హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ ఏఐ రాజధానిగా నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఇందుకు సన్నాహకంగా హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 5, 6 తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్లోబల్ ఏఐ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సదస్సు నేపథ్యంలో హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
“తెలంగాణ గ్లోబల్ ఏఐ సమిట్ 2024 గురించి పరిచయం చేయడానికి నేనెంతో ఉద్వేగంతో ఉన్నాను. సమ్మిళిత పరిష్కారాలను సృష్టించడానికి ఏఐ అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. గణనీయమైన సానుకూల సామాజిక ప్రభావాన్ని నడిపించడానికి పరిశ్రమ నాయకులు, విధానకర్తలు, ఆవిష్కర్తల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ లక్ష్యాలను సాధించేందుకు తెలంగాణ సర్వసన్నద్ధంగా ఉంది. అయితే, గొప్ప శక్తితో పాటే ఎప్పుడూ గొప్ప బాధ్యత కూడా వస్తుంది. ఏఐని మనం ఉపయోగించుకుంటున్నప్పుడు, అది నిష్పాక్షికత, పారదర్శకత, జవాబుదారీతనంతో మానవాళికి సేవలందించేలా చూడాలి. సదస్సు విజయానికి అపారమైన అనుభవం ఉన్న, వెలకట్టలేని కీలక పారిశ్రామిక సంస్థ అయిన హైసియాతో మా ప్రభుత్వం సన్నిహితంగా పనిచేస్తోంది” అని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. త్వరలో ఏర్పాటుచేయబోయే నైపుణ్య విశ్వవిద్యాలయం, ప్రతిష్ఠాత్మక ఏఐ సిటీ లాంటి రాష్ట్ర కార్యక్రమాలకు ఐటీ పరిశ్రమ కూడా సహకరించాలని ఆయన కోరారు.
విలేకరుల సమావేశంలో ఆయనతోపాటు తెలంగాణ ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ, ఐటీఈ అండ్ ఈ శాఖ సీఆర్ో అమర్‌నాథ్ రెడ్డి, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఐటీఈ అండ్ ఈ శాఖ ఓఎస్‌డీ ఎల్.రమాదేవి, టీ-హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాసరావు, టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, మాత్ సీఈఓ రాహుల్ పైత్ తదితరులు కూడా పాల్గొని, రాష్ట్రంలో తొలిసారిగా జరిగే ప్రపంచస్థాయి ఏఐ సదస్సులో జరిగే ప్రధాన కార్యక్రమాలు, విశ్వవిఖ్యాత వక్తల గురించి వివరించారు.
ఈ సందర్భంగా హైసియా అధ్యక్షుడు ప్రశాంత్ నాదెళ్ల మీడియాతో మాట్లాడుతూ, “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భవిష్యత్తు చూపించే ప్రభావం, శక్తి, సామర్థ్యాల విషయంలో మేము ముందంజలో ఉన్నందున పరిశ్రమ ఈ ప్రభుత్వ చొరవను చాలా సమయానుకూలంగా భావిస్తోంది. 2024 ఫిబ్రవరిలో జరిగిన హైసియా వార్షిక జాతీయ శిఖరాగ్ర సమావేశంలో పరిశ్రమకు ఏఐ ప్రాధాన్యం స్పష్టంగా కనిపించింది. ఇక్కడ “కృత్రిమ మేధ భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమ, ఆర్థిక వ్యవస్థ, వ్యాపారాల భవిష్యత్తును ఎలా రూపొందిస్తుంది” అనే దానిపై చర్చలు కేంద్రీకృతమయ్యాయి.
కృత్రిమ మేధ నైపుణ్యాలతో పరిశ్రమకు సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని సృష్టించడంపై దృష్టి సారించి, శిఖరాగ్ర సమావేశానికి మద్దతు ఇవ్వడానికి హైసియా ఎంతో నిబద్ధతతో ఉంది. టాస్క్, టీ-హబ్, టీఎస్ఐసీ, ఇతర కీలక ప్రభుత్వ సంస్థల సహకారంతో ఏఐ/జీఎన్ఏఐలో 10,000 మందికి పైగా విద్యార్థులను నైపుణ్యాలను పెంచాలని యోచిస్తున్నాం” అని వివరించారు. సదస్సును విజయవంతం చేయడానికి హైసియా ఏ రకంగా కృషిచేస్తోందో కూడా ఆయన తెలిపారు.