Narasimha Murthy Raju Suicide: :విజయవాడలో ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తి రాజు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. నగరంలోని అయోధ్యనగర్ క్షత్రియభవన్‌లోని శుక్రవారం రాత్రి సూసైడ్ చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
శుక్రవారం రాత్రే ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చారు. వచ్చీ రాగానే ఆత్మహత్య చేసుకోవడంపై పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. నరసింహమూర్తి ఆత్మహత్య విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు విజయవాడ చేరుకున్నారు. కాగా ఇటీవలే ఓ హత్య కేసుకు సంబంధించి జైలు నుంచి బెయిల్‌పై నరిసింహమూర్తి రాజు విడుదలకావడం గమనార్హం.
ఆర్థిక లావాదేవీల విషయంలో గతేడాది స్నేహితుడిని హత్య చేయించారనే కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి నిందితుడిగా జైలులో ఉన్న ఆయన కొద్దిరోజుల క్రితం బెయిల్‌పై బయటకు వచ్చారు. జైలు నుంచి విడుదలైన వెంటనే ఆయన బలవన్మరణం చేసుకోవడం చర్చనీయాంశమైంది. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.