రామగుండం మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నాయకులు కోరుకంటి చందర్ ప్రతిభ్రమించి వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, కార్పొరేటర్ మహంకాళి స్వామి ఎద్దేవా చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. చందర్ ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్ల కాలంలో రామగుండం ప్రాంతానికి ఒక్క రూపాయి నిధులు కూడా నిధులు తీసుకు రాలేదని, తీసుకొచ్చిన నిధులు కూడా కేవలం జీవోలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు.
రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యేగా అయిన వెంటనే వందల కోట్ల నిధులు తీసుకొచ్చారని తెలిపారు. కాగితాలకే పరిమితం కాకుండా మంజూరు చేయించారని గుర్తు చేశారు. ఒకవైపు లక్ష్మీ నగర్ వ్యాపార కేంద్రంలో మంత్రి అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేస్తుంటే మరోవైపు చందర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వందల కోట్ల నిధులు కేసీఆర్ మంజూరు చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. టిఆర్ఎస్ పదేళ్లలో చేయని పనులను 10 నెలల కాలంలో తాము చేసి చూపిస్తున్నామని తెలిపారు. టిఆర్ఎస్ ఏమి చేయలేదనే ప్రజలు ఇటీవల జరిగిన ఎన్నికలలో బుద్ధి చెప్పారని ఇప్పటికైనా ఆ పార్టీ నాయకులు అభివృద్ధి కోసం తమకు తోడ్పాటు అందించాలని, లేనిపోని ఆరోపణలు చేస్తూ పార్టీని బదనాం చేసే వైఖరి మానుకోవాలని సూచించారు. పెద్దెల్లి ప్రకాష్, తిప్పారపు శ్రీనివాస్, బొమ్మక రాజేష్, ,యుగంధర్,మాలెం మధు,నాయిని ఓదెలు ప్రెస్ మీట్లో పాల్గొన్నారు.