తెలంగాణ ప్రజలకు ఉపాధినిచ్చే కొత్త బొగ్గు గనుల తవ్వకానికి అనుమతులు తీసుకొచ్చే విషయంపై బొగ్గు గని కార్మికులకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టత ఇవ్వాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బొగ్గు గనుల వేలం ప్రక్రియలో పాల్గొంటారా లేదా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి సింగరేణి సంస్థకే తెలంగాణలోని బొగ్గు గనులు కేటాయించే విధంగా ఒప్పిస్తారో గోదావరిఖని పర్యటనలో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత వార్షిక సంవత్సరం 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సింగరేణి సంస్థ సాధించినందున, కనీసం 4000 కోట్ల రూపాయల లాభాలు వచ్చే అవకాశం ఉన్నదని ఆయన పేర్కొన్నారు.
ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదు నెలలు గడిచిన సింగరేణి సంస్థ లాభాలను ప్రకటించకపోవడం విడ్డూరమని విమర్శించారు.తక్షణమే లాభాలు ప్రకటించి, ప్రతి కార్మికుడికి 35 శాతం లాభాల వాటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్మికులకు ఇచ్చిన హామీల లో భాగంగా ఆదాయపన్నుపై సింగరేణి సంస్థ చెల్లించే విధంగా ఉత్తర్వులు జారీ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి ప్రతి కార్మికుడు పోరాటలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
విలేకరుల సమావేశంలో టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య, నాయకులు చెలుకలపల్లి శ్రీనివాస్, పల్లె సురేందర్, బొగ్గుల సాయి, పులిపాక శంకర్, రోడ్డ సంపత్, గండు శ్రావణ్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.