బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గార్ల మండల కేంద్రంలోని స్థానిక లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలోకి వర్షపు నీరు చేరుకుంది. దీంతో ఆలయాన్ని సోమవారం తెరవలేదు.
ఆలయ మండపంలో నాలుగడుగుల మేర నీళ్లు ఉండటంతో దేవుడికి పూజలు నిర్వహించి నైవేద్యం పెట్టేందుకు గుడిలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొందని పూజారి కాండూరి లక్ష్మీనారాయణ చార్యులు తెలిపారు. దేవాలయం ప్రాంగణం బయట సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హనుమంతుల బజార్ జెండా బజార్ డ్రైనేజీల ద్వారా పడబాటు నీళ్లన్నీ ఆలయంలోకి చేరడం వల్ల ఆలయం అపవిత్రమవుతుందని ఆలయాన్ని శుద్ధి చేసి పూజలు చేయడం కష్టంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ వ్యవస్థను నిర్మించి ఆలయంలోకి నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.