Student Died Of Heart Attack: ఏపీలోని డా. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో విషాదం చోటుచేసుకుంది. తరగతి గదిలోనే పదో తరగతి విద్యార్థిని క్లాస్ వింటూ ఒక్కసారిగా కుప్పకూలి కిందపడిపోయింది. హుటాహుటిన ఆమెను ఆస్పత్రిని తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే బాలిక మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న విషయం గుండెపోటు. ఒకప్పుడు 50 వయసు దాటిన వారిలో హార్ట్ ఎటాక్ మరణాలు ఎక్కువగా సంభవించేవి. కానీ ప్రస్తుత కాలంలో నిండా ముప్పై అయినా రాకముందే మహిళలు, పురుషులు గుండె పోటుకి గురవుతున్నారు. ఇటీవల తెలంగాణలో బతుకమ్మ వేడుకల్లో పలువురు మహిళలు ఒక్కసారిగా గుండెజబ్బుకి గురై మరణించిన సంఘటనలు కలవరం సృష్టించాయి. ఇక ఏపీలోనూ డీజే సౌండ్ కారణంగా పలువురు మృతి చెందారు. అయితే ఇప్పుడు స్కూల్‌కి వెళ్తున్న విద్యార్థుల్లోనూ హార్ట్ ఎటాక్ ప్రమాదాలు సంభవించడం తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. తాజాగా, కోనసీమ జిల్లాలో జరిగిన సంఘటనతో విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారింది.
రామచంద్రాపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని సిరి.. క్లాస్ వింటుండగా ఒక్కసారిగా ఆమెకు వెక్కిళ్లు మొదలయ్యాయి. ఆ కాసేపటికే స్పృహ తప్పి కిందపడిపోయింది. వెంటనే అప్రమత్తమైన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయుడు.. పాఠశాల యాజమాన్యానికి సమాచారం అందించడంతో సిబ్బంది వెంటనే సిరిని సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు భావిస్తున్నారు. సంఘటనకి సంబంధించిన దృశ్యాలు తరగతి గదిలోని సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.
కాగా, విద్యార్థిని మృతికి గల కారణాలపై స్పష్టమైన వివరాలు తెలుసుకోవడానికి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు సమాచారం. బాలిక మృతితో తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. స్వగ్రామం పసలపూడిలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

