Thirupathi : తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల దర్శనానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో భక్తులకు శ్రీవారి దర్శనం కోసం ఏఐ టెక్నాలజీని ఉపయోగించి 1-2 గంటల్లో సులభంగా దర్శనం చేసే ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది భక్తుల సమయాన్ని ఆదా చేసి, సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుందని తెలిపారు.
ALSO READ: Film Chamber : సినీ కార్మికుల సమ్మె.. సీఎం రేవంత్ జోక్యంతో పరిష్కారం దొరకనుందా!
తితిదేలో అన్యమత సిబ్బందిని ఇతర విభాగాలకు బదిలీ చేయడం లేదా వాలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్ ద్వారా వారిని పంపే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అన్యమత ప్రచారం చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఒంటిమిట్టలో నిరంతర అన్నదాన కార్యక్రమం కొనసాగుతోందని… దీనికోసం రూ.4 కోట్లు కేటాయించారని తెలిపారు.
తిరుమలలో గతంలో హోటళ్ల కేటాయింపు మాఫియా తరహాలో జరిగిందని, ఇప్పుడు ఈ-టెండర్ల ద్వారా పారదర్శకంగా కేటాయిస్తున్నామని వెల్లడించారు. త్వరలో కొత్త క్యాంటీన్లు ప్రారంభిస్తామని, శ్రీవాణి దర్శన సమయాలను సరళీకరిస్తామని చెప్పారు. సైబర్ మోసాలను నివారించేందుకు సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటు చేస్తుమని… గత ఏడాదిలో 30,000 నకిలీ వెబ్‌సైట్లను బ్లాక్ చేశామని, అలిపిరిలో స్కానర్లను అప్‌డేట్ చేస్తున్నామని తెలిపారు.
వీఐపీ దర్శనాల సమయాన్ని ఉదయం 8-8:30 గంటలకు సర్దుబాటు చేస్తున్నామని, దీంతో సామాన్య భక్తులకు ఇబ్బందులు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. తిరుమల పరిధిలో అటవీ ప్రాంతాన్ని 90% నుంచి 110%కి విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని… దేశవ్యాప్తంగా 320 ఆలయాలు నిర్మించామని, మరో 500-1000 ఆలయాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని బీఆర్ నాయుడు వివరించారు.


