దేశంలోని అత్యుత్తమ ప్రమాణాలు పాటించే విద్యా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో కెఎల్‌హెచ్ హైదరాబాద్ క్యాంపస్ జాతీయ స్థాయిలో 22వ ర్యాంకు సాధించింది. ఈ అద్భుతమైన విజయం సాధించడం సంస్థకు గర్వకారణమని కెఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఉప కులపతి డాక్టర్ పార్థ సారధి వర్మ తెలియజేశారు. హైదరాబాద్ లోని జూబిలీ హిల్స్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్- 2024లో తమ హైదరాబాద్ క్యాంపస్ అత్యుత్తమ పనితీరును కనబరిచినందుకుగాను ఈ ర్యాంకును కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించిందని చెప్పారు.
దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలను కలిపి ప్రకటించిన ర్యాంకులలో కె ఎల్ హెచ్ యూనివర్సిటీ 22వ ర్యాంకును దక్కించుకుందని అన్నారు. భారతదేశంలోని విశ్వవిద్యాలయాలు, అకడమిక్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్ పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయన్నారు. అయితే భారతదేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలలు, ఐఐటీలు, ఎన్ఐటీలు మొత్తం కలిపి 6517 ఉన్నత విద్యా సంస్థలు పోటీ పడగా తమ వర్శిటీకి 22వ ర్యాంకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ విజయాలు కెఎల్ హెచ్ హైదరాబాద్ విశ్వవిద్యాలయం యొక్క సమగ్ర విద్యా విధానాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. తెలంగాణా రాష్ట్రం మొత్తం మీద తమ క్యాంపస్ అత్యుత్తమ ర్యాంకు దక్కించుకోవటం గర్వకారణమని అన్నారు.
కె ఎల్ హెచ్ హైదరాబాద్ క్యాంపస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ కోటేశ్వరరావు యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె.శ్రీనివాసరావు మాట్లాడుతూ అజీజ్ నగర్, బోరంపేట, కొండాపూర్ క్యాంపస్ లలో అత్యాధునిక కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. రానున్న కాలంలో మరిన్ని కోర్సులను అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు.