రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ బీమా అమలు చేయాలని, విపత్తు సమయాల్లో రైతులకు న్యాయం జరగాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు.
పంటల బీమాపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యవసాయ, ఉద్యాన శాఖ ఉన్నతాధికారులతో సోమవారం మధ్యాహ్నం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు..
కేంద్ర ప్రభుత్వం సూచించిన విధానాల్లో ఉత్తమ విధానం బీమాకు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వంలో బీమా వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని, ప్రీమియం చెల్లింపులు జరగలేదని అన్నారు. విపత్తు సమయాల్లో రైతులకు న్యాయం జరిగేలా బీమా అమలు కావాలని సూచనలు చేశారు. దిగుబడి బట్టి, వాతావరణ పరిస్థితుల బట్టి బీమా అమలులో ఉన్న అవకాశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు.
బీమా అమలు, క్లైమ్ లు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపారు. వైసీపీ ప్రభుత్వంలో మామిడి రైతులకు బీమా అమలు చేయలేదని, తిరిగి ఈ ప్రభుత్వంలో మామిడి రైతులకు బీమా అమలు చేసే అవకాశాలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఉద్యాన, మత్స్య శాఖల కార్యదర్శి అహ్మద్ బాబు, వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు, ఉద్యాన శాఖ కమిషనర్ కె.శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.