ఇది విషయం..
మూసీ నదికి 50 మీటర్ల దూరం వరకు నిర్మాణాలపై ఆంక్షలు ఉన్నాయి
మూసీ నది ఒడ్డు నుంచి (రెవెన్యూ అధికారులు నిర్ణయించిన హద్దు) 50 మీటర్ల వరకు ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్ అంటారు.
ఈ బఫర్ జోన్ లో ఉన్న మెజారిటీ భూమి ప్రైవేటు సర్వే నంబర్లదే (ప్రైవేటు వ్యక్తులకు చెందినదే)
ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ బఫర్ జోన్ లో ఉన్న భూమిని సేకరించలేదు. ఆయా భూములు ప్రైవేటు వ్యక్తుల పరిధిలోనే ఉన్నాయి. దానికి వారు పూర్తి స్థాయిలో హక్కుదారులు కూడా.
బఫర్ జోన్ లో రోడ్లు లేదా గ్రీనరీ లాంటివి అభివృద్ధి చేయవచ్చు. దీనికి నిబంధనలు అడ్డు రావు.
ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్.టి.ఎల్) అనేది ఆయా చెరువుల నీటి పూర్తి పారకం బట్టి ఉంటుంది. దీనిని ఉమ్మడి రాష్ట్రంలోనే హుడా, ఎంసీహెచ్, జీహెచ్ఎంసీలు మున్సిపాలిటీలు మెజారిటీ చెరువులను సర్వే చేసి ఈ ఎఫ్.టి.ఎల్. ను గూగుల్ కోఆర్డినేట్స్ తో సహా గుర్తించి హైకోర్టుకు నివేదిక సమర్పించి ఉన్నారు. అవి నేటికీ ప్రామాణికమే.
మూసీ విషయం వచ్చే వరకు మూసీ ఫ్లడ్ లెవెల్ (ఎం.ఎఫ్.ఎల్) ను ఇరిగేషన్ శాఖ ఉమ్మడి రాష్ట్రం సమయంలోనే నిర్ధారించింది. ఈమేరకు మెమోలు కూడా జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిటీ వేసి అప్పటి మున్సిపల్ శాఖకు అందించింది కూడా.
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ మొదలుపెడితే నాగోలు వరకు ఈవిధంగా ఎంఎఫ్ఎల్ ను నిర్ణయించారు కూడా. ఎన్ని క్యూసెక్కుల వరద వస్తుందో కూడా ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు.
ఇలా గుర్తించిన ఎం.ఎఫ్.ఎల్ విషయంలో రెవెన్యూ, ఎం.ఆర్.డి.సి.ఎల్., ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయం లేదు. ఎవరి లెక్కలు వారికున్నాయి. ఇరిగేషన్ శాఖ ప్రకారం మూసీ ఎం.ఎఫ్.ఎల్ అనేది లక్షా 25 వేల క్యూసెక్కుల నుంచి లక్ష యాభై క్యూసెక్కుల వరకు చూపిస్తోంది. అదే రెవెన్యూ లెక్క ప్రకారం అది 25 వేల క్యూసెక్కులు దాటడం లేదు.
కొన్ని సందర్భాల్లో భారీ, అతి భారీ వర్షాల కారణంగా వచ్చే వరద నీటిని పరిగణలోకి తీసుకుంటే మూసీ వరద నీరు బఫర్ జోన్ దాటి కూడా ప్రవహించిన సందర్భాలున్నాయి. అలాగని ఆ ప్రాంతం మొత్తాన్ని ఎం.ఎఫ్.ఎల్. గా (ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలను) పరిగణలోకి తీసుకోలేం కదా.
ఇలా అరుదుగా వచ్చిన వరదలను కొందరు వీడియో తీసి, ఫోటోలు తీసి ఈ వ్యూ మొత్తం ఎం.ఎఫ్.ఎల్ అంటూ ఈ పరివాహక ప్రాంతాల్లో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇది గందరగోళానికి దారితీస్తోంది. ఇకనైనా ప్రభుత్వం రెవిన్యూ, ఇరిగేషన్, ఎం.ఆర్.డి.సి.ఎల్. మధ్య మూసీ ఎం.ఎఫ్.ఎల్.పై ఒకే నిర్ణయాన్ని తీసుకు రావాల్సిన అవసరం ఉంది. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో కూడా రెవెన్యూ నిర్ణయించిన మూసీ హద్దులనే పరిగణలోకి తీసుకుంటామని స్పష్టంచేసింది.
గందరగోళమంతా ఈ సమన్వయం లేకపోవటంతోనే తలెత్తుతోంది. ఈ విషయమై కూడా స్థానికంగా ఆయా ప్రభుత్వ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, మీడియా ప్రతినిధులకు ఒక ఓరియెంటేషన్ క్లాసు పెడితే తప్ప యావత్ అంశంపై స్పష్టత రాదు.