కురుక్షేత్ర యుద్ధం సందర్భంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధనల స్పూర్తితో.. చెరువుల ఆక్రమణలపై మా ప్రభుత్వం యుద్ధం చేస్తుందని, ఇది రాజకీయాల కోసం, రాజకీయ కక్షల కోసం చేపట్టిన కార్యక్రమం కాదన్నారు. భవిష్యత్ తరాలు బాగుండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టామని, ఎవరు ఎన్ని ఒత్తిడులు తెచ్చినా చెరువుల ఆక్రమణదారుల భరతం పడతామని ప్రకటించారు సీఎం.
కాంక్రీట్ జంగిల్ లో ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందించేందుకు ఇక్కడ హెరిటేజ్ టవర్ నిర్మిచడం గొప్ప విషయమని, ఈ టవర్ 430 అడుగుల ఎత్తు నిర్మితం కావడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు సీఎం రేవంత్. 36 లేదా 40 నెలల్లో ఈ టవర్ నిర్మణం పూర్తి అవుతుందని.. అది మళ్లీ మనమే ప్రారంభించుకుంటామని సీఎం రేవంత్ చెప్పటం హైలైట్.
ఇది చరిత్రలో నిలిచిపోయే గొప్ప సందర్భమని, వందేళ్ల క్రితమే హైదరాబాద్ ను నిజాం లేక్ సిటీగా అభివృద్ధి చేశారని, కోట్లాది మంది దాహార్తిని తీర్చే చెరువుల పరిధిలో విలాసాల కోసం కొందరు ఫామ్ హౌస్ లు నిర్మించుకున్నారని గుర్తు చేశారు సీఎం.
నగరానికి తాగునీరు అందించే గండిపేట్, హిమాయత్ సాగర్ లోకి ఫామ్ హౌస్ ల నుంచి వ్యర్ధజలాలు వదులుతున్నారని, వీటిని ఇలాగే వదిలేస్తే మేము ప్రజా ప్రతినిధులుగా ఉండి వ్యర్ధమేనంటూ సీఎం హెచ్చరించారు. అందుకే హైడ్రా ద్వారా… చెరబట్టిన వారి నుంచి చెరువులను విడిపిస్తున్నామన్నారు.
జీవితంలో ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇలాంటి అరుదైన అవకాశం వస్తుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం నా జన్మ సుకృతమంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హరే కృష్ణ హెరిటేజ్ టవర్ శంఖుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు.
ధర్మాన్ని కాపాడాలన్న శ్రీకృష్ణుడి బోధనల స్ఫూర్తిగా మా ప్రభుత్వం ధర్మంవైపు నిలబడుతుందని, విద్య, వైద్యం మా ప్రభుత్వ ప్రాధాన్యత ఇస్తున్నట్టు రేవంత్ వెల్లడించారు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్, క్యాన్సర్ ఆస్పత్రులల్లో భోజనం అందించేందుకు హరే కృష్ణ ఫౌండేషన్ ను సహకారం కోరుతున్నామని, ఇందుకోసం ప్రభుత్వంవైపు నుంచి మీకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామన్నారు.