Weather Update: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా కొనసాగుతుండగా.. తమిళనాడు నాగపట్నానికి 570 కిమీ, చెన్నైకి ఆగ్నేయంగా 600 కిమీ దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం రానున్న 24 గంటల్లో శ్రీలంక మీదుగా కొమరిన్ వైపు వెళ్తుందని ఐఎండీ పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు దక్షణ కోస్తాఆంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.
వాయుగుండం ప్రభావంతో రేపు ఆదివారం అల్లూరి సీతరామరాజు, ఏలూరు, నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్ కడప, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అటు ఏలూరు, అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మిగిలిన చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.
ఈ రెండు రోజులలో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, నంద్యాల, కర్నూలు, వైయస్సార్, అనంతపురం జిల్లాలలో పలుచోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నెలలో ఇప్పటికే కురిసిన వర్షాలతో సతమతమయిన రైతులు ఈ వాయుగుండంతో మరింత ఆందోళన చెందుతున్నారు.