Friday, November 22, 2024
HomeదైవంSankarpalli: అష్ట దరిద్రాలను పోగొట్టే మరకత లింగం

Sankarpalli: అష్ట దరిద్రాలను పోగొట్టే మరకత లింగం

బ్రహ్మ సూత్రం కలిగిన శివలింగ..

రంగారెడ్డి జిల్లా శంకర్‌ పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయం ఉంది. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ మరకత సోమేశ్వర లింగాన్ని సేవిస్తే వ్యాధులు పోతాయని, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. భక్తులను అనుగ్రహించడానికి పరమేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగ రూపాల్లో వెలిశాడు. ఈ క్షేత్రాల్లో మహారాష్ట్రలోని పర్లి ప్రత్యేకమైంది. ఇక్కడ వైద్యనాథేశ్వరుడిగా కొలువుదీరి ఆయురారోగ్యాలను అనుగ్రహిస్తున్నాడు శివుడు. పర్లి వైద్యనాథుడిని పోలిన బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివలింగం చందిప్ప గ్రామంలో ఉంది. చందిప్ప మరకత సోమప్ప విశేషాలెన్నో.

- Advertisement -

ఆలయ ఆల్ ఇండియా కమిటీ చైర్మన్ దయాకర్ స్వామి మాటల్లో..

శివలింగం, పార్థివ లింగం, స్ఫటిక లింగం, సైకత లింగం ఇలా వివిధ రూపాల్లో దర్శనమిస్తుంది. అందులోనూ మరకత లింగం ముదురు ఆకుపచ్చ రంగులో మెరిసిపోతూ ఉంటుంది. అరుదైన ఆ మరకత లింగం కొలువై ఉన్న చందిప్ప క్షేత్రానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ముచుకుంద నది ఒడ్డున ఉందీ క్షేత్రం. క్రీస్తు శకం 1076-1126 మధ్య పశ్చిమ చాళుక్య రాజు ఆరో విక్రమాదిత్యుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని శాసనం ద్వారా తెలుస్తున్నది. క్రీ.శ.1101 సంవత్సరం కార్తిక శుద్ధ పంచమి గురువారం నాడు ప్రతిష్ఠ ఉత్సవం జరిగిందని అదే శాసనంలో స్పష్టంగా లిఖించారు. దాదాపు 920 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ పురాతన శివాలయం కాలపరీక్షకులోనై శిథిలమైపోయింది. పదిహేనేండ్ల కిందట కొందరు భక్తులు పూనుకొని పునరుద్ధరించారు. నూతన గర్భాలయాన్ని నిర్మించారు.

ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి మాటల్లో..

ఆరోగ్య పదాతగా..పర్లిలోని వైద్యనాథ జ్యోతిర్లింగానికి, చందిప్ప మరకత లింగానికి చాలా పోలికలు ఉన్నాయని చెబుతారు పండితులు. చందిప్ప శివయ్యను పూజిస్తే పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. అసలే శివుడు అభిషేక ప్రియుడు. ఐదు సోమవారాలు కానీ, ఐదు పౌర్ణములు కానీ, ఐదు మాస శివరాత్రులు కానీ మరకత లింగాన్ని అర్చిస్తే సకల కోరికలూ నెరవేరుతాయని విశ్వాసం. పౌర్ణమినాడు లింగాభిషేకం చేసిన జలాలతో స్నానం చేసిన వారికి వైకుంఠప్రాప్తి తథ్యమని చెబుతారు. అంతేకాదు బ్రాహ్మీ ముహూర్తంలో.. అభిషేకిస్తే పరమశివుడి కటాక్షం లభిస్తుందని స్థానిక ఐతిహ్యం.

భైరవం.. క్షేత్రపాలం: ఆలయ గౌరవ చైర్మన్ సదానందం గౌడ్

ఈ ఆలయానికి కాలభైరవుడు క్షేత్ర పాలకుడు. ఆలయ ప్రాంగణంలో వెలిసిన కాలభైరవుడు ఆవరణను వెయ్యి కండ్లతో రక్షిస్తూ ఉంటాడని చెబుతారు. ఆదివారం కాలభైరవుడిని పూజిస్తే సమస్త గ్రహదోషాలూ తొలగిపోతాయని స్థల పురాణం చెబుతోంది. అంతేకాదు శివుడి కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ నాగుపాము రూపంలో సంచరిస్తూ ఉంటాడని ప్రతీతి. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయం కొన్నేండ్ల కిందటి వరకూ నిరాదరణకు గురైంది. పండుగలప్పుడు తప్ప భక్తులు వచ్చేవారు కాదు. 2007లో శివరాత్రి సందర్భంగా ఒక భక్తుడు ఆలయంలో అభిషేకం చేశాడు. అప్పుడు శివలింగంపై ప్రసరించిన సూర్యకిరణాలు పరావర్తనం చెందడంతో దానిని మరకత లింగంగా గుర్తించాడు. తర్వాత చందిప్ప చరిత్ర తెలుసుకొని భక్తుల సహకారంతో ఆలయాన్ని పునరుద్ధరించాడు. శ్రావణం, కార్తిక మాసాలలో ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. శివరాత్రి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. హైదరాబాద్ చుట్టుపక్కల వాసులు వారాంతంలో వెళ్లిరావడానికి అనువైన క్షేత్రమిది. మానసిక ఒత్తిళ్లతో కూడిన జీవితంలో ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన మనోబలాన్ని ప్రసాదిస్తుంది.

దేవుడి మాన్యాలు

చందిప్ప ఆలయానికి విక్రమాదిత్యుడి కాలంలోనే వందలాది ఎకరాలు మాన్యాలుగా సమర్పించినట్టు ఇక్కడి శాసనం తెలియజేస్తున్నది. ఆలయ నిర్వహణ, విశేష పూజలు, శివరాత్రి వంటి ఉత్సవాల నిర్వహణకు దాదాపు 254 ఎకరాలు కేటాయించినట్లు అందులో ఉన్నది. ఆలయానికి పశ్చిమ దిశలో 153 ఎకరాలు, తూర్పు దిశలో 2.20 ఎకరాలు, వరి పంట, పూలతోట కోసమని 54 ఎకరాలు, ఆలయ అర్చకులకు, నిత్యాన్నదానం కోసం మరిన్ని ఎకరాలు.. ఇలా అపారమైన మాన్యాలు ఉన్నాయని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు.

ఆలయానికి ఎలా వెళ్లాలి?

చందిప్ప క్షేత్రం హైదరాబాద్ నగరం నుండి 48 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మెహదీపట్నం, పటాన్ చెరు నుండి శంకర్‌పల్లి వరకు బస్సులో వెళ్లాలి. సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్ ల నుండి శంకర్‌పల్లి వరకు రైలు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి చందిప్ప ఆలయానికి ఆటోలు ఉంటాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News