన్నేళ్ల పాటు బీజేపీలో ఉజ్వ‌లంగా వెలిగి, ఈశాన్య రాష్ట్రాల‌తో పాటు జ‌మ్మూక‌శ్మీర్‌లో పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డంలో అత్యంత కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న‌.. ఆ త‌ర్వాత ఉన్న‌ట్టుండి కొంత దూరం జ‌రిగారు..లేదా పార్టీయే ఆయ‌న‌ను కొంత దూరం పెట్టింది. మ‌న‌సులో ఉన్న మాట‌ను కుండ బ‌ద్ద‌లుకొట్టిన‌ట్లు చెప్ప‌డ‌మ‌నే ఆయ‌న‌కున్న అల‌వాటే అందుకు కార‌ణం కావ‌చ్చు. అల్ జ‌జీరా ఛాన‌ల్ నిర్వ‌హించిన ఒక కార్య‌క్ర‌మంలో మెహిదీ హ‌స‌న్ అనే జ‌ర్న‌లిస్టు ఆయ‌న‌ను ఏదో అడ‌గ్గా, మీ ఐసిస్ వ‌ల్లే ఇలా జ‌రుగుతోంది అని ఆయ‌న మొహమ్మీదే అనేశారు. ఆ త‌ర్వాతి నుంచి మెహిదీ హ‌స‌న్‌ను ఐసిస్ మద్ద‌తుదారుగా చాలామంది ట్రోల్ చేశారు. 2019లో సార్వ‌త్రిక ఎన్నిక‌లకు ముందు బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించే ప‌రిస్థితుల్లో ఉండ‌క‌పోవ‌చ్చ‌ని, అందువ‌ల్ల మిత్ర‌ప‌క్షాల మీద త‌ప్ప‌నిస‌రిగా ఆధార‌ప‌డాల్సి ఉంటుంద‌ని ఆయ‌న త‌న వ్యాసంలో వ్యాఖ్యానించారు. కానీ, అనుకోకుండా ఆ ఎన్నిక‌ల్లో బీజేపీకి సొంతంగానే 303 స్థానాలు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత 2020లో జ‌గ‌త్ ప్ర‌కాష్ న‌డ్డా బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గాన్ని పున‌ర్వ్య‌వ‌స్థీక‌రించే స‌మ‌యంలో రామ్ మాధ‌వ్‌ను ప‌క్క‌న పెట్టారు.

- Advertisement -

పూర్తి పట్టున్న వ్యక్తి..

తాజాగా జ‌మ్మూక‌శ్మీర్ రాష్ట్రానికి మ‌ళ్లీ ఎన్నిక‌ల తేదీలు వ‌చ్చాయి. సుమారు నెల రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. దాంతో అక్క‌డి ఎన్నిక‌ల వ్య‌వ‌హారాలు చూసేందుకు బీజేపీకి మ‌ళ్లీ ఒక న‌మ్మ‌క‌మైన‌, ఆ రాష్ట్రంపై పూర్తి ప‌ట్టున్న వ్య‌క్తి కావ‌ల్సి వ‌చ్చారు. దాంతో కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డితో పాటు.. వార‌ణాసి రామ్ మాధ‌వ్‌ను మ‌ళ్లీ జమ్మూ కశ్మీర్ ఇన్‌చార్జిగా నియ‌మించింది. క‌శ్మీర్‌లో పార్టీకి చెందిన ఒక సీనియ‌ర్ కార్య‌క‌ర్త మాట‌ల్లో చెప్పాలంటే, మాధ‌వ్‌జీకీ ఆనా జ‌రూరీ హై ఔర్ మ‌జ్‌బూరీ భీ (మాధ‌వ్ రావ‌డం ఇప్పుడు అవ‌స‌ర‌మే కాదు, అది పార్టీకి త‌ప్ప‌నిస‌రి కూడా). జమ్మూ కశ్మీర్‌లో మూడు విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్‌ 18న తొలి దశ, 25న రెండోదశ, అక్టోబర్‌ ఒకటిన మూడో దశ ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్‌ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.

చిత్తశుద్ధి-నిబద్ధత..

అవును.. రామ్ మాధ‌వ్ సేవ‌లు పార్టీకి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ్డాయి. ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులై.. త‌న‌కు అప్పగించిన ప్రతీ బాధ్యతను చిత్తశుద్ధితో నెరవేర్చడం, పార్టీ పట్ల నిబద్దత ఆయనకు సొంతం. ఒక తెలుగువాడు అయి ఉండి ఇతర రాష్ట్రాలకు ఇన్‌చార్జిగా నియమితులై, ఆయా రాష్ట్రాల్లో పార్టీ విజయదుందుభి మోగించడంలో కీల‌క‌పాత్ర పోసించిన రాజకీయ చాణుక్యుడు ఆయ‌న‌. నిజానికి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ వెలుగు వెలుగొందుతారని భావించిన ఆయన అనంతరం ఆర్ఎస్ఎస్‌లోకి వెళ్లిపోయారు. దీంతో ఇక బీజేపీలో ఆయన శకం ముగిసినట్లేనని అంతా భావించారు. కానీ అనూహ్యంగా మళ్లీ తెరపైకి వచ్చారు.

ఈశాన్య రాష్ట్రాలు, జమ్ము-కశ్మీర్ లో కీలకం..

ప్ర‌స్తుత డాక్ట‌ర్ బీఆర్ ఆంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా అమలాపురానికి చెందిన వారణాసి రామ్ మాధవ్ ఆర్ఎస్‌ఎస్ నుంచి బీజేపీలో కీలకంగా వ్యవహరించారు. 2014-20 వరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ మధ్యకాలంలో జమ్ము కశ్మీర్, అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాల రాజకీయ వ్యవహారాలను నిర్వహించే బాధ్యతలు నిర్వర్తించి విజయవంతం అయ్యారు. 2020 సెప్టెంబర్ 26న పునర్వ్యవస్థీకరణలో భాగంగా బీజేపీ ఆయనను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించింది. దీంతో రామ్ మాధవ్ తిరిగి ఆర్ఎస్ఎస్‌లోకి వెళ్లిపోయారు.

పొలిటికల్ ఇంజినీరింగ్..

రామ్ మాధవ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రులు. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో పొలిటికల్ సైన్స్‌ను కర్ణాటకలోని మైసూర్ యూనివర్సిటీలో పూర్తి చేశారు. యుక్తవయసులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తో అనుబంధం ఏర్పడింది. 1981లో ఆర్ఎస్ఎస్‌లో చేరిన రామ్ మాధవ్ పలు విభాగాలకు, కీలకమైన కేడర్లలో పనిచేశారు. భారతీయ ప్రజ్ఞ పత్రిక ఎడిటర్‌గా.. తెలుగు పత్రిక జాగృతికి అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో వచ్చే పత్రికకు రామ్ మాధవ్ పూర్తిస్థాయి జర్నలిస్ట్‌గా పనిచేశారు. ప్రధాని న‌రేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రామ్ మాధవ్‌కు పార్టీలో పూర్తి స్వేచ్ఛ‌ ఇస్తూ ప్రోత్సహించారు.

మోదీ వెళ్లాలంటే దానికి ముందు…
న‌రేంద్ర మోదీ ప్ర‌ధాని అయిన త‌ర్వాత ఆయ‌న చేసే ప్ర‌తి విదేశీ పర్యటనలోనూ రామ్ మాధవ్ కీలకంగా వ్యవహరించేవారు. నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ఖరారు కాగానే.. ఆయ‌న వెళ్ల‌డానికి ముందే రామ్ మాధవ్ ఆ ప్రాంతంలో పర్యటించి, ఓ నివేదిక రూపొందించి అది మోదీకి అందించేవారు. రామ్ మాధవ్ ఇచ్చే నివేదికను బట్టే మోదీ ఆ దేశంలో ఏం చేయాలో, ఏం మాట్లాడాలో కూడా ఖ‌రార‌య్యేద‌న్న‌ది పార్టీ వ‌ర్గాలు చెబుతున్న మాట‌. ప్రధాని హోదాలో మోదీ వెళ్లి వచ్చిన తర్వాత మళ్లీ అదే దేశానికి మరోసారి రామ్ మాధవ్ వెళ్లి, అప్పుడు జ‌రిగిన ఒప్పందాల గురించి, చేయాల్సిన కార్య‌క్ర‌మాల గురించి ఫాలో అప్ చేసేవారు. ఈ స్థాయిలో ఆయ‌న కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డం, ప్ర‌ధాని మోదీ, అమిత్ షాల‌తో స‌త్సంబంధాలు ఉండ‌టంతో ఒకానొక దశలో రామ్ మాధవ్‌ను రాజ్యసభకు పంపి కేంద్ర‌మంత్రి ప‌ద‌వి కూడా ఇస్తార‌ని గ‌ట్టిగా వినిపించింది. కానీ అది జరగకపోగా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కూడా పోయింది. తాజాగా జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఇన్‌చార్జిగా నియమితులు అవ్వడంతో ఒక యోధుడు పార్టీలోకి పున‌రాగ‌మ‌నం చేసిన‌ట్ల‌యింది.

ఇన్నాళ్లూ ఏం చేశారు..?
పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి నుంచి త‌ప్పించిన త‌ర్వాత కూడా రామ్ మాధ‌వ్ ఏమీ ఖాళీగా లేరు. త‌న మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటూ, త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన ర‌చ‌నా వ్యాసంగాన్ని కూడా కొన‌సాగిస్తూనే ఉన్నారు. 2024 ఎన్నిక‌ల ఫ‌లితాల కూడా ఇటీవ‌ల ఆయ‌న త‌న‌దైన శైలిలో కుండ బ‌ద్ద‌లుకొట్టిన‌ట్లు ఒక సంపాద‌కీయ వ్యాసం రాశారు. దాని శీర్షిక‌.. ఎ మ్యాండేట్ ఫ‌ర్ హ్యుమిలిటీ.. అంటే విన‌యానికి ద‌క్కిన విజ‌యం అని అర్థం.

రామ్ మాధవ్ మంత్ర బలం ఇదే..

2014లో జమ్మూక‌శ్మీర్ ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు అందులో బీజేపీ విజ‌యంలో రామ్ మాధ‌వ్ చాలా కీల‌క పాత్ర పోషించారు. ఆ ఎన్నిక‌ల్లో పీపుల్స్ డెమోక్ర‌టిక్ పార్టీ (పీడీపీ) 28 స్థానాలు సాధిస్తే, బీజేపీ 25 స్థానాలు పొంది రెండో అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించింది. ఫ‌రూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ పార్టీకి ఆ ఎన్నిక‌ల్లో ద‌క్కిన స్థానాలు 15 మాత్ర‌మే. అంత‌కుముందు 2008 ఎన్నిక‌ల్లో బీజేపీ సొంతంగా గెలుచుకున్న‌వి 11 స్థానాలే. దీన్ని బ‌ట్టే రామ్ మాధ‌వ్ వేసిన మంత్ర‌బ‌లం ఏంటో అర్థ‌మ‌వుతుంది. హంగ్ అసెంబ్లీ కార‌ణంగా జ‌మ్మూ క‌శ్మీర్‌లో కొంత కాలం గ‌వ‌ర్న‌ర్ పాల‌న కొన‌సాగింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ రామ్ మాధ‌వ్ రంగ‌ప్ర‌వేశం చేసి, పీడీపీతో పొత్తు పెట్టుకుని పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అప్పుడు ముఫ్తీ మ‌హ‌మ్మ‌ద్ స‌యీద్ ముఖ్య‌మంత్రి అయ్యారు.

ఆపరేషన్ నార్త్ ఈస్ట్..

క‌శ్మీర్‌లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన త‌ర్వాత‌.. రామ్ మాధ‌వ్ ఈశాన్య భార‌తంపై దృష్టిపెట్టారు. అప్ప‌టికే దాదాపు రెండు ద‌శాబ్దాల పాటు ఆర్ఎస్ఎస్ పూర్తిస్థాయి కార్య‌క‌ర్త‌లు రాకా సుధాక‌ర్ రావు లాంటివాళ్లు వేసిన పునాదుల‌ను మ‌రింత బ‌లోపేతం చేస్తూ రెండేళ్ల పాటు అస్సాంలో ప‌నిచేశారు. దాంతో ఆ రాష్ట్రంలోని 126 స్థానాలకు గాను 86 స్థానాల‌ను సొంతం చేసుకుని, తొలిసారిగా బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది. స‌ర్బానంద సోనోవాల్ అస్సాంకు తొలి బీజేపీ ముఖ్య‌మంత్రి అయ్యారు. అప్ప‌టి వ‌ర‌కు సంప్ర‌దాయంగా కాంగ్రెస్ చేతుల్లోనే ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఒక్కొక్క‌టిగా బీజేపీ ఛ‌త్ర‌ఛాయ కింద‌కు వ‌చ్చేశాయి.

ఆర్ఎస్ఎస్ ప‌ట్టుబ‌ట్టి పంపిందా?

2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ స్థానాలు గ‌ణ‌నీయంగా త‌గ్గ‌డంతో పార్టీ నాయ‌క‌త్వాన్ని ఆర్ఎస్ఎస్ నిశితంగా విమర్శించింది. జూన్‌లో నాగ్‌పూర్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో రాజ‌కీయ పార్టీలు, వాటి నాయ‌కుల మీద ఆర్ఎస్ఎస్ స‌ర్ సంఘ్ చాల‌క్ మోహ‌న్ భాగ‌వ‌త్ గ‌ట్టిగా విమ‌ర్శ‌లు చేశారు. నిజానికి గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీకి ఆర్ఎస్ఎస్ పూర్తిస్థాయిలో అండ‌దండ‌లు అందించ‌లేద‌ని, కాస్త వెన‌క్కి త‌గ్గింద‌ని స‌మాచారం. పార్టీకి గ‌ట్టి ప‌ట్టుంద‌ని భావించే ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌తో పాటు, పశ్చిమ‌ బెంగాల్‌లోనూ బీజేపీ ప్రాభ‌వం గ‌ణ‌నీయంగా త‌గ్గ‌డంతో ఈ విష‌యం స్ప‌ష్ట‌మైంది. దాంతో ఆర్ఎస్ఎస్ మ‌ళ్లీ త‌న అవ‌స‌రాన్ని నొక్కి చెప్ప‌డం వ‌ల్లే రామ్ మాధ‌వ్‌ను మ‌రోసారి బీజేపీ అక్కున చేర్చుకుని కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింద‌ని అంటున్నారు. అందుకే దాదాపు ఐదేళ్ల అజ్ఞాత వాసం త‌ర్వాత మ‌ళ్లీ బీజేపీలోకి రామ్ మాధ‌వ్ ఒక యోధుడిలా పున‌రాగ‌మ‌నం చేశారు. జ‌మ్మూక‌శ్మీర్‌లో త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ మేజిక్ చేయాల‌న్న ఉద్దేశంతోనే పార్టీ ఆయ‌న్ను మ‌ళ్లీ పిలిపించింది. ఆయన మ‌ళ్లీ త‌న మ్యాజిక్ చూపిస్తారా? ఎందుకంటే క‌శ్మీర్‌లో అణువ‌ణువూ రామ్ మాధ‌వ్‌కు కొట్టిన‌పిండే. అక్క‌డ పార్టీల‌తో సంబంధం లేకుండా నాయ‌కులంద‌రూ ఆయ‌న‌కు సుప‌రిచితులే. చివ‌ర‌కు స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌తో కూడా ఆయ‌న‌కు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు పార్టీని క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం చేయ‌డానికి అంత స‌మ‌యం లేక‌పోయినా, నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం సాధించ‌డం, స‌రైన అభ్య‌ర్థుల‌ను దుర్భిణీ వేసి గాలించి ప‌ట్టుకోవ‌డం, వారిలోంచి గెలుపు గుర్రాల‌ను ఎంపిక చేయ‌డం లాంటి బృహ‌త్త‌ర బాధ్య‌త‌లు ఆయ‌న‌పై ఉంటాయి. ఈ దిశ‌గా ఆయ‌న ప‌య‌నం ఎలా ఉంద‌న్న‌ది అక్టోబ‌ర్ 4న వెలువ‌డే ఫ‌లితాల్లో తెలుస్తుంది.

స‌మ‌య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర శ‌ర్మ‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News