Friday, January 24, 2025
Homeఆంధ్రప్రదేశ్Aids testing: హెచ్ఐవి నియంత్రణలో మరో ముందడుగు

Aids testing: హెచ్ఐవి నియంత్రణలో మరో ముందడుగు

ఎఆర్టి చికిత్స తీసుకుంటే నెలకు 4,000 పెన్షన్

ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ప్రజలను పట్టి పీడిస్తున్న హెచ్ఐవి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణా సొసైటీ (APSACS) మరో ముందడుగు వేసింది. హెచ్ఐవి వైరస్ ద్వారా వ్యాపించే ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ, వైద్య పరీక్షా సౌకర్యాలను మారుమూల ప్రాంత ప్రజల ముంగిటికి తీసుకెళ్లేందుకు జాతీయ ఎయిడ్స్ నియంత్రణా సంస్థ (NACO) సహకారంతో ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ మరియు టెస్టింగ్ (ICTC)సంచార వాహనాల్ని ఏర్పాటు చేసింది.

- Advertisement -

పూర్తి కేంద్ర ప్రభుత్వ సహకారంతో

కేంద్ర ప్రభుత్వ న్యాకో(NACO) సహకారంతో కొనుగోలుచేసిన 10 కొత్త సంచార ఐసిటిసి వాహనాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మరియు వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విజయవాడ సిద్దార్ధ వైద్య కళాశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే వివిధ స్థాయిల్లోని వైద్యకేంద్రాలలో అందుబాటులో ఉన్న16 ఐసిటిసిల ద్వారా హెచ్ఐవి వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. మారుమూల ప్రాంతాల్లో నివశించే వారికి కూడా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం మొబైల్ ఐసిటిసిలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. పూర్తి కేంద్ర ప్రభుత్వ సహకారంతో అందుబాటులోకొచ్చిన ఈ వాహనాల్లో వ్యాధి నిర్ధారణ కోసం మూడు వేర్వేరు కిట్లతో హెచ్ఐవి పరీక్షలను నిర్వహిస్తారన్నారు. సాధారణ వైద్యసేవలు అందుకునేందుకు వీలులేని మారుమూల ప్రాంతాల ప్రజలతో పాటు, హెచ్ఐవి వైరస్ సోకి ప్రమాద స్థితిలో వున్న వారికి, జైళ్లలోని ఖైదీలు, ఇతర వర్గాల వారికి ఈ మొబైల్ ఐసిటిసిల ద్వారా ఎయిడ్స్ గురించి కౌన్సెలింగ్ తో పాటు పరీక్షలు చేస్తారన్నారు.

ఎఆర్టి ప్రకారం

ఈ మొబైల్ కేంద్రాలలో డిఫరెన్షియల్ హెచ్ఐవి స్క్రీనింగ్/పరీక్ష, కౌన్సెలింగ్, ఇండెక్స్ పరీక్ష, సామాజిక, లైంగిక నెట్‌వర్క్ మ్యాపింగ్, పరీక్ష, స్క్రీనింగ్ సైట్‌లలో గుర్తించబడిన పెండింగ్ హెచ్ఐవి రియాక్టివ్ కేసుల హెచ్ఐవి నిర్ధారణతో పాటు హెచ్ఐవి, ఎస్టిఐ చికిత్స సేవలు, ఎఆర్టి ప్రకారం ఎఆర్టి మాత్రల పంపిణీ వంటి సేవలందిస్తారన్నారు. ఈ మొబైల్ ఐసిటిసిలలో కౌన్సెలర్, ల్యాబ్ టెక్నీషియన్, డ్రైవర్, అటెండెంట్లు సేవలందిస్తారన్నారు. వీటి నిర్వహణకయ్యే వార్షిక వ్యయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు. న్యాకో గ్లోబల్ ఫండ్ ఫర్ ఎయిడ్స్, టిబి మరియు మలేరియా (GFATM) కింద ఎపిశాక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (APMSIDC) ద్వారా ఒక్కో వాహనం రూ.30.6 లక్షలు వంతున మొత్తం 10 వాహనాలను కొనుగోలు చేసిందన్నారు. హెచ్ఐవి వైరస్ బారినపడి ఇన్ఫెక్షన్ నిర్ధారణ అయిన వారికి ఎఆర్టి కేంద్రాల ద్వారా ఉచితంగా మందులు, వైద్య చికిత్స అందచేస్తున్నామని మంత్రి చెప్పారు. ఈ కేంద్రాల ద్వారా క్రమంగా ఆర్నెల్లపాటు వైద్య చికిత్స అందుకున్న వారికి ప్రభుత్వం నెలకు రు. 4వేల వంతున పెన్షన్ అందచజేస్తోందన్నారు. ఆర్నెల్లపాటు ఎఆర్టి కేంద్రాల ద్వారా వైద్య చికిత్స అందుకున్న వారి వివరాలు ఎపిశాక్స్ కు ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతాయని, దాని ఆధారంగా ప్రభుత్వం వారికి పెన్షన్ అందచేస్తుందన్నారు.

25,00,000 హెచ్ఐవీ పాజిటివ్ కేసులు
ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమ వివరాల తాజా సమాచారం ప్రకారం, దేశంలోని మొత్తం 25 లక్షలకు పైగా హెచ్ఐవి పాజిటివ్ నిర్ధారణ కేసులు వుండగా, అందులో 2.22 లక్షల కేసులు మన రాష్ట్రంలో ఉన్నాయని మంత్రి సత్యకుమార్ అన్నారు. మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండవ అత్యధిక హెచ్ఐవి పాజిటివ్ నిర్ధారణ కేసులను కలిగి ఉందన్నారు. అయితే, హెచ్ఐవి వ్యాప్తి నియంత్రణలో రాష్ట్రం గణనీయమైన పురోగతిని సాధించిందన్నారు. 1998 నాటితో పోలిస్తే 2.4 శాతం మేర వున్న వైరస్ వ్యాప్తిని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చామని, ప్రస్తుతం రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి రేటు 0.62 శాతానికి తగ్గిందని చెప్పారు. ఈ వైరస్ వ్యాప్తిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు. ఎయిడ్స్ నియంత్ర‌ణ‌లో ఏపిశాక్స్ మ‌రింత చిత్త‌శుద్ధితో ప‌నిచేయాల‌ని మంత్రి సూచించారు.

వ్యాధి సోకటం నేరం కాదు కానీ

హెచ్ఐవి నిర్మూలనకు సంబంధించి ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం వుందన్నారు. హెచ్ఐవి సోకటం నేరమేమీ కాదని, పొరపాట్ల కారణంగా ఈ వైరస్ సోకే అవకాశాలున్నాయన్నారు. ఇందుకు సంబంధించి క్రితం నాటి ఒక ఘటనను మంత్రి ఈ సందర్భంగా వివరించారు. వ్యాధి సంక్రమించినంత మాత్రాన నిరాశపడాల్సిన అవసరం లేదనీ, ఎఆర్టి సెంటర్లలో మందులు తీసుకుంటూ జీవితాన్ని పొడిగించుకోవచ్చనీ నఅన్నారు. సంక్రమిత(CD) వ్యాధుల నుండి మాత్రమే కాక అసాంక్రమిత(NCD) వ్యాధుల నుండి కూడా ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు.

లైఫ్ స్టైల్ కూడా మార్చుకోవాలి

ప్రభుత్వ కృషిలో స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. జీవన విధానంలో కొద్దిపాటి మార్పులు చేసుకోవటం ద్వారా రక్తపోటు, మధుమేహం వంటి అసాంక్రమిత వ్యాధుల బారిన పడకుండా రక్షణ పొందాలని సూచించారు. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత పరీక్షలకు ప్రజలు ముందుకొచ్చి, సహకరించాలని మంత్రి కోరారు. ఆర్థిక వనరుల లోటు వున్నప్పటికీ ప్రజారోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య ఆరోగ్య రంగం బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారని మంత్రి వివరించారు.

40,000 మంది మరణాలు

ఏటా 70 వేల మంది క్యాన్స‌ర్ బారిన పడగా, 40 వేల మంది చనిపోతున్నారని దీనికి కారణం అవగాహన లోపమేన‌ని అన్నారు. 6 నెలల నుండి 18 సంవత్సరాల వయస్సు కలిగిన వారికి ప్రభుత్వం 40 రకాల వైద్య పరీక్షలను నిర్వహించి వారి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుందన్నారు. ప్రజల ముందుకే తీసుకువచ్చిన వైద్య పరీక్షల వాహనాల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. ప్రజల జీవనశైలిలో మార్పులు రావాల్సి ఉందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సియస్ ఎం.టి.కృష్ణ బాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ , ఎపిశాక్స్ పీడీ డాక్టర్ ఎ.సిరి, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News