8 Year old child burnt while lighting the Karthika Deepam: పొద్దున్న నిద్ర లేవగానే గారాల పట్టి కల్మషం లేని చిరునవ్వు ఆ తల్లికి శుభోదయం. చంద్రబింబం లాంటి ఆ వదనాన్ని చూసి గారంగా ముద్దాడితేనే ఆమెకు నూతన ఉత్తేజం. ఇక రేపటి నుంచి ఆ చిరునవ్వు కనపడదు. మమకారంగా హత్తుకోవడానికి తన పక్కన ఉండదు. ఇది తలుచుకుని ఆ తల్లి గుండెలవిసేలా రోదించిన తీరు.. ప్రతి ఒక్కరినీ కంట తడి పెట్టిస్తుంది. కార్తిక మాసం దీపం వెలిగించేందుకు తనతో పాటు గుడికి వచ్చిన తన చిట్టి తల్లి కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో కన్నవాళ్ల బాధ వర్ణనాతీతం.
Also Read: https://teluguprabha.net/crime-news/chevella-incident-including-mother-and-3-month-old-baby/
కార్తిక మాసం మొదటి రోజు నుంచి శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఉదయ, సంధ్యా వేళల్లో చాలా మంది మహిళలు శివాలయాలకు వచ్చి కార్తిక దీపాలను వెలిగించి ఆ శివయ్యను దర్శించుకుని మనస్ఫూర్తిగా వేడుకుంటారు. శివలింగానికి అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక, కార్తిక సోమవారాలు, ప్రత్యేక తిథుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో కార్తిక మాసం సందర్భంగా ఆలయంలో దీపం వెలిగించేందుకు ఓ మహిళకు తీరని గర్భ శోకం మిగిలింది. కర్నూలు జిల్లాలో ఈ విషాదకర సంఘటన జరిగింది.
కార్తిక దీపాలు వెలిగించేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా తీరని నష్టం జరుగుతుంది. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన గొల్ల సుబ్బన్న, సులోచన దంపతులకు రేవతి కుమార్తె(8). స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. కాగా, ఇటీవల స్థానిక శివాలయంలో కార్తిక దీపం వెలిగించేందుకు కూతురు రేవతిని తీసుకుని సులోచన వెళ్లింది. తల్లితో పాటు ఎంతో సంతోషంగా కూతురు ఆలయానికి చేరుకుంది.
Also Read: https://teluguprabha.net/telangana-news/chevella-bus-accident-updates-2/
భక్తి భావంతో తల్లి దీపాలు వెలిగించగా.. కూతురు ఆసక్తిగా తిలకిస్తోంది. ఇక ఆలయ ప్రాంగణంలో చాలా మంది దీపాలు వెలిగిస్తుంటారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న ఓ దీపం వెలుగు చిన్నారి డ్రెస్‌కి అంటుకుని మంటలు చెలరేగి ఒంటి నిండా వ్యాపించాయి. దీంతో మొత్తం శరీరం అంతా కాలిపోయి తీవ్ర గాయాలయ్యాయి.
కంగారుపడిన తల్లి వెంటనే స్థానికుల సాయంతో చిన్నారిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో కోలుకోలేక రేవతి మృతి చెందింది. కళ్లెదుటే తమ బిడ్డ మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదన స్థానికులను కలిచివేసింది. కాగా, అంతకుముందే.. రేవతిని, తల్లిదండ్రులను ఆసుపత్రిలో పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పరామర్శించారు. ఆ తర్వాత మృతి చెందిన సంఘటన తెలుసుకుని మాజీ ఎమ్మెల్యే ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


