విదేశాల్లో స్థిరపడడం అంటే మన భారతీయులకు ఎంతో ఇష్టం. అక్కడి సదుపాయాలు, సౌకర్యాలు, జీవనశైలి, అత్యాధునిక పరికరాలు, విద్యావ్యవస్థ.. ఇవన్నీ మనవాళ్లను ఆకర్షిస్తాయి. వాటన్నింటికీ తోడు ఇక్కడితో పోలిస్తే విదేశీ కరెన్సీ విలువ ఎక్కువ కావడం, తద్వారా జీతాలు ఎక్కువ రావడం, దాంతో విలాసవంతమైన జీవితం గడిపే అవకాశం ఉండడంతో అలా వెళ్తుంటారు. ఎక్కువగా అమెరికా, కెనడా, యూరోపియన్ దేశాలకు మనవాళ్లు వెళ్తారు. ఇంతకుముందు స్వీడన్‌కు కూడా అలాగే వెళ్లేవారు. కానీ, ఇటీవల కాలంలో అక్కడినుంచి భారతీయులు భారీ సంఖ్యలో తిరిగొచ్చేస్తున్నారు. 2024 జనవరి నుంచి జూన్ మధ్య ఏకంగా 2,837 మంది అక్కడి నుంచి స్వదేశానికి వచ్చేశారు. ఇది గతంతో పోలిస్తే 171% ఎక్కువ. 1998 నుంచి ఇప్పటివరకు ఇంత ఎక్కువ స్థాయిలో రావడం ఇదే ప్రథమం.
ఇంత పెద్ద సంఖ్యలో ఒకేసారి భారతీయులు ఎందుకు స్వీడన్ వదిలి వచ్చేస్తున్నారు? ఈ విషయం గురించి అంకుర్ త్యాగి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ సోషల్ మీడియలో తన అభిప్రాయం వెల్లడించారు. ఆయన స్వీడన్లోనే ఉంటున్నారు. ఆ దేశం యూరప్‌లో ఐదో అతిపెద్ద దేశం. అందమైన ప్రకృతి దృశ్యాలు, చాలా విభిన్నమైన సంస్కృతి, సరికొత్త అనుభవాలు అన్నీ అక్కడ ఉంటాయి. అన్ని అద్భుతాలు అక్కడ ఉన్నా మనవాళ్లు ఎందుకు తిరిగొచ్చేస్తున్నారు? ప్రధానంగా అక్కడి కంటే వృత్తిపరమైన ఎదుగుదల భారతదేశంలోనే బాగుండటం ఒక ప్రధాన కారణం అయి ఉండొచ్చన్నది త్యాగి అభిప్రాయం. స్వీడన్లో సంపాదించే మొత్తం (భారతీయ కరెన్సీలో చూసుకున్నా) సొంత దేశంలోనే సంపాదించే అవకాశాలు గతంలో లేవు… ఇప్పుడు సమృద్ధిగా కనపడుతున్నాయి. బోలెడన్ని కెరీర్ అవకాశాలు ఉంటున్నాయి. అలాంటప్పుడు ఎక్కడో దూరతీరాల్లో ఉండి, అమ్మానాన్నలకు దూరంగా జీవితం గడపడం కంటే, ఇక్కడికొచ్చి అంతే మొత్తం సంపాదిస్తూ, తక్కువ ఖర్చుతో తమవాళ్లకు దగ్గరగా ఉండొచ్చన్న భావనతోనే ఎక్కువమంది తిరిగొస్తున్నారు. దానికితోడు విదేశాల్లో అందరూ అంత సన్నిహితంగా ఉండరు. ఆ ఒంటరితనం అక్కడ చాలా బాధిస్తుంది. భాషాపరమైన సమస్యలకు తోడు సాంస్కృతికంగా కూడా అక్కడ ఇమడలేని పరిస్థితులు ఉంటాయి. అదే సొంతదేశంలో అయితే ఇంటి చుట్టుపక్కల వాళ్లను కూడా మావయ్య, బాబాయ్ అని పిలుచుకుంటూ ఎంచక్కా కలిసిమెలిసి ఉంటారు. కష్టసుఖాల్లో కూడా ఒకరికొకరు తోడుగా నిలుస్తారు. వీటన్నింటికీ అదనంగా… విదేశాల్లో పుట్టిన స్వీడిష్ పౌరులు తమ దేశం విడిచి వెళ్లిపోతామంటే స్వీడన్ ప్రభుత్వం సైతం ఎంచక్కా పంపించేస్తోంది. అలా వెళ్లేవారికి ప్రయాణ ఖర్చులు ఇవ్వడంతో పాటు అదనంగా పదివేల స్వీడిష్ క్రౌన్లు (దాదాపు రూ.83 వేలు) ఇస్తామని చెబుతోంది.
భాగస్వాములకు ఉద్యోగం కష్టం
యూరోపియన్ దేశాలు గానీ, అమెరికా, కెనడాలలో గానీ నివసించాలంటే భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసుకోవాల్సిందే. అక్కడ పిల్లల చదువుల నుంచి నివాస ఖర్చుల వరకు అన్నీ ఎక్కువే. కానీ, స్వీడన్ లాంటి దేశాల్లో ఇంగ్లీషు వస్తే చాలదు. స్వీడిష్ భాషా నైపుణ్యాలు ఉంటేనే ఉద్యోగాలు ఇస్తామంటారు. అలాంటప్పుడు ఇంగ్లీషు మాత్రమే వచ్చిన జీవిత భాగస్వాములకు అక్కడ ఉద్యోగాలు దొరకడం చాలా కష్టం అయిపోతోంది. మంచి ఉన్నత విద్యార్హతలు ఉండి, ఉద్యోగాల్లో అనుభవం ఉన్నా కూడా చాలామంది మహిళలకు స్వీడన్లో ఉద్యోగాలు దొరకడం కష్టం అయిపోతోంది.
తల్లిదండ్రులను చూసుకోవాలని..
వయసులో పెద్దవాళ్లయిన తల్లిదండ్రులకు దూరంగా ఉండడం ఎంత కాదనుకున్నా భారంగా ఉంటుంది. అదే వాళ్లకు దగ్గరగా ఉంటే మానసికంగా ఎంతో ఆనందం అనిపిస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు తమ తాతలు, నాయనమ్మ, అమ్మమ్మలతో గడపడాన్ని ఎంతో ఆస్వాదిస్తారు. దానికితోడు పెద్ద వయసులో ఉండే తల్లిదండ్రులకు ఆరోగ్య అవసరాలు, ఇతర అవసరాలు దగ్గరుండి చూసుకోవడాన్ని కూడా పిల్లలు ఇష్టంగా భావిస్తారు. అందువల్ల కూడా చాలామంది సొంత దేశానికి వచ్చేయాలని అనుకుంటున్నారు.
సామాజిక సమస్యలు
స్వీడన్ సమాజంతో కలిసిపోవడాన్ని భారతీయులు చాలా కష్టంగా భావిస్తుంటారు. అందువల్ల కూడా వాళ్లు తిరిగి స్వదేశానికి రావడాన్ని చాలా ఇష్టపడుతున్నారు. స్వీడన్లో ఉండే వాతావరణం కూడా వాళ్లకు ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ఇన్ని ఇబ్బందులున్నా, ఇంతకుముందు ఎలాగోలా భరించేవారు గానీ, ఇప్పుడు సొంత దేశంలోనూ అవకాశాలు కనిపించడం, అక్కడి సామాజిక, సాంస్కృతిక పరమైన ఇబ్బందులను భరించాల్సిన అవసరం రాకపోవడంతో వచ్చేద్దామని అనుకుంటున్నారు. దానికితోడు కొవిడ్ సమయంలో ఎక్కడినుంచైనా పనిచేసే అవకాశం ఉండడంతో అప్పట్లోనే కొందరు వచ్చేశారు. అప్పుడే భారతదేశంలో ఉండి విదేశీ యజమానులకు పనిచేయడం అలవాటైంది.
నివాస సమస్యలు
స్వీడన్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ సీఈఓ, సెక్రటరీ జనరల్ రాబిన్ సుఖియా కూడా ఈ అంశంపై స్పందించారు. స్వీడన్లో సర్వీసు అపార్టుమెంట్లు తక్కువగా ఉండడంతో పాటు ఇళ్లు అద్దెకు దొరకడానికి కూడా సమస్యలు ఉంటాయి. అలాగని ఈ ఒక్క కారణం వల్లే వెళ్తున్నారని అనుకోలేమని, కానీ వెళ్లిపోవడానికి ఉన్నవాటిలో ఇది కూడా ఒక ప్రధాన కారణమని సుఖియా అన్నారు. ఇక్కడ అపార్టుమెంట్ల అద్దెలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల కూడా చాలామంది ఉండలేక వెళ్లిపోతున్నారు. ఒక ఏడాది కాలంలో ఎంతమంది వెళ్లారన్నదాన్ని బట్టి చూస్తే ఈ ట్రెండు తెలుస్తుందని సుఖియా చెప్పారు.
ఉక్రెయిన్ వాసుల తర్వాత ఇప్పటికీ మనమే
ఇలా వేలల్లో భారతీయులు వెళ్లిపోతున్నా.. ఇప్పటికీ భారతీయులే ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. స్వీడన్‌లోని విదేశీయుల లెక్కలు తీస్తే.. ఉక్రెయినియన్లు అత్యధికంగా ఉంటారు. వారి తర్వాత ఉండేది భారతీయులే. ఇరాక్, చైనా, సిరియా వాసుల తర్వాత మనవాళ్లే ఎక్కువ సంఖ్యలో నివసిస్తారు. 2024 జనవరి నుంచి జూన్ మధ్య 2,461 మంది భారతీయులు స్వీడన్‌కు వెళ్లారు. అయితే గత సంవత్సరం ఇదే సమయంలో మాత్రం 3,681 మంది వెళ్లారు. ఆ సంఖ్యతో పోలిస్తే కాస్త తగ్గినా, ఇప్పటికీ ఎక్కువగానే వెళ్తున్నట్లు లెక్క.