నంద్యాల(తెలుగుప్రభ): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పక్కాగా అమలు చేస్తూ, అన్ని ఏర్పాట్లను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్ నుంచి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓలు, ఈఆర్వోలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర ఎన్నికల అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హైకోర్టు తాజా ఆదేశాల మేరకు 2026 జూలై 15వ తేదీ వరకు నమోదైన అర్హులైన ఓటర్లందరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనుబంధ ఓటర్ల జాబితాల్లోని వివరాలను వార్డుల వారీగా క్రోడీకరించి, తుది జాబితా ప్రచురణకు అవసరమైన చర్యలను గడువులోగా పూర్తి చేయాలని ఈఆర్వోలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి అక్టోబర్ 21, 24 తేదీల్లో రెండు విడతల్లో శిక్షణ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.ఈ నెల 21న నంద్యాలలో ప్రిసైడింగ్ అధికారులకు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 24న ఆళ్లగడ్డ, ఆత్మకూరు, బేతంచెర్ల, డోన్, నందికొట్కూరు, నంద్యాల కేంద్రాల్లో సంబంధిత మున్సిపల్ కమిషనర్ల పర్యవేక్షణలో రెండో విడత శిక్షణ నిర్వహించాలని సూచించారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును పర్యవేక్షించే ఎంసీసీ, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, వ్యయ పరిశీలన బృందాలు క్షేత్రస్థాయిలో విధుల్లో చేరినట్లు ధ్రువీకరించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాల వారీగా బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని సిద్ధం చేయడంతోపాటు, నిబంధనల ప్రకారం బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తి చేయాలని సూచించారు. సున్నితమైన, అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించిన అనంతరం అవసరమైన వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల నియామకానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు, అలసత్వానికి తావులేకుండా పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

