బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను దృష్ట్యా ఎలాంటి పరిస్థితులు తలెత్తినా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవ హర్ రెడ్డి జిల్లా కలెక్టర్లును ఆదేశించారు.తుఫాను ముందు జాగ్రత్త చర్యలపై శనివారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం సోమవారం నెల్లూరు- మచిలీపట్నాల మధ్య తుఫాను తీరాన్ని దాటే అవకాశం ఉందని అన్నారు.తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో ముఖ్యంగా తిరుపతి,నెల్లూరు, ప్రకాశం,బాపట్ల,కృష్ణా,పశ్చిమ గోదావరి,అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి,కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు,మిగతా జిల్లాల్లోను ఒక మాదిరి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. కావున అధికారులు అంతా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సిఎస్ ఆదేశించారు.
రానున్న మూడు రోజులు మత్స్యకారులు ఎవరినీ సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళనీయ వద్దని ఒకవేళ ఇప్పటికే ఎవరైనా వెళ్ళి ఉంటే వారు త్వరగా ఒడ్డుకు చేరేలా చూడాలని సిఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్లుకు స్పష్టం చేశారు.
రైతులు పండించిన ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి మిల్లులకు చేర్చేలా చూడాలని చెప్పారు.ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేలా కేంద్రానికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేయనున్నట్టు సిఎస్ పేర్కొన్నారు.జిల్లాల వారీగా ఎంత ధాన్యం ఉంది వెంటనే వివరాలు సేకరించి నివేదిక సమర్పించాలని పౌరసరఫరాల శాఖ కమీషనర్ ను సిఎస్ ఆదేశించారు.అదే విధంగా కోతకోసి పనలపై ఉన్న వారి పంటను ఏవిధంగా కాపాడుకోవాలో కూడా రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
వివిధ నిత్యావసర సరుకులను జిల్లాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని సిఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.ఎక్కడైనా చెట్ట్లు,విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగి రహదారులపై ట్రాఫిక్ కు అంతరాయం కలిగితే వెంటనే వాటిని తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరణకు అవసరమైన పవర్ షాలు, కట్టర్లు,జెసిబిలు వంటి యంత్రాలు వివిధ పరికరాలను అందుబాటులో ఉంచు కోవాలని ఆర్ అండ్బి, విద్యుత్,టెలికం తదితర శాఖలను ఆయన ఆదేశించారు.
ఈ సమావేశంలో వర్చువల్ గా పాల్గొన్న రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు సిసిఎల్ఏ జి.సాయి ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లు పూర్తి సన్నద్దంగా ఉండాలన్నారు.
ఇంకా ఈవీడియో సమావేశంలో ఆర్థిక, వ్యవసాయ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్ఎస్.రావత్,గోపాల కృష్ణ ద్వివేది,పౌరసరఫరాల శాఖ కమీషనర్ హెచ్.అరుణ్ కుమార్,విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బిఆర్. అంబేద్కర్,అమరావతి భారత వాతావరణ శాఖ డైరెక్టర్ స్టెల్లా, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.