IPS Sanjeev: అగ్నిమాపకశాఖ, సీఐడీ విభాగాల్లో జరిగిన భారీ నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్ అధికారి సంజయ్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఈ కేసులో ఆయన పాత్రపై లోతైన విచారణ ప్రారంభించారు. మంగళవారం ఉదయం విజయవాడ జిల్లా కేంద్ర కారాగారం నుంచి సంజయ్‌ను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ, వైద్య పరీక్షల అనంతరం గొల్లపూడిలోని తమ కార్యాలయానికి తరలించింది.
మొదటి రోజు విచారణ దాదాపు ఏడున్నర గంటల పాటు కొనసాగింది. ఈ విచారణలో నిధుల దుర్వినియోగం ఎలా జరిగింది, కాంట్రాక్టర్లకు నిధులు కేటాయించడంలో ఎవరి ఆదేశాలు పాటించారు, ఆ ఆర్థిక లావాదేవీల వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి వంటి కీలక అంశాలపై అధికారులు ప్రశ్నలు సంధించారు. అయితే, ఏసీబీ అడిగిన చాలా ప్రశ్నలకు సంజయ్ సరైన సమాధానాలు ఇవ్వలేదని, కొన్ని విషయాలపై ఆయన పొంతనలేని సమాధానాలు ఇచ్చారని సమాచారం. దీంతో ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఏసీబీ అధికారులు పూర్తి స్థాయి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసులో మరో కీలక అధికారిని కూడా త్వరలో విచారించే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కేసుపై ఏసీబీ అధికారులు మరింత సమాచారం సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.


