ముప్ఫైవ దశకం వరకు తెలుగు పాఠ్య పుస్తకాలలో వాడే భాష కేవలం పండితులకు మాత్రమే అర్థమయ్యే రీతిలో గ్రాంథిక భాషలో ఉండేది. సామాన్యులకు ఇవి అంతగా అర్థం అయ్యేవి కావు. ఇప్పుడైతే వార్తాపత్రికల భాష, పాఠ్య పుస్తకాల భాష, వ్యవహారిక భాష ఒకటే. దీనికి కారకుడు గిడుగు రామ్మూర్తి పంతులు. కావ్యాలు, గ్రంధాలు, పాఠ్యాంశాలు గ్రాంధికభాష నుండి బయటపడి వ్యవహారిక భాషలో రచనారంగం మార్పుకు మూల పురుషుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. రామ్మూర్తి పంతులు తెలుగు సరస్వతి నోములపంట.
పుట్టుక:
ఈయన 29 ఆగస్టు 1863 నాడు వీర్రాజు, వెంకమ్మ దంపతులకు శ్రీకాకుళం జిల్లాలోని జీవనది వంశధార ఒడ్డున గల పర్వతాలపేటలో జన్మించారు. దీనికి అవతలి ఒడ్డు ఆ ప్రాంతం వారు దక్షిణ కాశీగా పిలిచే శ్రీముఖలింగం పుణ్యక్షేత్రం ఉంది. 1879 లో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. 1880లో ముప్ఫై రూపాయల జీతం మీద పర్లాకిమిడి రాజావారి పాఠశాలలో ఫస్టుఫారంలో చరిత్రను బోధించడానికి ఉపాధ్యాయుడిగా కుదిరారు. 1896లో బి.ఎ పట్టా అందుకున్నారు. ఇక్కడ కళాశాలకు కూడా బోధించే సౌకర్యం ఉండే మూలాన కళాశాల తరగతులకు పాఠాలు చెప్పే అవకాశం వచ్చింది. అక్కడే 1911సంవత్సరం వరకూ 30 యేళ్లు పనిచేసి అధ్యాపకపదవి నుండి పదవీవిరమణ చేశారు. అంతకు కొద్ది సంవత్సరాల ముందే ఆధునికాంధ్ర భాషాసంస్కరణ వైపు అతని దృష్టి మళ్ళింది.
భాషోద్యమం పుట్టుక:
1907 లో ఉత్తరకోస్తా జిల్లాల పాఠశాల పర్యవేక్షకులుగా వచ్చిన జె.ఎ.యేట్స్ అనే బ్రిటిష్ అధికారి ప్రజలు వ్యవహరించే భాష, పాఠ్య పుస్తకాలలో భాష వేర్వేరుగా ఉందని గ్రహించి చాలా ఆవేదన చెంది కారణం తెలుసుకునేందుకు
విశాఖపట్నంలో ఎ.వి.ఎన్ కళాశాలలో ప్రధానాధ్యాపకులుగా ఉన్న పి.టి. శ్రీనివాస అయ్యం గారిని కలిశారు. ఆయన ఈ విషయంపై గురజాడ, గిడుగులు మాత్రమే కారణం చెప్పగలరని
తెలియజేసారు. ఆయన గిడుగు రామ్మూర్తిగారిని కలిసి చర్చించారు. విద్యా విధానములో అన్యాయం జరుగుతున్నదని గిడుగు వారు గుర్తించారు. గిడుగు, గురజాడ, శ్రీనివాస అయ్యంగారు, యేట్స్ ఆలోచనల వల్ల వ్యవహారిక భాషా ఉద్యమం పురుడుపోసుకుంది. తెలుగు భాషలో వచ్చిన ఈ చారిత్రాత్మకమైన మార్పుకు ప్రధాన కారణం గిడుగు రామమూర్తి గారి సారధ్యంలో నడిచిన వ్యవహారిక భాషోద్యమం. ఇది ప్రాచీనమైన గ్రాంథిక భాషకు, వ్యావహారిక లేదా వాడుక భాషకు మధ్య జరిగిన భాషోద్యమం. అప్పటి ప్రభుత్వ పరీక్షల బోర్డు కార్యదర్శి 1912 – 13 సం.లో స్కూలుఫైనల్‌లో వ్యాసరచన కావ్యభాషలో లేదా ఆధునికభాషలో గాని రాయవచ్చునని ఒక ప్రభుత్వ ఉత్తర్వు (జీ.ఓ.) ఇచ్చారు. ఆధునిక భాషకు లక్ష్యంగా చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగురీడరును, ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీయాత్ర చరిత్రను ఉదహరించాడు. ఈ మార్పుల వల్ల తెలుగు సాహిత్యానికి అపకారం జరుగుతుందని పండితుల్లో భయం కలిగింది. మద్రాసులో జయంతి రామయ్య పంతులు అధ్యక్షతన “ఆంధ్ర సాహిత్య పరిషత్తు” ఏర్పడ్డది. వావిలికొలను సుబ్బారావు, వేదం వేంకటరాయ శాస్త్రి లాంటి పండితులు జయంతి రామయ్య వాదాన్ని బలపరిచారు. దేశం అంతటా సభలు పెట్టి వ్యాసరచన పరీక్షలో ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛను ఉపసంహరించాలని పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీసారు.1925సం. తణుకులో వ్యవహారిక భాషను ప్రతిఘటించిన ఆంధ్ర సాహిత్య పరిషత్తు సభ జరిగింది. ఇక్కడే గిడుగు నాలుగు గంటలపాటు ప్రసంగించి గ్రంథాల్లోని ప్రయోగాల్ని ఎత్తిచూపి తన వాదానికి అనుకూలంగా సమితిని తీర్మానింపజేసారు. సాహితీ సమితి, నవ్యసాహిత్య పరిషత్తు మొదలైన సంస్థలు కూడా గిడుగు వాదాన్ని బలపరచాయి. గిడుగు రామమూర్తి ఊరూరా తిరిగి ఉపన్యాసాలిస్తూ గ్రాంథికంలో ఏ రచయితా భావాత్మకంగా రాయలేడని నిరూపించారు. 1919లో గిడుగు “తెలుగు” అనే మాసపత్రికను స్థాపించి తన శాస్త్రీయ వ్యాసాలతో, ఉపన్యాస పాఠాలతో అవిశ్రాంతంగా పోరాటం సాగించారు. కాని ఆ పత్రిక ఒక ఏడాది మాత్రమే నడిచింది. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, తల్లావజ్ఝుల శివశంకరశాస్త్రి, కందుకూరి వీరేశలింగం, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, వజ్ఝల చినసీతారామశాస్త్రి మొదలైన కవులు, పండితులు వ్యావహారిక భాషావాదం వైపు మొగ్గు చూపారు. 1919 ఫిబ్రవరి 28న రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం అధ్యక్షులుగా, గిడుగు కార్యదర్శిగా “వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం” స్థాపించారు. గిడుగు అనగానే ప్రజలకు స్ఫురించేది వాడుకభాష గురించి చేపట్టిన ఈ మహోద్యమమే. ఈ ఉద్యమం ఫలితంగానే నేడు మనం పాఠశాలల్లో, సమాచార ప్రసారసాధనాల్లో, సాహిత్యంలో మాట్లాడే భాషను ఉపయోగిస్తున్నాం. గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకువచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు..గిరిజన ప్రాంతాలలో ఉండే సవరల భాష నేర్చుకొని వాళ్ళకు చదువు చెప్పాలనే కోరిక ఆ రోజుల్లోనే అతనికి కలిగింది. తెలుగు సవరభాషలు రెండూ వచ్చిన ఒక సవర వ్యవహర్తను ఇంట్లోనే పెట్టుకొని సవర భాష నేర్చుకున్నారు. సవర “దక్షిణముండా” భాష. సవరభాషా వ్యాకరణాన్ని, సవర – ఇంగ్లీషు నిఘంటువులను రచించారు. గిడుగు రామమూర్తి 1940 జనవరి 15వ తేదీన ప్రజామిత్ర కార్యాలయంలో పత్రికా సంపాదకుల సభలో వ్యావహారిక భాషా వ్యాప్తికి పత్రికలు చేస్తున్న కృషిను అభినందించారు. కాని ప్రభుత్వ విద్యాశాఖవారు, విశ్వవిద్యాలయాలు గ్రాంథికాన్ని వదిలిపెట్టక పోవటానికి బాధపడ్డాడు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ “దేశభాష ద్వారా విద్య బోధిస్తే కాని ప్రయోజనం లేదు. శిష్టజన వ్యావహారికభాష లోకంలో సదా వినబడుతూ వుంటుంది. అది జీవంతో కలకలలాడుతూ ఉంటుంది. గ్రాంథిక భాష గ్రంథాలలో కనబడే భాష, కాని వినబడే భాష కాదు. అది ప్రతిమ వంటిది. ప్రసంగాలలో గ్రాంథికభాష ప్రయోగిస్తూ తిట్టుకొన్నా సరసాలాడుకున్నా ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చూడండి. గ్రాంథికభాష యెడల నాకు ఆదరము లేకపోలేదు. ప్రాచీనకావ్యాలు చదువవద్దనీ విద్యార్థులకు నేర్పవద్దనీ నేననను. కాని ఆ భాషలో నేడు రచన సాగించడానికి పూనుకోవడం వృథా అంటున్నాను. నిర్దుష్టంగా ఎవరునూ వ్రాయలేరు. వ్రాసినా వ్రాసేవారితో పాటు వినేవారికి కూడా కష్టమే. వ్రాసే వారు ఏమి చేస్తున్నారు? భావం తమ సొంత (వాడుక) భాషలో రచించుకొని గ్రాంథికీకరణం చేస్తున్నారు. అది చదివేవారు వినేవారు తమ సొంత వాడుకమాటలలోకి మార్చుకొని అర్థం చేసుకొంటున్నారు. ఎందుకీ వృథాప్రయాస? స్వరాజ్యం కావాలని అంటున్నాం. ప్రత్యేకాంధ్రరాష్ట్రము కోసం చిక్కుపడుతున్నాము. ప్రజాస్వామిక పరిపాలనం కోరుచున్నాము. ఇటువంటి పరిస్థితులలో మన ప్రజలకు, సామాన్య జనులకు ఏభాష ద్వారా జ్ఞానం కలుగచేయవలసి ఉంటుందో, ఏ భాషలో గ్రంథరచన సాగించవలసి ఉంటుందో ఆలోచించండి. మీచేతులలో పత్రికలున్నవి. పత్రికల ద్వారా మీరు ఎంతైనా చేయగలరు”.అని విన్నవించాడు.
భాషోద్యమానికి మూల పురుషుడు:
తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు. గ్రాంథికమ్ము నెత్తిన పిడుగు గిడుగు. వ్యవహార భాషోద్యమ స్థాపక ఘనుడు గిడుగు. తేట తేనియల తెల్లని పాల మీగడ గిడుగు. కూరి తెలుగు భాషకు గొడుగు గిడుగు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా కోవిదుడు. చరిత్రకారుడే గాక చరిత్రను సృష్టించినవాడు.
సత్కారాలు:
1934లో అప్పటి ప్రభుత్వం కైజర్ ఎ హింద్ బిరుదు ఇచ్చి గౌరవించింది. 1913 లో ప్రభుత్వం రావు సాహెబ్ బిరుదు ఇచ్చింది. 1938సం.లో ఆంధ్ర విశ్వకళాపరిషత్తు కళాప్రపూర్ణతో గౌరవించింది. గిడుగు రామమూర్తి గారికి అభినవ వాగమశాసనుడు అని బిరుదు కూడా ఉంది.
చివరి రోజులు:
1930 లో ఒడిషా ఏర్పడ్డప్పుడు పర్లాకిమిడి రాజా తన పర్లాకిమిడి తాలూకా అంతటిని ఒడిషా రాష్ట్రంలో చేర్పించడానికి ప్రయత్నించారు. అక్కడ తెలుగు ప్రజలందరి నాయకునిగా రామమూర్తి నిలిచి ప్రతిఘటించాడు. ఆ తాలూకాలో చాలా భాగాన్ని, పర్లాకిమిడి పట్టణాన్ని ప్రభుత్వం అక్రమంగా ఒడిషాలో చేర్చడంవల్ల తెలుగువారికి అన్యాయం జరిగిందని తెలియజేస్తూ 1936 లో ఒడిషా రాష్ట్ర ప్రారంభోత్సవం జరిగిన ఉదయమే పర్లాకిమిడిలో ఉండడానికి ఇష్టపడక వెంటనే రాజమహేంద్రవరం వచ్చి అక్కడే తన శేషజీవితాన్ని గడిపాడు గిడుగు రామమూర్తి జనవరి 22, 1940 న కన్ను మూశాడు. ఇంతటి మహనీయుడు కాబట్టే మనం గిడుగు రామ్మూర్తి జయంతైన ఆగస్ట్ 29 న తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము.
జనక మోహన రావు దుంగ
8247045230
ఆగష్టు 29 తెలుగు భాషా దినోత్సవం