Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: టచ్ చేసి చూడండి తెలుస్తుంది ఎమ్మెల్యే గంగుల

Allagadda: టచ్ చేసి చూడండి తెలుస్తుంది ఎమ్మెల్యే గంగుల

ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను కూడా చూసి చదివలేని వ్యక్తి నారా లోకేష్ అని, ఆయన కూడా నన్ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఆయన నారా లోకేష్ ఆరోపించిన మాటలపై విలేకరులతో మాట్లాడారు. మూడు తరాలుగా తమ కుటుంబాన్ని ఆదరిస్తున్నారంటే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి అన్నారు. మంచి చేస్తేనే కదా ఆదరించేది అన్న విషయం తెలుసుకోకుండా నారా లోకేష్ ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. అవినీతి, అక్రమాలు ఈ నియోజకవర్గంలో ఎవరు పాల్పడ్డారో అందరికి తెలుసునన్నారు. శివరామిరెడ్డి అనే వ్యక్తి క్రషర్‌ను అక్రమంగా లాక్కునేందుకు ఎవరు ప్రయత్నించారో, యూనియన్ బ్యాంక్‌లో ఎవరు రూ.20 కోట్లు ఎగ్గొట్టారో, విజయపాల డైరీకి రూ.1 కోటి 40 లక్షలు ఎవరు ఎగ్గొట్టారో, బ్యాంకులో ఉన్న పొలాన్ని ఎవరు అమ్ముకున్నారో, బి-ట్యాక్స్ ఎవరు వసూలు చేశారో, పర్సెంటేజి ఇవ్వనందుకు ఎవరు రోడ్లు వేయకుండా నిలిపివేశారో, ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారుల పేరుతో ఎవరు కిడ్నాప్‌కు ప్రయత్నించారో ప్రపంచంలో అందరికి తెలుసునన్నారు. ఇవే కాక తన తల్లిదండ్రులు చేసిన అప్పులను ఎవరు ఎగిరేశారో కూడా అందరికి తెలుసు అన్నారు. దొంగే దొంగ అన్నట్లు టీడీపీ నేతల తీరు ఉందన్నారు. తాను ఇసుక, ఎర్రమట్టి, అక్రమంగా 200 ఎకరాలు భూములు కొన్నట్లు లేనిపోని ఆరోపణలు చేశారని, ఇసుక, ఎర్రమట్టి విషయం తనకు సంబంధం లేదని అన్నారు. అలాగే 200 ఎకరాలు ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో కొనుగోలు చేసినట్లు నిరూపిస్తే ఆ భూమి మొత్తం లోకేష్‌ పేరుపై రాసిస్తాన్నారు.

- Advertisement -

2019 అఫిడెవిట్‌లో ఎంత ఆస్తులున్నాయో, ఇప్పుడు ఎంత ఆస్తులున్నాయో మీడియా ముఖంగా నిరూపించడానికి సిద్ధమన్నారు. తాము స్థానిక టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించినట్లు ఆరోపిస్తున్నారని, తాను ఎమ్మెల్యే అయిన తరువాత ఒక్క కేసు కూడా పెట్టించిన దాఖలాలు లేవన్నారు. ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులనని హైదరాబాద్‌లో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి అడ్డంగా దొరికిపోయి కేసు పెట్టించుకున్నారని, అలాగే నకిలీ కరోనా సర్టిఫికెట్ సృష్టించి మరో కేసు పెట్టించుకున్నారని, తన సొంత అన్న ఆస్తి విషయంలో గోడ కూలగొట్టి ఆయన ఆగ్రహానికి గురై కేసు పెట్టించుకున్నారని అన్నారు. అలాగే 2019 వరకు వాళ్ళేంటే తిరిగిన శివరామిరెడ్డి అనే వ్యక్తి క్రషర్‌ను లాక్కునేందుకు ప్రయత్నిస్తే ఆయన కేసు పెట్టారని, నంద్యాలలో సొంత పార్టీ నేతలు లోకేష్ పాదయాత్రకు వంద కిలో మీటర్ల దూరంలో గొడవ పడి కొట్టుకుంటే కేసులు పెటు్టకున్నారని, ఇందులో తమకు గాని, తమ పార్టీ నేతలకు గాని ఎక్కడ సంబంధం ఉందో చూపించాలని సవాల్ విసిరారు. ఆళ్ళగడ్డకు భూమా రాజకీయం ఏంటో చూపిస్తామని చెబుతున్నారని, తోడలు కొట్టడాలు, మీసాలు తిప్పడాలను ప్రజలు హర్షించడం లేదని, ఆ రాజకీయాలు ఎప్పుడో పోయాయని అన్నారు. ప్రజలు ప్రశాంతత కోరుకుంటున్నారని ఆ దిశగానే ముందుకు వెళతామని చెప్పారు. కేసులు పెట్టాలన్నా, దాడులు చేయాలన్నా మాకు అవసరం లేదని, ఇద్దరు రౌడీషీటర్లను పెట్టుకొని మీలా కొంతమంది చిల్లర వ్యక్తులను పెట్టుకుంటే ఏమైనా చేయొచ్చన్నారు. చిల్లర మాటలు మాట్లాడి స్థాయిని దిగజార్చుకుంటే ప్రజలు హర్షించరన్న విషయాన్ని గుర్తించుకోవాలని సూచించారు. నారా లోకేష్ సౌమ్యుడు అనుకుంటే ఏ నియోజకవర్గానికి వెళితే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేపై బట్టకాల్చి మొఖానికి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు. 2024లో అధికారంలోకి వస్తామని నారా లోకేష్ కలల ప్రపంచంలో విహరిస్తున్నారని అది ఎప్పటికి జరగని పని అని చెప్పారు. 2019లోనే మంగళగిరి ప్రజలు నారా లోకేష్ లంగోటిని ఊడదీసి పంపించారని, 2024లో నియోజకవర్గం నుంచే తరిమివేయడం ఖాయమని అన్నారు. నోరు అదుపులో పెట్టుకొని వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని, అవాస్తవాలు మాట్లాడితే ప్రజలు హర్షించరన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పాల్సింది పోయి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, నిరాధార ఆరోపణలు చేయడం ఏంటని నిలదీశారు. తాము అధికారంలోకి రాక ముందు ఎమ్మెల్యే అయితే డిగ్రీ కాలేజ్, 50 పడకల ఆసుపత్రి, తెలుగుగంగ లైనింగ్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చి చేసి చూపించామన్నారు. మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పకుండా అధికారంలోకి వచ్చాక కేసులు పెడతాం, భూమా రాజకీయం చేస్తాం అని బెదిరిస్తే ఇక్కడ భయపడే వారు ఎవరు లేరని ప్రజలు కూడా అలాంటి రాజకీయాలు కోరుకోవడం లేదని, ప్రశాంతతను కోరుకుంటున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో విజయ పాలడైరి చైర్మన్ ఎస్‌వి జగన్‌మోహన్‌రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ గంధం రాఘవరెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి షేక్ బాబులాల్, ఎంపీపీలు గజ్జల రాఘవేంద్రారెడ్డి, అమర్‌నాథరెడ్డి, వీరభద్రుడు, కౌన్సిలర్ సుధాకర్‌రెడ్డి, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్ నరసింహారెడ్డి, సింగం వెంకటేశ్వరరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నయూబ్ రసూల్, సలాం, నజీర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News