ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీకి కీలక నేతలు గుడ్ బై చెబుతున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీకి రాజీనామా చేసిన నేతలు టీడీపీ, జనసేనలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని(Alla Nani) టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. రేపు(బుధవారం)ఉదయం 11 గంటలకు ఆయన పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు(CM Chandrababu) సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నట్లు ఏటూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆళ్ల నాని టీడీపీలోకి రావడం పార్టీ కార్యకర్తలకు ఇష్టం లేదని… కానీ అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని వెల్లడించారు. వైసీపీ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారని చెప్పారు.
కాగా వైసీపీ ప్రభుత్వంలో వైద్యాశాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఆళ్ల నాని రెండున్నరేళ్లు పాటు బాధ్యతలు నిర్వర్తించారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో పాటు ఆయన కూడా ఏలూరు ఎమ్మెల్యేగా ఓడిపోయారు. దీంతో సైలెంట్ అయిన నాని రెండు నెలల క్రితం వైసీపీకి, పార్టీ పదవులకు రాజీనామా చేశారు.