Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్వృద్ధుల జనాభాతో సరికొత్త సవాళ్లు!

వృద్ధుల జనాభాతో సరికొత్త సవాళ్లు!

ఒకప్పుడు ఆయన ఒక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌. ఆయనను విద్యార్థులే కాకుండా, అధ్యాప కులు కూడా నడిచే విజ్ఞాన సర్వస్వంగా పరిగణించేవారు. ప్రస్తుతం ఆయన వయసు 90 ఏళ్లు. భార్య, ఇద్దరు పిల్లలు కాలగర్భంలో కలిసిపోయారు. ఆయన ఇప్పుడు వృద్ధాశ్రమంలో బతుకు బండిని లాగుతున్నారు. నిజానికి ఆయనకు కూడా మరణించాలని ఉంది. కానీ, ఆత్మహత్య మహా పాపం కదా? గౌరవప్రదంగా జీవించడమనేది ముఖ్యం కదా? నిజానికి ఆయన జీవితం గౌరవప్రదంగా ఏమీ సాగడం లేదు. చనిపోయే వరకూ జీవించి ఉండడమే మంచిదని ఆయన తన జీవితాన్ని ఇష్టం లేకపోయినా కొనసాగిస్తున్నారు. భారత దేశంలో స్వచ్ఛంద మరణం చట్టబద్ధం కాదు. బెల్జియం, కెనడా, కొలంబియా, ఈక్వెడార్‌, లగ్జంబర్గ్‌, నెదర్లాండ్స్‌, న్యూజీలాండ్‌ స్పెయిన్‌, ఆస్ట్రేలియా, అమెరికాలోని కొన్ని ప్రాంతాలు స్వచ్ఛంద మరణానికి అవకాశం కల్పిస్తున్నాయి. ప్రశాంతంగా కన్నుమూయ డానికి అవసరమైన మందులు ఇక్కడ బాగానే లభ్యమవుతాయి. ఆ మందులు వేసుకున్న కొద్ది క్షణాల్లోనే శ్వాస ఆగిపోతుంది.
భారతదేశం యువజన దేశమని కొందరు గొప్పగా చెబుతుంటారు. నిజానికి భారతదేశం ఒక చైతన్యవంతమైన దేశంగా ఎదగాలి. దేశంలో 38 కోట్ల జనాభా 10-24 సంవత్సరాల మధ్య వయసు వారే. ఇటువంటి జనాభా వల్ల ఆర్థికంగా అనేక లాభాలు, ప్రయోజనాలు ఉంటాయని ఇక్కడ పాలకులు నమ్ముతుంటారు. అయితే, ఇక్కడ 60 ఏళ్లు పైబడిన వృద్ధుల జనాభా 15 కోట్ల పైచిలుకే ఉంది. ఇది 2047 నాటికి 35 కోట్లు దాటుతుందని కూడా అంచనా వేస్తున్నారు. అయితే, ఈ 15 కోట్ల జనాభా ఏ విధంగా జీవిస్తున్నారనేది మాత్రం ఎవరికీ పట్టదు. వృద్ధాప్యంలో సుఖంగా బతకడానికి వీలైన డబ్బూ దస్కం వారి దగ్గర ఉందా? ఇందులో ఎంత మందిని వారి కుటుంబాలు జాగ్రత్తగా చూసుకుంటున్నాయి? ఇందులో ఎంత మంది ఆరోగ్యవంతమైన, నాణ్యమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు? ఇంట్లోని వృద్ధుల వల్ల తమకు ఉపయోగం ఉన్నంత కాలం కుటుంబాలు వారి పట్ల దయాదాక్షిణ్యాలతో, సానుభూతితో వ్యవహరిస్తుంటారని అందరికీ తెలిసిన విషయమే.
విదేశీ పరిష్కారాలు
ఒక వృద్ధుడు శారీరకంగా, మానసికంగా నాణ్యమైన జీవితాన్ని గడపలేకపోతున్నాడని ఆమోదిత వైద్యులు ప్రమాణ పత్రాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే బెల్జియం తదితర దేశాల్లో వృద్దులకు స్వచ్ఛంద మరణాన్ని అనుగ్రహించడం జరుగుతుంది. విచిత్రమేమిటంటే ఆ దేశాల్లో స్వచ్ఛంద మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారతదేశంలో యువతకు మాత్రమే విలువ ఉంటుంది. వృద్ధులు ఎలా జీవిస్తున్నారన్నది కుటుంబానికి గానీ, సమాజానికి గానీ, ప్రభుత్వాలకు గానీ పట్టదు. ఇటువంటి నేపథ్యంలో మిగిలిన దేశాలన్నిటికంటే భారతదేశంలోనే స్వచ్ఛంద మరణం అవసరం. ముఖ్యంగా వృద్ధాశ్రమంలో కాలం గడుపుతున్న ప్రొఫెసర్‌ వంటి వారికి ఇది మరీ అవసరం. ఒకప్పుడు ఆయన కళ్లు మిలమిలా మెరుస్తుండేవి.
ఇప్పుడు ఎప్పుడు చూసినా తడిబారి ఉంటున్నాయి. వృద్ధులకు స్వచ్ఛంద మరణావకాశం ఎందుకు ఇవ్వకూడదు? భారత దేశంలో ఉన్న అధ్వాన సామాజిక పరిస్థితులను బట్టి, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు బలహీనంగా ఉండడం బట్టి వృద్ధులకు ఈ అవకాశం తప్పకుండా కల్పించాల్సిన అవసరం ఉంది. వృద్ధుల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వాలు పట్టించుకునే పక్షంలో ఈ అవకాశం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. పైగా ఇటువంటి అవకాశం ఉండకూడదని కూడా వాదించే వాళ్లం. నిధులకు, ఆర్థిక వనరులకు లోటు లేని కుటుంబాలు, సమాజాల్లో కూడా వృద్ధులు అనారోగ్యాలు, ఒంటరితనం, దిగులు వగైరాలతో అవస్థలు పడడం జరుగుతోంది.
నిజానికి, అనేక విషయాల్లో మనుషులకు ఇష్టానిష్టాలకు అవకాశం ఉండదు. పుట్టుక, తల్లి తండ్రులు, జెండర్‌, కులం, మతం, తెలివితేటలు, స్వరూపం వంటివి కర్మ ప్రకారమే చోటు చేసు కుంటాయని అందరూ నమ్ముతారు. అయితే, మరణాన్ని మాత్రం ఎవరికి వారు ఎంపిక చేసు కోవచ్చు. ప్రభుత్వాలు వీటికి ఎందుకు చట్టబద్ధత కల్పించవు? అనేక ఐరోపా దేశాల్లో వృద్ధుల సంరక్షణకు ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యం ఇస్తాయి. మూడు, నాలుగు దశాబ్దాల పాటు ప్రతి వ్యక్తీ తన జీతభత్యాల్లో సుమారు 30 శాతాన్ని ప్రభుత్వానికి చెల్లించడం జరుగుతుంటుంది. పదవీ విరమణ చేసిన తర్వాత మాత్రం వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయమూ లభించదు. ఆర్థిక పరిస్థితి బాగా లేనందువల్ల, ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించడమే తప్ప మెరుగుపడడం జరగదు. జీవన ప్రమాణాలు కూడా అధ్వాన స్థితిలోనే ఉంటాయి. మొత్తానికి నాణ్యమైన జీవితం అనేది దూరమైపోతుంది. అటువంటప్పుడు ప్రశాంతంగా మరణించడానికి అవకాశం కల్పిస్తే తప్పేమిటి? అనారోగ్యాలతో ఒంటరి జీవితం గడుపుతున్న వృద్ధులకు స్వచ్ఛంద మరణావకాశం కల్పించమే ఉత్తమం. దాన్ని వారి ప్రాథమిక హక్కుగా గుర్తించాలి. పేద దేశాలకు ఇంత కంటే గత్యంతరం లేదు. లేనిపోని గొప్పలు, భేషజాలు, శుష్కప్రియాలతో వృద్ధులను మభ్యపెట్టడం ఏ విధంగానూ సమంజసం కాదు. నిజానికి భారతదేశంలో అనేక పురాణ గ్రంథాలు వృద్ధులకు వాన ప్రస్థానాన్ని సూచించాయి. సమాజానికి ఏమీ చేయలేని స్థితిలో ఉన్న వృద్ధులు సమాజం నుంచి శాశ్వతంగా తప్పుకోవడానికే ఈ వానప్రస్థాశ్రమాన్ని సృష్టించారు.
పేద దేశాల్లో స్వచ్ఛంద మరణమనేది కూడా ఒక విలాస విధానంగా కనిపించవచ్చు. అయితే, ఇదే విషయాన్ని వృద్దులను అడిగితే వారేం చెబుతారో కూడా వినాల్సిన అవసరం ఉంది. ప్రశాం తంగా మరణించాలని తామంతా కోరుకుంటున్నట్టు 99 శాతం వృద్ధులు చెబుతారు. ప్రజాస్వా మ్యంలో మెజారిటీకే బలం కదా? వృద్ధాప్యంలో నాణ్యమైన జీవితాన్ని, ఇష్టమైన జీవితాన్ని గడపడం చాలా కష్టమని వారంతా అనుభవపూర్వకంగా, ఏకగ్రీవంగా చెబుతారు. వృద్ధులకు స్వచ్ఛంద మరణాన్ని ప్రసాదించడం మాత్రమే క్రూరమైన, అమానుషమైన చర్యా? భారతదేశంలో ఎప్పుడూ క్రూర విధానాలను అనుసరించలేదా? కొద్ది సంవత్సరాల క్రితం వరకూ దేశంలో ఆత్మహత్యా ప్రయత్నాన్ని నేరంగానే పరిగణించేవారు. ఆత్మహత్య ప్రయత్నం విఫలమయ్యే పక్షంలో ఆ వ్యక్తి సమస్యలను వినడం, సానుభూతితో వ్యవహరించడం ఏనాడూ జరగకపోగా, అతన్ని వెంటనే చెరసాలపాలు చేయడం జరిగేది. పాలకుల దృష్టిలో జీవితాలను ప్రేమించడం, గౌరవించడం అంటే ఇదే.

  • ఎస్‌.ఎస్‌. విజయకుమార్‌, సీనియర్‌ జర్నలిస్టు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News