ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటికే రెండు నియోజకవర్గాల అభ్యర్థుల విజయం ఖరారు అయిపోయింది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్(Alapati Rajendra) ఘన విజయం సాధించారు. ఇంకా రెండు రౌండ్ల లెక్కింపు మిగిలి ఉన్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ దాటేశారు. మొత్తం 9 రౌండ్లు పూర్తయ్యే సరికి పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుపై 82,320 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం 2,41,873 ఓట్లు పోలయ్యాయి
ఇక ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్ ముగిసేసరికి 16,520 ఓట్లు సాధించగా.. స్వతంత్ర అభ్యర్థి దిడ్ల వీరరాఘవులుకు 5,818 ఓట్లు వచ్చాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే కూటమి అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించిన సంగతి తెలిసిందే. పోటాపోటీగా జరిగిన ఈ ఎన్నికలో ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ మీద ఆయన విజయం సాధించారు. తొలుత తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. అయితే ఇందులో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా శ్రీనివాసులు గెలుపొందారు.