వరద బాధితులకు దివీస్ చేయూత “తుఫాన్ దృష్ట్యా గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో విజయవాడలో ఆనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.పలు కాలనీలు వరద ముంపునకు గురయ్యాయి. ఈ పరిస్థితులలో ఆనేక కాలనీలలో ప్రజలు, పిల్లలు, వృద్దులు భోజన సౌకర్యం లేక అల్లాడిపోతున్నారు అని వార్తలు వెలువడుతున్న తరుణంలో దివీస్ యాజమాన్యం వెంటనే స్పందించి ప్రతి రోజూ 1,70,000 మందికి పైగా ప్రజలకు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం సాయంత్రం భోజనాలను హరే కృష్ణచారిటబుల్ ఫౌండేషన్, ఏ.పీ, అక్షయ పాత్ర అనుబంధ సంస్థ వారిచే అందజేయుటకు పూర్తి ఏర్పాట్లు చేసిందని అవి సోమవారం నుండి ప్రభుత్వం సూచించిన ప్రాంతాలలో అవసరమైన ప్రజలకు స్వయంగా అందజేస్తున్నామని దివీస్ సంస్థ ఎం.డి. తెలియజేసారు.
ఇటువంటి విపత్కర సమయంలో ముందుగా ఆపన్న హస్తాన్ని అందిస్తున్న దివీస్ సంస్థ వారికి హరే కృష్ణచారిటబుల్ ఫౌండేషన్, ఏ.పీ, అక్షయ పాత్ర అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, మంగళగిరి క్లస్టర్, సంస్థ ప్రతినిధి శ్రీమాన్ వంశధార దాస కృతజ్ఞతలు తెలిపారు. వార్తల ద్వారా తెలుసుకుని వెంటనే స్పందించి ముంపు ప్రాంత వాసలకు అక్షయ పాత్ర అనుబంధ సంస్థ ద్వారా ఆహారాన్ని అందించేందుకు సహకరిస్తున్న దివీస్ యాజమాన్యాన్ని ప్రభుత్వ ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఆహారాన్ని 3 పూటలా రానున్న 5 రోజులపాటు లేదా అవసరమైన మేరకు సుమారు 2 కోట్ల 50 లక్షల రూపాయలు అంచనా విలువైన ఆహారాన్ని తయారు చేయించి విజయవాడ పరిసర ముంపు ప్రాంత వాసులకు అందజేయుటకు పూర్తిగా సంసిద్ధంగా ఉన్నామని సంస్థ ఎం.డి. డా”మురళీ కృష్ణ దివి తెలియజేసారు.