రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని పెద్దఎత్తున ప్రమోట్ చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 5 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం సాగవుతోంది. 2028-29 నాటికి రాష్ట్రంలో 40 లక్షల మంది రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించి, తద్వారా 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం సాగయ్యేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. రైతు సాధికార సంస్థ ద్వారా ప్రకృతి సేద్యం వల్ల కలిగే లాభాలను రైతులకు వివరిస్తోంది. మరోవైపు ఈ రంగంలో ఉన్న అవకాశాలను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. రైతుకు అవసరమైన తోడ్పాటును అందించేందుకు వివిధ సంస్థలతో కలిసి పనిచేయనుంది.
దావోస్ టూర్లో
ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల దావోస్ పర్యటనలో పలు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను వివరించారు. ప్రకృతి వ్యవసాయంలో ఎపితో కలిసి పనిచేసేందుకు రావాలని పలు సంస్థలను ఆహ్వానించారు. ఈ క్రమంలో నాడు చంద్రబాబుతో భేటీ అయిన పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సంస్థల ప్రతినిధులు ఎపికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఛైర్మన్ క్రేయిగ్ కోగుట్, ఆపరేటింగ్ అడ్వైజర్ గినా మెగ్‌కార్తీ, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సీఈవో కీత్ అగోడా ముఖ్యమంత్రితో సచివాలయంలో సమావేశం అయ్యారు. దావోస్ సమావేశానికి కంటిన్యూ మీటింగ్‌గా జరిగిన నేటి సమావేశంలో రానున్న రోజుల్లో కలిసి పనిచేసే అంశాలపై చర్చించారు. ప్రకృతి వ్యవసాయం, భిన్నమైన వాతావరణాన్ని తట్టుకోగల పంటలను అందించడం, రైతు నుండి వినియోగదారు వరకు ఎండ్-టు-ఎండ్ అనుసంధాన వ్యవస్థను రూపొందించడం, మార్కెట్ డెవలప్‌మెంట్, ఫైనాన్సింగ్, డేటా మేనేజ్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడంపై ఈ సంస్థలు సహాయపడనున్నాయి. పబ్లిక్, ప్రైవేట్ సంస్థల నుంచి ఆర్థిక సాయాన్ని అందిచేందుకు సహకారాన్నిస్తాయి. ప్రకృతి వ్యవసాయ పర్యావరణ వ్యవస్థ కోసం ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ప్రమోట్ చేస్తాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన రైతు సాధికార సంస్ధతో పెగాసస్ క్యాపిటల్ అడ్వజైర్స్, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సంస్థలు ఎంవోయూ చేసుకోనున్నాయి.

ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో అవకాశాలను, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను, ప్రస్తుత పరిస్థితులను ఆ సంస్థల ప్రతినిధులకు వివరించారు. ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయని, ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతోందని అన్నారు. తాము తీసుకునే ఆహారంపై వారు అవగాహన కోరుకుంటున్నారని అన్నారు. రానున్న రోజుల్లో ఆహార ఉత్పత్తుల సర్టిఫికేషన్, ట్రేసబులిటీ అనేది కీలకం కానుందని అన్నారు. ఆ దిశగా తాము రైతులను, ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రకృతి సేద్యం తన కల అని చెప్పిన సిఎం, రైతుల్లో చైతన్యం తెచ్చి అనుకున్న లక్ష్యాలను సాధిస్తాం అని అన్నారు. దీనికి సహకరించాల్సిందిగా ఆ సంస్థల ప్రతినిధులను కోరారు.
