ఆలూరు (తెలుగు ప్రభ): ఆకలితో అలమటించే విద్యార్థుల కడుపు నింపి, విద్యనందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ క్షేత్రస్థాయిలో అక్రమార్కుల పాలిట కామధేనువుగా మారుతోంది. నిరుపేద పిల్లల నోటికాడ ముద్దను లాగేస్తూ, వారి ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఉదంతం కర్నూలు జిల్లా ఆలూరులో వెలుగు చూసింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రాంగణంలో ఆకలి కేకలు మిన్నంటుతుంటే… బాధ్యత వహించాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యపు నిద్రలో జోగుతోంది.
రట్టు అయిన ‘గుడ్ల’ భాగోతం: పాఠశాలలో విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలు లేని భోజనం వడ్డిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో, ఎస్ఎఫ్ఐ (SFI) విద్యార్థి సంఘం నాయకులు ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడి పూర్వానుమతితో ఆలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణానికి వెళ్లారు. అక్కడ భోజనాలు వడ్డిస్తున్న సమయంలో దారుణమైన నిజం బయటపడింది.
ప్రభుత్వం నిబంధనల ప్రకారం విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన కోడిగుడ్లను, వంట ఏజెన్సీ నిర్వాహకులు విద్యార్థులకు ఇవ్వకుండా రహస్యంగా బయటి వ్యక్తులకు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. కొందరు బయటి వ్యక్తులు గుడ్ల సంచులను పాఠశాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా బయటకు తరలిస్తుండగా ఎస్ఎఫ్ఐ నాయకులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
‘మా ప్రభుత్వమే ఉంది.. ఏం చేసుకుంటారో చేసుకోండి!’: అక్రమాలను నిలదీసిన విద్యార్థి నాయకులపై వంట ఏజెన్సీ నిర్వాహకులు బరితెగించి ప్రవర్తించారు. విచారణ జరుగుతున్న సమయంలోనే ఏజెన్సీ నిర్వాహకులు తమ అనుచరులను, స్థానిక గూండాలను పాఠశాల ప్రాంగణానికి పిలిపించారు. “ఇప్పుడున్నది మా ప్రభుత్వం, మేం అనుకున్నదే చేస్తాం… మీరేం చేసుకుంటారో చేసుకోండి!” అంటూ బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రభుత్వ వ్యవస్థలను, అధికారులను లెక్కచేయకుండా, రాజకీయ బలంతో విద్యార్థుల హక్కులను కాలరాస్తున్న వైనం అక్కడ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
2,388 మంది విద్యార్థులు… కేవలం 5 గురు వంటవారు : ఈ పాఠశాల కాంప్లెక్స్ పరిధిలో విద్యార్థుల నిష్పత్తికి, వంట సిబ్బంది సంఖ్యకు పొంతన లేకుండా పోయింది:
జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు: 1,876 మంది
ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు: 512 మంది
మొత్తం విద్యార్థుల సంఖ్య: 2,388 మంది
నిర్వహిస్తున్న వంట సిబ్బంది: కేవలం 5 గురు మాత్రమే
ఒకే వంట ఏజెన్సీ రెండు విద్యాసంస్థల బాధ్యతలను స్వీకరించడం, నిబంధనలకు విరుద్ధంగా అరకొర సిబ్బందితో నెట్టుకురావడం వల్ల విద్యార్థులు భోజనం కోసం గంటల తరబడి ఎండలో క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోంది. మధ్యాహ్నం వేళ పాఠాలు వినాల్సిన సమయం కాస్తా… క్యూలైన్లలోనే కరిగిపోతోంది.
ఫిర్యాదులు ఇచ్చినా ఫలితం శూన్యం: ఈ ఘోరమైన అక్రమాలపై ఇప్పటికే పలుమార్లు తల్లిదండ్రులు, విద్యార్థులు అధికారులకు మొరపెట్టుకున్నారు. త్రిసభ్య కమిటీ, తాసిల్దార్, ఎంపీడీవో, ఎంఈఓలకు వినతిపత్రాలు అందజేసినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. బుధవారం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ పిలుపు మేరకు నాయకులు తహశీల్దార్ లక్ష్మీరాజుకు, ఇన్చార్జ్ ఎంపీడీవో శ్రీనివాసరావుకు వినతిపత్రాలు సమర్పించారు.
ఈ అక్రమాలపై పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు కబీర్ సాబ్, ఎంఈఓ-2లను వివరణ కోరగా నిస్సహాయత వ్యక్తం చేశారు. “వంట ఏజెన్సీ నిర్వాహకుడికి ఇప్పటికే పలుమార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చాం. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఏజెన్సీని తొలగించడం అనేది ఒకరి చేతిలో లేదు. త్రిసభ్య కమిటీ నిర్ణయం మేరకే తదుపరి చర్యలు ఉంటాయి” అని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్త ఆందోళనకు ఎస్ఎఫ్ఐ పిలుపు : విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కాంట్రాక్టర్ తీరుపై ఎస్ఎఫ్ఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే సదరు కాంట్రాక్టర్ కాంట్రాక్టును రద్దు చేసి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగానే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహించి పెద్దఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించింది. ప్రభుత్వం సత్వరమే స్పందించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.

