Monday, March 31, 2025
Homeఆంధ్రప్రదేశ్Suryalanka Beach: సూర్యలంక బీచ్ కు మహర్ధశ:మంత్రి కందుల దుర్గేష్

Suryalanka Beach: సూర్యలంక బీచ్ కు మహర్ధశ:మంత్రి కందుల దుర్గేష్

రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలో ఉన్న సూర్యలంక బీచ్ (Suryalanka Beach) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 క్రింద రూ.97.52 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం లభించిందని మంత్రి కందుల దుర్గేష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్వరలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సూర్యలంక బీచ్ రూపురేఖలు మారుస్తామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.

- Advertisement -

త్వరలోనే సూర్యలంక ప్రాజెక్టు పట్టాలెక్కనుందని, సరికొత్త హంగులతో పర్యాటకులకు దర్శనమివ్వబోతుందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ప్రధానంగా సూర్యలంక బీచ్ లో మౌలిక వసతుల కల్పన, బీచ్ ను పరిశుభ్రంగా ఉంచే అంశంపై దృష్టిసారించి అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే విధంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. నిధుల వినియోగం విషయానికి వస్తే రూ.15.43 కోట్లతో సూర్యలంక బీచ్ లో పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభూతి కల్పన, రూ.4.37 కోట్లతో షాపింగ్ స్ట్రీట్ అభివృద్ధి,రూ. 7.76 కోట్లతో స్థిరమైన పర్యాటకాభివృద్ధి, పర్యాటకుల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం, రూ.11.69 కోట్లతో కెనాల్ ఎక్స్‌పీరియన్స్ డెవలప్ మెంట్, రూ.19.36 కోట్లతో సూర్యలంక ఎక్స్ పీరియన్స్ జోన్, రూ. 18 కోట్లతో ఇతర మౌలిక వసతులు కల్పించనున్నామన్నారు. అనంతరం బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం కృషి చేస్తామన్నారు.ఇప్పటికే సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం, పర్యాటకుల స్వర్గధామంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలతో కూడిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపించామన్నారు. ఇటీవల న్యూఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను కలిసి సూర్యలంక బీచ్ కు నిధులు ఇవ్వమని కోరానని అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఇచ్చిన మాట ప్రకారం త్వరితగతిన నిధులు విడుదలకు ఆమోదం తెలిపినందుకు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కు మంత్రి దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు.

అదే విధంగా నూతన టూరిజం పాలసీ, పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పన తదితర వినూత్న నిర్ణయాలతో రాష్ట్ర పర్యాటకాభివృద్ధిని ప్రోత్సహిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనునిత్యం క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ, అధికారులకు విలువైన సలహాలు, సూచనలు ఇస్తూ రాష్ట్ర పర్యాటక ప్రగతికి కృషి చేస్తున్న టూరిజం సెక్రటరీ అజయ్ జైన్,ఎండీ ఆమ్రపాలి కాట, పర్యాటకశాఖ అధికారులను మంత్రి దుర్గేష్ అభినందించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి మరిన్ని భారీ పర్యాటక ప్రాజెక్టులు వస్తాయని మంత్రి దుర్గేష్ అన్నారు.సమిష్టి కృషితో రాష్ట్రాన్ని పర్యాటకాంధ్రప్రదేశ్ గా తయారుచేసుకుందామని అధికారులకు పిలుపునిచ్చారు.

పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో చొరవతో కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి రూ.269.86 కోట్లు నిధులు విడుదలయ్యాయి. అందులో భాగంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ శాస్కి స్కీమ్ క్రింద అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులకు రూ.172.34 కోట్లు మంజూరు కాగా సంబంధిత పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. తాజాగా బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ కు రూ.97.52 కోట్ల విడుదలకు ఆమోదం లభించింది.పర్యాటక రంగానికి నిధుల వెల్లువతో రాష్ట్ర పర్యాటకానికి మంచి రోజులు వచ్చాయని పలువురు కొనియాడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News